సాత్ సాల్ జబర్దస్త్…?

ప్రధానిగా నరేంద్రమోడీ బాధ్యతలలో ఏడేళ్లు పూర్తయ్యాయి. పార్టీ పరమైన అజెండాను పూర్తి చేయడంలో దాదాపు సఫలీకృతమయ్యారు. గతంలో ఎన్డీఏ కు నాయకత్వం వహించిన ప్రధాని వాజపేయికి ఆ [more]

Update: 2021-06-01 15:30 GMT

ప్రధానిగా నరేంద్రమోడీ బాధ్యతలలో ఏడేళ్లు పూర్తయ్యాయి. పార్టీ పరమైన అజెండాను పూర్తి చేయడంలో దాదాపు సఫలీకృతమయ్యారు. గతంలో ఎన్డీఏ కు నాయకత్వం వహించిన ప్రధాని వాజపేయికి ఆ అదృష్టం దక్కలేదు. ఈ క్రెడిట్ మోడీ కే దక్కుతుంది. కానీ ప్రజాజీవన స్తితిగతులను మెరుగుపరచడంలో వైఫల్యం చెందారు. ఏకపక్ష ధోరణి,రాష్ట్రాలతో ఘర్షణాత్మక వైఖరి, తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లన్న చందంగా ప్రవర్తించే మొండితనం. మొత్తం కలిసి సర్కారుపై అసంతృప్తికి, ప్రజల ఆగ్రహావేశాలకు బీజాలు వేస్తున్నాయి. భావోద్వేగాలు, ప్రతీకాత్మక చర్యల ద్వారానే ప్రజలను ఆకట్టుకోవచ్చనుకునే ప్రయత్నాలు క్రమేపీ వికటిస్తున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. ఏడేళ్ల పాలనలో దేశం ఏం సాధించిందన్న ప్రశ్న వేసుకుంటే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న సమాధానం తన్నుకుని వస్తుంది. తొలి అయిదేళ్లలో అంతర్జాతీయంగా వచ్చిన ప్రతిష్ఠ సైతం ఇటీవలి కాలంలో మసకబారింది. మోడీ రూపంలో ప్రజలు ఊహించిన, ఆశించిన అద్భుతం అయోమయంగా కళ్లకు కడుతోంది. నిస్సహాయ భారత్ నిట్టూర్పులు విడుస్తోంది. బలమైన కేంద్రీకృత అధికారాలను గుప్పెట్లో పెట్టుకున్న భారత ప్రభుత్వమే దేశంలో నేటి దుస్థితికి కారణమని ప్రతి ఒక్కరూ అభిశంసిస్తున్నారు.

అజెండా ఓకే..

భారతీయ జనతాపార్టీ మూల సిద్దాంతాల ప్రాతిపదికన పాలించడానికే నరేంద్రమోడీ ప్రయత్నించారు. ఉమ్మడి పౌర స్మ్రుతి మినహా మిగిలిన పార్టీ అజెండాను సాకారం చేయగలిగారు. అంతవరకూ పార్టీ శ్రేణులకు సంతృప్తినిచ్చారనే చెప్పాలి. అయోధ్య రామాలయ నిర్మాణం, జమ్ము కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి రద్దు వంటి అంశాలు ఏ ఇతర ప్రభుత్వంలోనూ సాధ్యమయ్యే అంశాలు కావు. దీర్గకాలంగా ప్రజల భావోద్వేగాలతో ముడిపడిన విషయాలు. ఒక్కసారి వాటికి పరిష్కారం లభించిన తర్వాత అవి తమ ప్రాధాన్యాన్ని కోల్పోతాయి. అందుకే ఇప్పుడు ప్రజల మనోపథంలో బీజేపీ అజెండా ప్రాధాన్యం కోల్పోయింది. తమ జీవన ప్రమాణాలను ఎంతమేరకు ప్రభుత్వం మెరుగుపరచగలిగిందనే ప్రశ్నలు ప్రజానీకం నుంచి తలెత్తుతున్నాయి. నిరుద్యోగం దేశంలో గతంలో ఎన్నడూ లేని స్తాయికి చేరింది. మేకిన్ ఇండియా వంటి కార్యక్రమాలు నినాదాలకే పరిమితమయ్యాయి. పేదరికం మరింతగా పెరిగింది. ఆరోగ్యం, విద్య మరింత ఖరీదైన వ్యవహారాలుగా రూపుదాల్చాయి. మౌలిక వసతులను పూర్తిగా గంపగుత్తగా ప్రయివేటుకు కట్టబెట్టే ప్రయత్నాలే సాగాయి. గతంలో వాజపేయి హయాంలో స్వర్ణ చతుర్భుజి వంటి ప్రాజెక్టుల ద్వారా మౌలిక వసతుల కల్పన, ప్రత్యేక ఆర్థిక మండళ్ల ఏర్పాటు వంటివి చెప్పుకోదగ్గ విజయాలు. ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదల, అదుపులో ద్రవ్యోల్బణం కూడా ఆనాటి సంకీర్ణ ప్రభుత్వం సాధించిన విజయమే. అటువంటి ట్రాక్ రికార్డు మోడీ హయాంలో కనిపించడం లేదు.

