నిర్మలమ్మ నిబ్బరం
గత ఏడాది కరోనా విజృంభించినప్పుడు దేశం కోలుకోవడానికి ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ భారీ ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించారు. దాని విలువ 21 లక్షల కోట్ల రూపాయలు. అమెరికాతో [more]
గత ఏడాది కరోనా విజృంభించినప్పుడు దేశం కోలుకోవడానికి ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ భారీ ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించారు. దాని విలువ 21 లక్షల కోట్ల రూపాయలు. అమెరికాతో [more]
గత ఏడాది కరోనా విజృంభించినప్పుడు దేశం కోలుకోవడానికి ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ భారీ ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించారు. దాని విలువ 21 లక్షల కోట్ల రూపాయలు. అమెరికాతో సమానంగా మన దేశ స్థూల జాతీయోత్పత్తిలో పదిశాతం పైగా కేటాయించామన్నారు. కరోనా నుంచి బయటపడేయడానికి ఈ మొత్తం వినియోగిస్తున్నామని చెప్పుకొచ్చారు. రెండో విడత కరోనా వ్యాప్తి తర్వాత మళ్లీ మరో ప్యాకేజీతో నిర్మలా సీతారామన్ ప్రజల ముందుకు వచ్చారు. ఇప్పుడు దాని విలువ ఆరు లక్షల ముప్ఫైవేల కోట్ల రూపాయలు. దీంతో మళ్లీ ప్రజలు బాగుపడతారు. దేశం గట్టున పడుతోందని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. నిజానికి మొదటి విడత కంటే ఈ దఫా ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. ప్రాణ నష్టమే కాకుండా సంపద నష్టం కూడా గతంతో పోలిస్తే చాలా ఎక్కువ. మొదటి దశలో చికిత్సలపై ఎక్కువగా ప్రభుత్వమే బాధ్యత తీసుకుంది. ప్రజలపై అతి తక్కువ భారం పడింది. కరోనా గురించి పూర్తి అవగాహన లేకపోవడం వల్ల ప్రయివేటు ఆసుపత్రులు చికి్త్స అందించడానికి ముందుకు రాలేదు. దాంతో ప్రజలు అప్పులు చేసి మరీ ఆరోగ్యానికి వెచ్చించాల్సిన అవసరం లేకుండా పోయింది. ఈసారి కరోనా గుట్టుమట్టు తెలియడంతో ప్రయివేటు ఆసుపత్రులు ప్రజల నిస్సహాయతను సొమ్ము చేసుకోవడానికి ఎగబడ్డాయి. అందినకాడికి కార్పొరేట్ రూపంలో దోచుకున్నాయి. ప్రభుత్వం చాలా వరకూ ప్రేక్షక పాత్ర పోషించింది. అందుకే ఈసారి ప్రజలు అప్పుల్లో కూరుకుపోయారు. చికిత్స పేరిట తల తాకట్టు పెట్టి రుణాలు తెచ్చుకున్నారు. ఈ సమయంలో ప్రకటించిన ప్యాకేజీ వాస్తవరూపంపై చర్చ మొదలైంది.
మనీ మ్యాజిక్…
ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ మనీ మహేంద్ర జాలమని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. ఇందులో ప్రజలకు నేరుగా అందించే మొత్తం 55వేల నుంచి 70 వేల కోట్ల రూపాయల మధ్యలో ఉంటుందని వ్యాపార పత్రికలు, రేటింగ్ సంస్థలు అంచనా వేస్తున్నాయి. మిగిలిన అయిదున్నర లక్షల కోట్ల రూపాయలు వివిధ మార్గాల్లో బ్యాంకులు అందచేసే రుణాలుగానే తేల్చి చెబుతున్నారు. తొలిదశలో ప్యాకేజీని తిమ్మిని బమ్మిని చేసినట్లుగానే ఈ సారి మరోసారి మాయ చేస్తున్నారనే విమర్శలు వినవస్తున్నాయి. రొటీన్ గా జరగాల్సిన రుణ కార్యక్రమాలను ఏకమొత్తంగా విధాన ప్రకటనగా చూపుతూ ప్రభుత్వం ప్రచారం పొందుతుందనే వాదన వినవస్తోంది. నిజానికి ఇటువంటి విపత్కర సమయాల్లో ఏ ప్రభుత్వమైనా నేరుగా ప్రజలకు అందించే నగదు సాయంపై దృష్టి పెట్టాలి. దేశంలో రెండు నెలలపాటు వ్యాపార, ప్రయివేటు ఉద్యోగ కార్యకలాపాలు స్తంభించిపోయాయి. అసంఘటితరంగం మొత్తం అస్తవ్యస్తమైపోయింది. తాజా గా ప్రకటించిన ప్యాకేజీలో కంపెనీలు, పెద్ద వ్యాపారాలకు రుణాలిచ్చే కార్యక్రమం చేస్తామంటున్నారు. ప్రజల కొనుగోలు శక్తి క్షీణించిన దశలో ఉత్పత్తి ని పెంచుకునేందుకు అప్పులు ఎవరు తీసుకుంటారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఒకవేళ ప్రభుత్వ గ్యారంటీతో డబ్బులు వస్తున్నాయని కొందరు ముందుకు వచ్చినా దుర్వినియోగం చేసేందుకు ఆస్కారం ఏర్పడుతుంది. సామాన్య ప్రజలకు , మధ్యతరగతి , పేద వ్యాపారులకు, నిర్మాణ రంగంలోని కూలీలకు ఒరిగేదేమీ ఉండదు.
