తిరుగులేని నాయకుడన్నారే…?

నరేంద్ర మోదీ నాయకత్వంలోని నేషనల్ డెమొక్రటిక్ అలయన్స్ (ఎన్ డీ ఏ) 2019 పార్లమెంటు ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. కూటమిలోని ఒక్క భారతీయ జనతా పార్టీనే [more]

Update: 2021-06-09 16:30 GMT

నరేంద్ర మోదీ నాయకత్వంలోని నేషనల్ డెమొక్రటిక్ అలయన్స్ (ఎన్ డీ ఏ) 2019 పార్లమెంటు ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. కూటమిలోని ఒక్క భారతీయ జనతా పార్టీనే ఏకంగా 303 సీట్లు సాధించి తిరుగులేని విజయాన్ని నమోదు చేసింది. కాంగ్రెస్ కు కనీసం విపక్ష హోదా సైతం లభించలేదు. ఇక ఇతర చిన్నాచితక పార్టీల సంగతి చెప్పక్కర్లేదు. ఎవరు అంగీకరించినా, అంగీకరించనప్పటికీ పార్టీకన్నా నరేంద్ర మోదీ పాలనా దక్షతే అఖండ విజయానికి కారణమని చెప్పడం అతిశయోక్తి కానే కాదు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సిన వివిధ రాష్రాల్లో కమలం విజయ కేతనం ఎగుర వేస్తుందని వివిధ పార్టీలతో సహా రాజకీయ విశ్లేషకులు అంచనా వేశారు. ఈ అంచనాలు తప్పని వివిధ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చాటాయి.

హవా ఎల్లకాలం?

నరేంద్ర మోదీ ఏమీ తిరుగులేని నాయకుడు కాదని, ఆయన హవా ఎల్లకాలం నడవదని నిరూపించాయి. 2019 నుంచి నేటివరకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క అసోంలోనే భాజపా అధికారాన్ని కాపాడుకోగలిగింది. కొన్ని రాష్టాల్లో అధికారాన్ని విపక్షాలకు అప్పగించాల్సి వచ్చిందన్నది చేదు నిజం. 2019 పార్లమెంటు ఎన్నికల అనంతరం అదే ఏడాది అక్టోబరులో మహారాష్ర్ట, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కమలం వాడిపోయింది. ఈ రెండు చోట్లా పార్టీ అధికారంలో ఉన్న విషయం ఇక్కడ గమనార్హం. అయిదేళ్లపాటు అధికారంలో ఉన్న భాజపా ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ పార్టీని విజయ తీరాలకు చేర్చలేకపోయారు. 288 సీట్లకు కమలం పార్టీ కేవలం 102 సీట్లే సాధించి విపక్షానికి పరిమితమైంది. 90 సీట్లుగల హర్యానాలో భాజాపా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ 40 సీట్లతో అధికారానికి దూరంగా ఉండిపోయారు. చివరికి 10 సీట్లు గల జననాయక్ జనతా పార్టీ మద్దతుతో సర్కారు ఏర్పాటైంది. 2019 నవంబరులో జరిగిన జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాజాపా అధికారాన్ని కోల్పోయింది. హేమంత్ సొరేన్ ఆధ్వర్యంలోని జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) అధికారాన్ని హస్తగతం చేసుకుంది. 2020 ఫిబ్రవరిలో జరిగిన దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ మళ్లీ అధికారాన్ని నిలబెట్టుకుంది. ఇక్కడ భాజపా కేవలం 8 సీట్లకే పరిమితమైంది.

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో….?

2020 అక్టోబరు, నవంబరుల్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా 74 సీట్లతో రెండో స్థానం వద్దే ఆగిపోయింది. 75 సీట్లతో లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ రాష్రీయ జనతాదళ్ అతి పెద్ద పార్టీగా ఆవిర్భవించింది. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ నెలలో జరిగిన అయిదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆశించిన ఫలితాలను కమలం పార్టీ అందుకోలేకపోయింది. తమిళనాడు, కేరళల్లో కనీసం ఖాతా తెరవలేకపోయింది. కేరళలో ఉన్న ఒక్క ‘నెమాం’ సీటునూ నిలుపుకోలేకపోయింది. పశ్చిమ బెంగాల్లో హడావిడి చేసినప్పటికీ అధికారానికి ఆమడ దూరంలోనే నిలిచిపోయింది. మోదీ, షా, నడ్డా వంటి అతిరథ మహారథులు రంగంలోకి దిగినప్పటికీ ఫలితం లేకపోయింది. ఈశాన్య రాష్ట్రమైన అసోంలో అధికారాన్ని నిలుపుకోవడం పార్టీకి పెద్ద ఊరట. జాతీయ జనాభా పట్టిక (ఎన్ పి ఆర్), జాతీయ పౌర పట్టిక (ఎన్ ఆర్ సి) వ్యతిరేక ఉద్యమాలు, బోడో పీపుల్స్ ఫ్రంట్ దూరమైనప్పటికీ అసోం పీఠాన్ని మళ్లీ అధిష్టించడం అంత తేలికైన విషయం కాదు.

పది రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో…?

తమిళనాడులో బోణీ కొట్టనప్పటికీ పక్కనే గల కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి ప్రభుత్వంలో రెండో అతిపెద్ద భాగస్వామిగా నిలబడటం పార్టీకి ఎంతో ఊరట కలిగించింది. 30 సీట్లు గల పుదుచ్చేరిలో అధికార ఎన్నార్ కాంగ్రెస్ 10 సాధించగా, 6 సీట్లతో భాజపా రెండో అతిపెద్ద పార్టీగా అవతరించడం, ప్రభుత్వంలో భాగస్వామి కావడం సాధారణ విషయం కాదు. 2016 ఎన్నికల్లో పార్టీకి ఇక్కడ డిపాజిట్లే దక్కని నేపథ్యంలో పార్టీ సాధించిన ప్రస్తుత విజయం పెద్దదే అని చెప్పక త ప్పదు. మొత్తానికి 2019 ఎన్నికల అనంతరం జరిగిన 10 రాష్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నరేంద్ర మోదీ తిరుగులేని నేత, భాజపా ఎదురులేనిపార్టీ ఏమీకాదన్న విషయాన్ని తేల్చి చెప్పాయి. 2024 సార్వత్రిక ఎన్నికలకు అప్రమత్తం కావడానికి ఈ ఫలితాలు ఓ హెచ్చరిక లాంటివి.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News