అసలైన కధ మొదలయిందట..?

ఎన్టీయార్ నట వారసుడిగా సక్సెస్ అయిన నందమూరి బాలకృష్ణ రాజకీయ వారసుడిగా నిరూపించుకోవాలనుకుంటున్నారు. అయితే ఆయనకు ఆ చాన్స్ ఇచ్చేందుకు బావ చంద్రబాబు సుతరామూ ఇష్టపడరు అన్న [more]

Update: 2021-06-12 08:00 GMT

ఎన్టీయార్ నట వారసుడిగా సక్సెస్ అయిన నందమూరి బాలకృష్ణ రాజకీయ వారసుడిగా నిరూపించుకోవాలనుకుంటున్నారు. అయితే ఆయనకు ఆ చాన్స్ ఇచ్చేందుకు బావ చంద్రబాబు సుతరామూ ఇష్టపడరు అన్న సంగతి తెలిసిందే. తానూ కొడుకూ మాత్రమే హై కమాండ్ అన్నది చంద్రబాబు మార్క్ పార్టీ రాజ్యాంగం. అయితే తన తండ్రి స్థాపించిన టీడీపీకి తాను ఏ విధంగానూ నాయకుడిని కాలేకపోతున్నానే అన్న ఆవేదన అయితే నందమూరి బాలకృష్ణలో ఉంది. ఆయన ఎపుడో కానీ బయట పడరు. తాజాగా మాత్రం ఆయన ఒక మీడియా ఇంటర్వ్యూలో తన మనసులో ఏముందో కక్కేశారు.

నేను రెడీ …?

తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవిని తాను నూరు శాతం అర్హుడినే అంటూ గర్జిస్తున్నారునందమూరి బాలకృష్ణ. తానేం తక్కువ అన్నట్లుగానే ఆయన మాట్లాడారు. అయితే తాను ఎవరినీ పదవిని అడగబోనంటూ పరోక్షంగా బావ బాబు మీద బాణాలు వేశారు. తనకంటూ ఒక టైమ్ వస్తుంది. ఆ రోజున తాను పదవులు చేపడతాను అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నందమూరి బాలకృష్ణ టీడీపీలో తన రాజకీయ వాటా కోరుకుంటూనే డెస్టినీ మీద నెపం పెడుతున్నారు. రాసి ఉంటే పదవులు వస్తాయన్నది ఆయన తాత్వికంగా చెబుతున్నారు.

అబ్బాయి మైనస్సే ..?

ఇక టీడీపీలో జూనియర్ ఎన్టీయార్ గురించి గట్టిగానే క్యాడర్ సౌండ్ చేస్తోంది. అది కూడా నందమూరి బాలకృష్ణకు కొంత చికాకుగా ఉంది అన్నది ఆయన మాటల బట్టి అర్ధమవుతోంది. జూనియర్ ఎన్టీయార్ వచ్చి ఏం చేస్తాడు అన్నట్లుగానే ఆయన మాట్లాడుతున్నారు. జూనియర్ పార్టీకి ప్లస్ అవుతాడా మైనస్ అవుతాడా అన్నది చెప్పలేమని ఆయన ఇండైరెక్ట్ గా చెప్పడం వెనక వేరే అర్ధాలు ఉన్నాయని తెలుస్తోంది. బాలయ్య ఆలోచనలు చూస్తే చంద్రబాబు తరువాత తానే టీడీపీని నడిపించగలను అని గట్టిగానే భావిస్తున్నారు అనుకోవాలి.

బద్ధలవుతుందా …?

అగ్నిపర్వతం గురించి నందమూరి బాలకృష్ణ ప్రస్తావించారు కాబట్టి ఇక్కడ ఒక మాట చెప్పుకోవాలి. రగులుతున్న అగ్నిపర్వతం ఎపుడైనా బద్ధలవుతుంది. మరి బాలయ్య కూడా ఏదో టైమ్ లో అలా బరస్ట్ అవుతారా. ఓపెన్ అవుతారా. ఆయన తనకూ ఒక టైమ్ వస్తుంది అంటున్నారు. ఆ టైమ్ వరకూ వెయిట్ చేస్తాను అని కూడా చెబుతున్నారు. మరి నందమూరి బాలకృష్ణ టైమ్ వచ్చాక గర్జిస్తారా. లేక అంతకు ముందే ఆయన్ని గుర్తించి గౌరవించి చంద్రబాబు ఇంకా పెద్ద పీట పార్టీలో వేస్తారా. ఇవన్నీ ప్రశ్నలే. ఇక్కడ మరో మాట కూడా చెప్పాలి. టీడీపీ విపక్షంలో ఉంది కాబట్టి ప్రెసిడెంట్ గిరీ కావాలని నందమూరి బాలకృష్ణ కోరుతున్నారు. మరి అధికారంలోకి వస్తే కచ్చితంగా సీఎం సీటు కూడా కోరుకుంటారా. తాను అన్నింటికీ అర్హుడిని అని ఆయనే చెప్పాక అలాగే అనుకోవాలి. అంటే బాలయ్య సైడ్ నుంచి చాలావరకూ స్పష్టత వచ్చింది. కానీ ఆయనని కేవలం పొలిట్ బ్యూరో మెంబర్ ని మాత్రమే చేసి గుంపులో గోవిందయ్యగా మార్చిన చంద్రబాబు కోరి మరీ అధ్యక్ష పీఠం అప్పచెబుతారా. మొత్తానికి టీడీపీలో ఇపుడు అసలైన కధ మొదలైందనే భావించాలి.

Tags:    

Similar News