రామ రాజ్యంపై సీతమ్మ సంకటం

రామరాజ్యం స్థాపిస్తామని బీజేపీ పదే పదే చెబుతుంది. రామరాజ్యం అంటే ప్రజలు సుభిక్షంగా , సుఖంగా, అందరికీ సమ న్యాయం సమకూరే రాజ్య వ్యవస్థ. రాముడు ధర్మానికి [more]

Update: 2021-02-22 16:30 GMT

రామరాజ్యం స్థాపిస్తామని బీజేపీ పదే పదే చెబుతుంది. రామరాజ్యం అంటే ప్రజలు సుభిక్షంగా , సుఖంగా, అందరికీ సమ న్యాయం సమకూరే రాజ్య వ్యవస్థ. రాముడు ధర్మానికి ప్రతీక మాత్రమేకాదు, సత్య వాక్పాలకుడు. ఏడేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన కమల నాథులు ఆత్మావలోకనం చేసుకుంటే ఎంతవరకూ రామరాజ్యం దిశలో ప్రస్థానిస్తున్నారో అర్థమైపోతుంది. ఆలయాలు నిర్మించడం, ఇతర మతాల అత్యుత్సాహం ఆసరాగా చేసుకుంటూ మెజారిటీ మతంలో భావోద్వేగాలు రేకెత్తించడం, రాజ్య వ్యవస్థలన్నిటినీ కనుసైగలతో శాసించడం రాముని కాలం నాటి ధర్మం కాదు. దేశంలో అదే ప్రస్తుతం అమలవుతోంది. ప్రజలు పాలకుల చేతిలో పాలితులుగా కాదు, బాధితులుగా మిగిలిపోతున్నారు. చరిత్ర ఎరుగని రీతిలో పెట్రోల్, డీజెల్ ధరలు సెంచరీ కొడుతున్నాయి. వంట గ్యాస్ వెయ్యికి చేరువ కాబోతోంది. కష్టాల కొలిమిలో , కరోనా కష్ట కాలంలో సర్కారు వడ్డిస్తున్న పన్నుల భారం. ఉపశమనం సంగతి దేవుడెరుగు , పాలించే వాడే బాదేస్తున్నాడు. ఇక సామాన్యుడు తన ఘోష ఎవరికి చెప్పుకోవాలి. తాజాగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్య అంతర్గతంగా పార్టీలో, ప్రభుత్వంలో సైతం నిరసనలకు తార్కాణంగా చెప్పుకోవాలి.. ప్రభుత్వంలో భాగమైన తామంతా ధర్మసంకటంలో పడ్డామని ఆమె తేల్చి చెప్పేశారు. పన్నుల భారం ప్రత్యేకించి పెట్రోలియం ఉత్పత్తుల ధరలపై సమర్థించుకోలేకపోతున్నామని సత్యాన్ని అంగీకరించారు. ఎంత సున్నితంగా కేంద్రమంత్రి ఈ వ్యాఖ్య చేసినప్పటికీ నరేంద్రమోడీ సర్కారుకు ఇది చెంప పెట్టు. తాము తీసుకునే నిర్ణయాలను సహచర మంత్రే సమర్థించలేకపోతున్నారంటే అంత కంటే సిగ్గు చేటైన విషయం మరొకటి ఉండదు. రాజ్య వ్యవస్థలో సాగుతున్న దోపిడీకి సీతారామన్ వ్యాఖ్యలు నిర్మలమైన నిదర్శనాలు.

అందరికీ పరీక్షే…

కేంద్ర ప్రభుత్వంలో పెత్తనం వహిస్తు్న్న మోడీ, షాల నిర్ణయాల పట్ల సంఘ్ పరివార్ శక్తులు, బీజేపీ సహా కుతకుత లాడిపోతున్నాయి. కరో్నా తర్వాత ప్రజల జీవనం ఇప్పుడిప్పుడే కుదుట పడుతోంది. మరో ఏడాది వరకూ సాధారణ జీవన స్థితిగతులు ఏర్పడవు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను , సంఘటిత రంగంలోని ఉద్యోగులను మినహాయిస్తే 94 శాతం మంది ప్రజలు దైనందిన కష్టంపైనే జీవనం గడుపుతున్నారు. వీరి జీవన స్థితిగతులు దుర్భరంగా ఉన్నాయి. ఆర్థిక చక్రాలు కుదుటన పడాలంటే ఇంధన ధరలు అందుబాటులో ఉండాలి. కానీ ప్రభుత్వం తన ఆదాయాన్ని పెంచుకోవడానికి వాటిపై ప్రత్యేక సెస్సులతో బాదేస్తోంది. ప్రపంచ మార్కెట్ తో సంబంధం లేకుండా భారత దేశంలో పన్నుల రూపంలో సగానికిపైగా పెట్రోల్, డీజెల్ సొమ్మును ప్రభుత్వాలు కాజేస్తున్నాయి. ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ విషయాన్ని బీజేపీ నేతలు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం సమర్థించుకోలేక తర్జనభర్జన పడుతున్నారు. కేంద్రంలో నరేంద్రమోడీ తీసుకున్న అనేక నిర్ణయాల వల్ల ప్రజలు ఇబ్బందులు పడ్డారు. కానీ మోడీ కి స్వార్థం లేదు. వారసత్వం లేదు. ఏ నిర్ణయమైనా దేశం కోసమేనన్న ఒకే ఒక విశ్వాసంతో రెండోసారి కూడా ప్రధానిగా ఆయన నాయకత్వానికే పట్టం గట్టారు. కానీ ఈ కష్ట కాలంలో ఇంతటి నిర్దయ గా వ్యవహరించడాన్ని మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రజలలో అసంత్రుప్తి జ్వాలలను పార్టీ నాయకులు నేరుగా చవి చూస్తున్నారు. అందుకే తమ ప్రభుత్వంపైనే నేతలు గుర్రుగా ఉన్నారు.

