సత్తా ఉన్నా పోటీ చేయని లీడర్

అసెంబ్లీ ఎన్నికలంటే ఏ రాష్ట్రంలో అయినా ఎంతో హడావిడి ఉంటుంది. ముఖ్యమంత్రి, విపక్షనేత, ఇతర ముఖ్యనేతలు పోటీ చేసే నియోజకవర్గాలపై అందరి చూపూ ఉంటుంది. ఆయా నియోజకవర్గాల్లో [more]

Update: 2020-11-02 16:30 GMT

అసెంబ్లీ ఎన్నికలంటే ఏ రాష్ట్రంలో అయినా ఎంతో హడావిడి ఉంటుంది. ముఖ్యమంత్రి, విపక్షనేత, ఇతర ముఖ్యనేతలు పోటీ చేసే నియోజకవర్గాలపై అందరి చూపూ ఉంటుంది. ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులు, వారి బలాబలాలు, ప్రభావిత అంశాలపై చర్చ జరుగుతుంటుంది. వారు గెలిచినా, ఓడినా ఆసక్తి ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో కుప్పం, పులివెందుల, గజ్వేల్ వంటి నియోజకవర్గాలపై ప్రజలు ఆసక్తి కలిగి ఉంటారు. కానీ బిహార్ పరిస్థితి విభిన్నం. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పాతికేళ్లుగా ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉంటున్నారు. పరోక్ష ఎన్నికలకే ప్రాధాన్యం ఇస్తున్నారు.

ఎక్కడా పోటీ చేయకుండా……

మూడు దఫాలుగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఎప్పటి మాదిరిగానే పోటీ చేయడం లేదు. శాసనమండలి సభ్యుడిగా ఉండేందుకు మొగ్గు చూపుతున్నారు. 2018లో శాసనమండలికి ఎన్నికైన ఆయన పదవీకాలం 2024వరకూ ఉంది. శాసన మండళ్లు ఉన్న రాష్ట్రాలు కూడా పరిమితమే. కేవలం అయిదు రాష్ట్రాల్లో …కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, యూపీ, బిహార్ లోనే ఎగువసభలు ఉన్నాయి. నితీశ్ కుమార్ సీనియర్ నాయకుడు. ఒక దశలో అంటే 90ల్లో ప్రధాని పదవికి ఆయన పేరు బలంగా ప్రచారంలోకి వచ్చింది. అందరికీ ఆమోదయోగ్యమైన అభ్యర్థిగా ముందు వరుసలో నిలిచారు. రైల్వే, వ్యవసాయ వంటి కీలక శాఖలకు సారథ్యం వహించారు. 2005 నుంచి పూర్తిగా రాష్ర్ట రాజకీయాలకే పరిమితమయ్యారు. అప్పటి నుంచి మధ్యలో కొన్ని రోజులు మినహాయించి ఏకధాటిగా ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఇప్పుడు జరుగుతున్నఎన్నికల్లోనూ ఆయన్నే విజయలక్ష్మి వరిస్తుందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.

గెలిచే అవకాశం ఉన్నా…..

అవినీతి మరక అంటని, మంచి పాలన అందించే నితీశ్ కుమార్ కు ప్రజాదరణ పుష్కలమే. శాసనసభకు ఎన్నిక కావడం ఆయనకు చిటికెలో పని. రాష్ర్టంలో ఎక్కడి నుంచైనా గెలిచే సత్తా ఆయనకుంది. అయితే పెద్దలసభ అంటే ఒక ప్రత్యేకమని, అందులో సభ్యుడిగా ఉండటం గౌరవ ప్రదమని, అందుకే శాసనమండలికి పోటీ చేయడమే తనకు ఇష్టమని నితీశ్ కుమార్ ఒక సందర్భంలో వెల్లడించారు. ముఖ్యమంత్రిగా, పార్టీ అధినేతగా ఎన్నికల సమయంలో అనేక అంశాలను సమన్వయం చేయవలసి ఉంటుందని, సమస్యలను పరిష్కరించవలసి ఉంటుందని, ప్రత్యర్థుల ఎత్తులకు పైయెత్తులు వేయవలసి ఉంటుందని, ముఖ్యంగా పార్టీని విజయపథాన నడిపించేందుకు ప్రయత్నించాల్సి ఉంటుందని, ఈ ఒత్తిడిలో సొంత నియోజకవర్గంపై దృష్టి సారించే అవకాశం ఉండదని అందువల్లే ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్నానని నితీశ్ కుమార్ వివరించారు.

పార్లమెంటుకు ఎన్నికై……

1951లో భక్తియార్పూర్ లో వెనకబడిన కుర్మీ సామాజిక వర్గంలో జన్మించిన నితీశ్ కుమార్ ఉన్నత విద్యావంతుడు. పాట్నా నిట్ (నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నలజీ)లో బీటెక్ చేశారు. కొంతకాలం ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేశారు. జయప్రకాశ్ నారాయణ, రామ్ మనోహర్ లోహియా, కర్పూరీ ఠాకూర్ శిష్యుడిగా రాజకీయ అరంగ్రేటం చేశారు. తొలిసారి 1977లో నలంద పార్లమెంట్ నియోజకవర్గంలోని హర్నాట్ నుంచి జనతా పార్టీ అభ్యర్థిగా అసెంబ్లీకి పోటీచేసి ఓడిపోయారు. 1985లో లోక్ దళ్ తరఫున విజయం సాధించారు. 1996లో ఇదే స్థానం నుంచి సమతా పార్టీ తరఫున గెలుపొందారు. అదే సమయంలో పలుమార్లు పార్లమెంటుకు ఎన్నికై అటల్ బిహారీ వాజపేయి మంత్రివర్గంలో మంత్రి పదవులు చేపట్టారు. 2000, 2005, 2009, 2015లో రెండుసార్లు ముఖ్యమంత్రిగా మొత్తం అయిదుసార్లు బాధ్యతలు చేపట్టారు. లాల్ బహదుర్ శాస్త్రి మాదిరిగా 1999 ఆగస్టులో గైసల్ రైల్వే ప్రమాదానికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేసి నైతిక విలువలకు పట్టం కట్టిన నేత నితీశ్ కుమార్. సమకాలీన రాజకీయాల్లో ఇంతటి నిబద్ధత గల నేతను చూడలేం.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News