అన్నీ ఏకపక్షం……?

ప్రధానిగా మోడీ తీసుకునే నిర్ణయాలన్నీ ఏకపక్షంగా ఏదో అద్భుతం జరగబోతోందన్నట్లు భ్రమ కల్పించడం విశేషం. చివరకు బారత చరిత్రలోనే మిరకిల్ అని ప్రధాని భావించిన అనేక నిర్ణయాలు అభాసుపాలయ్యాయి. వికటించాయి. ప్రజలే బాధితులుగా మిగిలిపోయారు. నోట్ల రద్దు అందుకు ఒక పెద్ద ఉదాహరణ. కొన్ని నెలలపాటు ప్రజలకు ఉపాధి లోపించింది. అసంఘటిత రంగం అస్తవ్యస్తమైపోయింది. నోట్ల రద్దు వల్ల లభించిన ప్రయోజనమేమిటనే దానిపై ఇప్పటికీ కేంద్రం వద్ద సమాధానం లేదు. అదే విధంగా కొన్ని గంటల వ్యవధిలోనే కరోనా పేరు చెప్పి గడచిన ఏడాది ప్రకటించిన లాక్ డౌన్. ఈ ఒక్క చర్యతో భారత ప్రజలను రోడ్డున పడేసింది కేంద్రప్రభుత్వం. నోట్ బంద్ కావచ్చు. కరోనా లాక్ డౌన్ కావచ్చు. అన్నిటికీ ప్రజలే బలి పశువులు. తమ చర్యల వల్ల ప్రజలు ఇక్కట్ల పాలవుతుంటే తప్పు జరిగిందనే పశ్చాత్తాపం సైతం కేంద్ర ప్రభుత్వంలో కనిపించదు. పర్యవసాలను ఆలోచించకుండా ప్రజాజీవితాలతో ప్రయోగాలు చేయడం స్వతంత్ర బారత చరిత్రలో ఈ ప్రభుత్వంలోనే కనిపిస్తుంది.

రాష్ట్రాలతో పేచీలు..?

వాజపేయి హయాంలో రాష్ట్రాలతో సుహ్రుద్భావ సంబంధాలు నెరపడానికే కేంద్రం ప్రయత్నించింది. కాంగ్రెసు పాలనలోని రాష్ట్రాలతో సైతం ఆ నాటి ప్రభుత్వం సమన్వయంతోనే వ్యవహరించేది. మోడీ హయాంలో రాష్ట్రాలతో గిల్లికజ్జాలు, పేచీలు పెరిగిపోయాయి. రాజకీయ ఆధిపత్య ధోరణి రాష్ట్రాల హక్కులను హరించి వేస్తోంది. కేంద్రం తీసుకునే ఏకపక్షనిర్ణయాలకు వంత పాడటం మినహా ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితిలో రాష్ట్రాలు గిలగిలలాడుతున్నాయి. గొంతెత్తి ప్రశ్నించే నేతలు, రాష్ట్రాలు ఇబ్బందులను ఎదుర్కోక తప్పడం లేదు. మరోవైపు వ్యవస్థలను నిర్వీర్యం చేయడం , గుప్పెట్లో పెట్టుకోవడం జరుగుతోంది. ఎన్నికల కమిషన్ తన స్వతంత్ర ప్రతిపత్తిని కోల్పోతుందనే విమర్శకు ఇటీవల బెంగాల్ ఎన్నికలు అద్దం పట్టాయి. న్యాయ వ్యవస్థ పట్ల కూడా బెదిరింపు ధోరణిలోనే కేంద్రం వ్యవహరిస్తోంది. కరోనా సమయంలో కేంద్రం సరిగా వ్వవహరించడం లేదని న్యాయస్థానం అభిప్రాయపడితే , మీ జోక్యం అవసరం లేదన్న రీతిలో కేంద్రం స్పందించింది. ఇక మిగిలిన వ్యవస్థలన్నీ జీ హూజూర్ గానే మారిపోయాయి. జీఎస్టీ పరిహారాల చెల్లింపు మొదలు , టీకాల కొనుగోలు వరకూ రాష్ట్రాలతో విభేదాలే కొనసాగుతున్నాయి. మోడీ అధికారంలోకి వచ్చిన తొలి నాళ్లలో ప్రవచించిన టీమ్ ఇండియా, సహకార సమాఖ్య వంటి పదాలు మొక్కుబడి తంతుగా మిగిలిపోయాయి. అధికారం శాశ్వతం కాదు.. కానీ నెలకొల్పే సంప్రదాయాలు, ప్రజల జీవితంలో తెచ్చిన మార్పులే నాయకులను చరిత్రలో శాశ్వతం గా నిలుపుతాయి. ఉత్తేజ పూరిత ఉపన్యాసాలు, హావభావాలు, వేషధారణలు, సింబాలిక్ చర్యలు, భావోద్వేగాలు తాత్కాలికంగా రక్తి కట్టించవచ్చు. కానీ ప్రజలకు ఒక్క పూట ఉపాధికి కూడా ఉపయోగపడవు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News