మొండి మోడీ దెబ్బకు దిగొచ్చాడు

నరేంద్ర మోడీ ప్రభుత్వ హయాంలో నిర్ణయాలకు ఎదురేలేదు అన్న ధోరణికి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. వ్యవసాయ చట్టాలపై రైతులు దాదాపు విజయం సాధించారు. చట్టాలను అడ్డదారుల్లో ఆమోదించుకున్న [more]

Update: 2021-01-21 16:30 GMT

నరేంద్ర మోడీ ప్రభుత్వ హయాంలో నిర్ణయాలకు ఎదురేలేదు అన్న ధోరణికి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. వ్యవసాయ చట్టాలపై రైతులు దాదాపు విజయం సాధించారు. చట్టాలను అడ్డదారుల్లో ఆమోదించుకున్న మొండి కేంద్ర ప్రభుత్వం దిగి రాకతప్పలేదు. ఇది ప్రతిపక్షాలు, న్యాయస్థానాలు సాధించిన విజయం కాదు. ప్రజా విజయం. ఢిల్లీలో రైతులు అకుంఠిత దీక్షతో చేసిన పోరాట ఫలితం. ప్రభుత్వానికి ఎంత మెజార్టీ ఉన్నప్పటికీ ప్రజాందోళనకు తల వంచక తప్పదన్న సత్యం నిరూపితమైన సందర్భం. పూర్తిగా చట్టాలను ఉపసంహరించుకోలేదు కదా అని ఎవరైనా అనవచ్చు. చట్టాలను ఏడాదిన్నరపాటు నిలిపివేస్తామని ప్రతిపాదించడమంటే దాదాపు వెనక్కి వెళ్లిపోయినట్లే. దానికి తోడు ప్రభుత్వం, రైతు సంఘాలతో వేసిన కమిటీ చెప్పిన మేరకు తదుపరి చట్టాలపై నిర్ణయం ఉంటుందనే భరోసా ఇస్తోంది . ఎలాగూ ఏకాభిప్రాయం రాదు. కాబట్టి చట్టాల రద్దుకు ముద్దు పేరుగా నిలిపివేతను చూడవచ్చు. రద్దు అన్న రాజకీయ అపవాదు తనపై పడకుండా పరువు దక్కించుకునే క్రమంలో భాగంగానే ఈ చట్టాల నిలిపివేత అనే మధ్యే మార్గాన్ని కేంద్ర ఎంచుకోవాల్సి వచ్చింది.

నిస్సహాయ నిర్ణయం….

సుప్రీం కోర్టు ఆదుకుంటుందని కేంద్రం చాలా ఆశలు పెట్టుకుంది. ఆందోళన మొదలైన నాటి నుంచి న్యాయస్థానం ప్రస్తావనను కేంద్రమే తెస్తోంది. చట్టాలను సుప్రీం కోర్టులో సవాల్ చేయాలంటూ రైతులకు సూచించింది. కానీ కోర్టులు చట్టాల రాజ్యాంగ బద్ధతను చూస్తాయే తప్ప ప్రజా ప్రభుత్వానికి ఉద్దేశపూర్వకంగా వ్యతిరేక తీర్పులు ఇవ్వజాలవు. పైపెచ్చు మెజార్టీ ఆమోదంతో పార్లమెంటుచేసిన చట్టాలను అడ్గగోలుగా కొట్టేయడానికి సాహసించవు. తీవ్రమైన రాజ్యాంగ ఉల్లంఘనలు ఉంటే తప్ప. అందుకే సుప్రీం కోర్టు ఎలాగూ చట్టాలపై సానుకూలతను కనబరుస్తుంది కాబట్టి తమకేం కాదనే ధీమాను కేంద్రం తొలుత కనబరిచింది. రాన్రానూ ఆందోళన తీవ్రం కావడంతో తీర్పు కాకపోయినా ఏదో ఒక కమిటీ రూపంలో న్యాయస్థానం బయటపడేస్తుందని ఆశించింది. దానికి రైతు సంఘాలు సానుకూలత కనబరచలేదు. కమిటీలో ప్రాతినిధ్యం వహించే సభ్యుల గత దృక్పథాన్ని ప్రశ్నించారు.. దీంతో న్యాయస్థానమూ నిస్సహాయమైపోయింది. సాధారణంగా మధ్యవర్తి పాత్రకు న్యాయస్థానాలు పూనుకోవు. రాజ్యాంగం ఏమంటుందో, చట్టాల న్యాయాధికారం ఎంతవరకో సమీక్షిస్తాయి. తదనుగుణంగా తీర్పులు చెబుతాయి. అయితే తీవ్రమైన ఆందోళనతో కూడిన అంశం కావడంతో ప్రభుత్వ రెస్క్యూకు సుప్రీం కొంత మేరకు చొరవ చూపింది. అయితే ప్రయత్నాలు ఫలించలేదు.

తప్పనిసరి అవసరం..

