బాలయ్య బాధంతా అదేనట

చంద్రబాబు మాట తుచ తప్పని బావమరిది ఎవరైనా ఉంటే అది బాలకృష్ణేనని అంటారు. బావ చెప్పారా అయితే ఒకే అన్న టైప్ ఆయనది. అటువంటి బాలకృష్ణ గత [more]

Update: 2020-01-20 09:30 GMT

చంద్రబాబు మాట తుచ తప్పని బావమరిది ఎవరైనా ఉంటే అది బాలకృష్ణేనని అంటారు. బావ చెప్పారా అయితే ఒకే అన్న టైప్ ఆయనది. అటువంటి బాలకృష్ణ గత కొంతకాలంగా బావ మాటలను పక్కన పెడుతున్నారా అన్న చర్చ మొదలైంది. తెలంగాణాలోని హుజూర్ నగర్ ఉప ఎన్నికల ప్రచారానికి బాలకృష్ణని వెళ్ళమంటే ఆయన తొలిసారి నో అనేశారు. అది అప్పట్లో ఒక చర్చగా సాగింది. ఇక తాజగా అమరావతి పోరాటంతో చేదోడుగా రమ్మని పొలిస్తే ముఖం చాటేస్తున్నారు. ఇది ఇపుడు హాట్ టాపిక్ గా ఉంది. నిజానికి ఈ నెల 16 నుంచి 18 వరకూ మూడు రోజుల పాటు బాలయ్య అమరావతి రాజధాని ప్రాంత రైతులకు మద్దతుగా పర్యటించాల్సిఉంది. దీనికోసం షెడ్యూల్ ఖరార్ చేసి మరీ పార్టీ రిలీజ్ చేసింది. బాలకృష్ణ వస్తారని బాబు గట్టిగా నమ్మి ఈ ప్రోగ్రాం ఫిక్స్ చేశారు. మరి చేతిలో సినిమాలు కూడా లేని బాలకృష్ణ అమరావతి టూర్ కి మాత్రం డుమ్మా కొట్టేసారు.

ఫ్యామిలీ వచ్చినా…?

బాలకృష్ణ అనుంగు తమ్ముడు నందమూరి రామక్రిష్ణ సహా మొత్తం కుటుంబం అంతా తరలివచ్చి జై అమరావతి అంటూ నినదించింది. కానీ సినీ గ్లామర్ పుష్కలంగా ఉండి అన్నగారికి అసలైన వారసుడు అనిపించుకున్న బాలకృష్ణ రాకపోవడం పట్ల మాత్రం టీడీపీలో చర్చగానే ఉంది. బాలకృష్ణ ఎందుకు ఇలా చేస్తున్నారు, ఆయన కావాలని ఇలా చేశారా అన్న మాట కూడా వినవస్తోంది. మరి బాలకృష్ణకు, బావతో గ్యాప్ ఏమీ లేదని కూడా అంటున్నారు. అయితే మరి బాలయ్య పార్టీ ఆదేశించినా కూడా తరచూ వాటిని ఎందుకు పక్కన పెడుతున్నారన్న ప్రశ్నలు పుట్టుకొస్తున్నాయి.

ఓడిన తరువాత….

నిజానికి టీడీపీలో బాలకృష్ణ యాక్టివ్ రోల్ అంతా ఎన్నికల ముందు వరకూ సాగింది. ఒక దశలో మంత్రి పదవి దక్కలేదన్న అసంత్రుప్తి ఉన్నా కూడా తన అల్లుడికే ఇచ్చారు కదా అని సమాధానపరచుకుని మరీ పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాలుపంచుకున్నారు. ఎపుడైతే పార్టీ ఘోరంగా ఓడిపోయిందో నాటి నుంచే బాలకృష్ణ బాగా డల్ అయ్యారని అంటున్నారు. బాలయ్య టీడీపీ కచ్చితంగా గెలుస్తుందని, బాబు దక్షత‌ను విశ్వసించారు, సీన్ రివర్స్ కావడంతో ఆయన ఆలోచనల్లో పడ్డారని అంటున్నారు. అయిదేళ్ల పాటు విపక్షంలో చేసేది ఏమీ లేకపోవడం కూడాబాలకృష్ణ వెనక్కి తగ్గడానికి మరో కారణం అంటున్నారు.

పార్టీలో ప్రాధాన్యత…

మరో వైపు సొంత పార్టీ, తన తండ్రి పెట్టిన పార్టీలో తనకు సముచితమైన ప్రాధాన్యత లేదని బాలకృష్ణ కొంత బాధతో ఉన్నారని కూడా అంటున్నారు. హరిక్రిష్ణ మరణాంతరం ఖాళీ అయిన పొలిటి బ్యూరో మెంబర్ పోస్టులో కూడా బాలకృష్ణని నామినేట్ చేయకపోవడం పట్ల కూడా ఆయన కినుక వహించారని చర్చకు వచ్చింది. ఇక పార్టీలో బావా, అల్లుడు కీలక పాత్ర పోషిస్తూ నందమూరి కుటుంబాన్ని పక్కన పెట్టారని కూడా ఆయనలో ఆవేదన దాగుందని అంటున్నారు. ఇవన్నీ చూసిన తరువాతనే విరక్తిని పెంచుకున్న బాలకృష్ణ రాజకీయాలకు దూరం పాటిస్తున్నారని, మొక్కుబడిగానే ఆయన అసెంబ్లీకి హాజరవుతున్నారని చెబుతున్నారు. మరి బాలకృష్ణ మారుతారా, బావ మాటకు ఓకే చెబుతారా. అంటే చూడాలి.

Tags:    

Similar News