ప్రయివేటు జపం..

నష్టాల్లో కూరుకుపోయిన సంస్థలను వదిలించుకోవడం మంచిదే. ఎందుకంటే ఆయా సంస్థల నష్టాలను ప్రభుత్వ ధనం తో పూడ్చాలి. ప్రజల పన్నుల నుంచే వాటిని పోషించాలి. ముఖ్యంగా విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల వంటి రంగాలను ప్రభుత్వ నిర్వహణ, నియంత్రణలో ఉంచి , ఉత్పత్తి , సేవారంగాలను ప్రయివేటీకరిస్తే తప్పు లేదు. కానీ ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయలు ఆర్జించి పెడుతూ ఆర్ఘిక మార్కెట్లు దారి తప్పినప్పుడు నియంత్రణకు ఉపకరిస్తున్న ఎల్ఐసీ వంటి వాటిని అమ్మేయాలనుకోవడం అరాచకమే. ఇతర ప్రభుత్వ రంగ సంస్థలతో పోలిస్తే జీవిత బీమా సంస్థ ప్రజలకు ఎంతో మెరుగైన సేవలు అందిస్తోంది. అవసరమైనప్పుడు షేర్ మార్కెట్లలో సైతం జోక్యం చేసుకుని పెట్టుబడులు పెడుతుంది. తీవ్రంగా ఒడుదొడుకులకు లోనుకాకుండా కాపాడుతుంది. ప్రభుత్వానికి డివిడెండ్ చెల్లిస్తుంది. ఇటువంటి సంస్థను వదిలించుకోవాలనుకోవడం దురుద్దేశ పూరితమే. ప్రయివేటు ఇన్సూరెన్సు కంపెనీలను దీటుగా ఎదుర్కొంటున్న ఎల్ ఐసీ ని వదిలించుకోవడంపై తీవ్రమైన వ్యతిరేకతే వ్యక్తమవుతోంది. అయినా ప్రభుత్వం తన ధోరణిని మార్చుకొనేట్లు కనిపించడం లేదు. ప్రయివేటును గౌరవించాలంటూ ప్రధాని పిలుపునివ్వడం అందులో భాగమే.

కలిసి కట్టుగా ,,

ప్రభుత్వాలు సాధ్యమైనంత వరకూ ప్రజల ఆర్థిక స్థితిగతులు మెరుగుపడేందుకు, సుఖవంతమైన జీవితానికి అవసరమైన ప్రణాళికలు అమలు చేయాలి. ప్రజల నుంచి లభించే ప్రతిపైసాకు జవాబుదారీగా వ్యవహరించాలి. దుర్వయం నియంత్రించుకోవాలి. కానీ అధికారం కోసం అడ్డగోలు హామీలు, సంక్షేమ పథకాల సంతర్పణలతో ప్రజాధనానికి, జవాబుదారీతనానికి నీళ్లు వదిలేస్తున్నాయి ప్రభుత్వాలు. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలన్న తేడా లేదు. తమ ఇష్టారాజ్యానికి ప్రజలపై విపరీతమైన పన్నుల భారం మోపుతున్నాయి. మద్యం, పెట్రోలియం ఉత్పత్తులు ప్రభుత్వాల ఆదాయానికి గంగి గోవులా కనిపిస్తున్నాయి. వీటిని జీఎస్టీ పరిధిలోకి తేకుండా అడ్డగోలు పన్ను విధానాన్ని అనుసరిస్తూ సర్కారీ దోపిడీ కొనసాగిస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా నడవాలన్న ప్రధాని కోరిక పన్నుల విషయంలో మాత్రం నెరవేరుతోంది. నా వాటా, నీ వాటా అంటూ పోటీలు పడి పన్నులు పెంచడంలో కేంద్రం, రాష్ట్రం ఒక దానికొకటి తీసిపోవడం లేదు. పొరుగున ఉన్న పాకిస్థాన్ వంటి దాయాది దేశం కంటే దాదాపు రెట్టింపు ధర పెట్రోలు పలుకుతుందంటే ఇక్కడి అస్తవ్యస్త పన్నుల విధానం ఎలా ఉందో ప్రపంచానికి తేటతెల్లమవుతుంది. అధికారం ఉంది కదా అని అడ్డగోలు గా అరాచక పన్నులు వేస్తే సందర్భం వచ్చినప్పుడు ఓటరు రూపంలోని ప్రజలు గట్టి గుణపాఠమే నేర్పుతారు.

 

-ఎడిటోరియల్ డెస్

Tags:    

Similar News