గడ్డకట్టే చలిలో ప్రజాస్వామ్యయుతంగా , శాంతిపూర్వకంగా రైతాంగం ఆందోళన చేస్తోంది. వారిని రెచ్చగొట్టే చర్యలకు రకరకాల శక్తులు పూనుకుంటున్నాయి. ఇందులో రాజకీయాలది కూడా ప్రధానపాత్రే. రిపబ్లిక్ డే సందర్భంగా ట్రాక్టర్ల ర్యాలీ చేస్తామని చేసిన హెచ్చరిక ప్రభుత్వానికి ఆందోళన కలిగిస్తోంది. దేశరాజధానిని చేర్చి ఉన్న హర్యానా, పంజాబ్ లనుంచి రైతులు వేలాదిగా ట్రాక్టర్లపై ముట్టడికి బయలు దేరితే అదుపు చేయడం కష్టం. బలవంతంగా ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తే హింసకు దారి తీయవచ్చు. దేశంలోనే కాదు అంతర్జాతీయంగా ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం వాటిల్లుతుంది. దేశవ్యాప్తంగా రైతాంగంలో అలజడికి దారి తీస్తుంది. ప్రమాదం పొంచి ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకుని ర్యాలీపై సుప్రీం నిర్ణయం వెలువరించాలంటూ తెలివిగా న్యాయస్తానాన్ని వివాదంలోకి లాగాలని ప్రయత్నించింది ప్రభుత్వం. సుప్రీం కోర్టు తీర్పు మేరకు ర్యాలీని నిషేధించి తమ చేతికి మట్టి అంటకుండా చూసుకోవాలని ప్రయత్నించి భంగపడింది. ర్యాలీకి అనుమతులు, నిషేధాలు తమ పరిధిలోకి రావని పోలీసులే చూసుకోవాలంటూ సుప్రీం తిప్పికొట్టింది. దీంతో మళ్లీ బంతి కేంద్ర ప్రభుత్వం చేతిలోకి వచ్చి పడింది.

ముందు వెనకల అయోమయం…

ఈ చట్టాలను చేసేందుకు వివిధ రాజకీయ పార్టీలపై సామదానభేదోపాయాలను ప్రయోగించి దారికి తెచ్చుకుంది ప్రభుత్వం. బీజేపీ విధానాలతో విభేదించే ప్రాంతీయ పార్టీల నాయకులు సైతం తల ఊపక తప్పలేదు. కేసీఆర్ వంటి వారు తొలుత వ్యతిరేకించినా తర్వాత సైలెంట్ అయిపోయారు. వంత పాడుతున్నారు. ఈ స్థితిలో చట్టాలకు దాదాపు ఎదురులేదని రెండు నెలల క్రితం వరకూ కేంద్ర ప్రభుత్వం భావించింది. ఈ చట్టాల వల్ల వ్యవసాయ రంగంపై కార్పొరేట్ సంస్థల పెత్తనం పెరుగుతుందనే వాదన ఉంది. అదే సమయంలో వ్యవసాయ రంగంలో లాభదాయకత పెరుగుతుంది. రైతులకు గిట్టుబాటు ధర వస్తుందనే భావన సైతం ఉంది. రైతులు కార్పొరేట్ల గుప్పెట్లోకి వెళ్లిపోయి స్వేచ్ఛను కోల్పోతారనేది ఆందోళన కారుల వాదన. ఏదేమైనప్పటికీ ఈ చట్టాలకు రెండు వైపులా పదునుంది. అమలు చేసేటప్పుడు సక్రమంగా అమలు చేస్తే రైతు ప్రయోజనాలు నెరవేరతాయి. లేదంటే కార్పొరేట్ల లాబీయింగ్ కు లొంగిపోతే రైతాంగం దెబ్బతింటుంది. కనీస మద్దతు ధరకు హామీలేని ఈ చట్టాల వల్ల తక్షణ రైతాంగ సమస్యలు పెరుగుతాయని రైతు నేతలు బలంగా చెబుతున్నారు. దీర్గకాలంలో వ్యవసాయానికి మేలు చేకూరుతుంది. అందుకే ఎంత వ్యతిరేకత ఉన్నప్పటికీ వీటిని అమల్లోకి తేవాలని ప్రయత్నించినట్లుగా ప్రభుత్వం పేర్కొంటోంది. మొత్తమ్మీద ఇప్పటికే సుప్రీం కోర్టు తీర్పుతో చట్టాల అమలు నిలిచిపోయింది. రైతులు ఆందోళనను విరమించుకుంటే చట్టాలే ఏడాదిన్నరపాటు రద్దు అయిపోతాయి. అంటే దాదాపు ఈ ప్రభుత్వ హయాంలో ఇక పట్టాలకు ఎక్కడం కష్టమే. ప్రస్తుతం నిర్ణయం రైతు నాయకుల చేతులలోకి వచ్చింది. పూర్తిగా చట్టాల రద్దుకు మొండి పట్టుదల వహిస్తారా? ప్రభుత్వం దిగి వచ్చింది . తక్షణ ఉపశమనం కల్పిస్తోంది కాబట్టి సహిస్తారా? అన్నది తేలాల్సి ఉంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News