గతం గత …
నిజానికి గడచిన ప్యాకేజీలు ఎంతవరకూ అమలయ్యాయనే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా దాచి పెడుతోంది. ఇప్పుడు ప్రకటించిన దానిపై ప్రజలకు నమ్మకం ఏర్పడాలంటే కనీసం గత ఏడాది ఉద్దీపనపై స్పష్టత అవసరం. అప్పటి ప్యాకేజీ వల్ల ఏయే వర్గాలకు ఎంతమేరకు ప్రయోజనం సమకూరింది. అందువల్ల ప్రభుత్వంపై పడిన భారమెంత? బ్యాంకులు అందించిన మొత్తమెంత? ఇటువంటి గణాంకాలు ప్రభుత్వ చిత్తశుద్దిని చాటి చెబుతాయి. అయితే ప్యాకేజీలు ఎప్పటికప్పుడు పరగడుపున పడుతున్నాయి. ప్రజలు పెద్దగా జ్ణాపకం పెట్టుకోరనే విషయం ప్రభుత్వాలకు అలుసుగా మారింది. నిజానికి గత ప్యాకేజీల్లో అమలైంది నలభై శాతం లోపుగానే ఉందని బ్యాంకింగ్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అందులో ప్రభుత్వంపై పడిన భారం రెండు లక్షల కోట్ల రూపాయల లోపుగానే ఉంది. భారత గోదాముల్లో దాదాపు ఏడు కోట్ల టన్నుల ధాన్యాలు మగ్గుతున్నాయి. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో వాటిని పంపిణీ చేసి కూడా ప్రభుత్వం ఆర్థిక లెక్కల్లో చెప్పేసి సాయంగా ఘనతను చాటుకుంటున్నారు. ప్రభుత్వ ఖజానాపై పెద్దగా భారం పడకుండా ప్రచారం పొందడమెలా? అన్న అంశంపైనే కసరత్తు సాగిస్తున్నారు.
కార్పొరేట్ కు కాసుల గల గల..
తీవ్రమైన అంటు రోగాల విషయంలో ప్రభుత్వ బాధ్యత అత్యంత కీలకమైనది. కరోనా ప్రపంచానికి చాటి చెప్పిన గుణపాఠం ఇదే. ప్రయివేటు ఆసుపత్రులు తొలి దశలో చాలా వరకూ సేవలు అందించడానికే భయపడ్డాయి. కానీ ప్రభుత్వ ఆసుపత్రులే భరించాల్సి వచ్చింది. ప్రభుత్వ రంగంలో మౌలిక వసతులను మెరుగుపరచుకోవడం ద్వారానే ప్రజలపై భారం తగ్గుతుంది. తాజా ప్యాకేజీలో ధర్మాసుపత్రుల్లో పెట్టుబడులకు నిధులు కేటాయించలేదు. కానీ ప్రయివేటుగా కార్పొరేట్ ఆసుపత్రులు తెరుస్తామంటే వంద కోట్ల రూపాయల వరకూ రుణం ఇస్తామంటూ చెబుతున్నారు. ఇందుకోసం 50 వేల కోట్ల రూపాయల వరకూ బ్యాంకు రుణాలకు ప్రభుత్వం హామీ ఇస్తానంటోంది. దాదాపు పదిశాతం వడ్డీ సైతం బ్యాంకులకు చెల్లించాల్సి ఉంటుంది. ఇంత పెద్ద మొత్తంలో నిధులు తీసుకుని, వడ్డీలు చెల్లించే ఆసుపత్రులు చౌకగా రోగులకు సేవలందిస్తాయనుకోవడం అత్యాశే. దీనివల్ల ప్రభుత్వమే వైద్య సేవలను ఖరీదైన వ్యవహారంగా మార్చేసినట్లవుతుంది. మొత్తమ్మీద ఆత్మనిర్బరతతో నిర్మలా సీతారామన్ నిబ్బరంగా కనిపిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వమూ నిబ్బరం నటిస్తోంది. కానీ ప్యాకేజీ ప్రజల్లోనే నిబ్బరం కల్పించలేకపోతోంది.
-ఎడిటోరియల్ డెస్క్