తేడా వచ్చిందా..? గ్యాప్ పెరిగిందా?

తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి పెద్ద అండ‌గా ఉంటుంద‌నుకున్న జ‌న‌సేన అప్పుడే అసంతృప్తి గుర‌వుతోందా? ఈ ప్రశ్నకు అవున‌నే చెబుతున్నారు రాజ‌కీయ ప‌రిశీల‌కులు. గ‌డ‌చిన కొంత‌కాలంగా బీజేపీ స్థానిక [more]

Update: 2020-11-30 15:30 GMT

తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి పెద్ద అండ‌గా ఉంటుంద‌నుకున్న జ‌న‌సేన అప్పుడే అసంతృప్తి గుర‌వుతోందా? ఈ ప్రశ్నకు అవున‌నే చెబుతున్నారు రాజ‌కీయ ప‌రిశీల‌కులు. గ‌డ‌చిన కొంత‌కాలంగా బీజేపీ స్థానిక నాయ‌క‌త్వాల‌కు, ప‌వ‌న్ క‌ల్యాణ్ కు మ‌ధ్య స‌త్సంబంధాలు దెబ్బతిన్నాయ‌నేది రాజ‌కీయ అంచ‌నా. జ‌న‌సేన‌ను పూర్తిగా న‌మ్ముకోకుండా సొంత‌కాళ్లపై నిల‌బ‌డ‌టానికే ప్రయ‌త్నించాల‌ని బీజేపీ రాష్ట్ర నాయ‌క‌త్వాలు భావిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ జ‌నాద‌ర‌ణ‌ను జాతీయ పార్టీ నాయ‌కులు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని జ‌న‌సేన శ్రేణులు ఆవేద‌న‌కు గుర‌వుతున్నాయి. దీంతో ప‌వ‌న్ క‌ల్యాణ్ స్వయంగా రంగంలోకి దిగి బీజేపీ అధిష్ఠానం తో సంప్రతింపుల‌కు దిగిన‌ట్లు తెలియ‌వ‌స్తోంది. ఇటీవ‌లి ఢిల్లీ ప‌ర్యట‌న‌లో రెండు ల‌క్ష్యాల‌పై ప‌వ‌న్ దృష్ఠి పెట్టిన‌ట్లు ఢిల్లీ వ‌ర్గాల స‌మాచారం. త‌న‌కు అధిష్ఠానం వ‌ద్ద ఉన్న ప‌లుకుబ‌డిని స్థానికంగా ఉన్న రాష్ట్ర నాయ‌క‌త్వాల‌కు చాటి చెప్పడం ఒక అంశం. భ‌విష్యత్తులో పోటీకి సంబంధించి స్పష్టత తెచ్చుకోవ‌డానికి ఒక ప్రయ‌త్నం.

జ‌ర అసంత్రుప్తి…

ప‌వ‌న్ క‌ల్యాణ్ కు ఆంధ్రప్రదేశ్ విష‌యంలో పూర్తి స్వేచ్చ ఉండే అవ‌కాశం లేద‌ని సీనియ‌ర్ రాజ‌కీయ‌వేత్తలు పేర్కొంటున్నారు. నిజానికి బీజేపీ, జ‌న‌సేన ల్లో ఏపీకి సంబంధించి ప‌వ‌ర్ స్టార్ పార్టీయే పెద్దది. అయితే వ‌చ్చే ఎన్నిక‌ల‌లో పెద్ద అజెండాను సిద్ధం చేసుకుంటున్న బీజేపీ జ‌న‌సేన పాత్రను ప్రముఖం చేసేందుకు ఇష్టప‌డ‌టం లేదు. అగ్రభూమిక తానే పోషించాల‌ని భావిస్తోంది. ఈ అంశ‌మే జ‌న‌సేన‌ను అసంత్రుప్తికి గురి చేస్తోంది. అధికార వైసీపీకి వ్యతిరేకంగా వ్యవ‌హ‌రించే అంశంలో బీజేపీ తాను సొంతంగా నిర్ణయాలు తీసుకొంటోంది. జ‌న‌సేన‌ను క‌లుపుకుని వెళ్లేందుకు ప్రయ‌త్నించ‌డం లేద‌నే విమ‌ర్శలు ఎదుర్కొంటోంది. బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షునిగా సోము వీర్రాజు బాధ్యత‌లు స్వీక‌రించిన త‌ర్వాత జ‌న‌సేన‌, బీజేపీ బ‌లీయ‌మైన శ‌క్తిగా నిలిచేందుకు స‌మ‌ష్టి కార్యాచ‌ర‌ణ ఉంటుంద‌ని అంద‌రూ భావించారు. కానీ క‌న్నాల‌క్ష్మీనారాయ‌ణ అధ్యక్షునిగా ఉన్న స‌మ‌యంలోనే బీజేపీ, జ‌న‌సేన క‌లిసిక‌ట్టు ఉద్యమాలు కొంత‌మేర‌కు స‌క్సెస్ అయ్యాయి. ప్రస్తుతం ఆ వాతావ‌ర‌ణం లోపించింది. దీంతో జ‌న‌సేన క్యాడ‌ర్ ముందుకెలా వెళ్లాల‌నే విష‌యంలో స్సష్టత తెచ్చుకోలేక‌పోతోంది.

ప‌ట్టించుకోవ‌డం లేదా…?

ప‌వ‌న్ క‌ల్యాణ్‌, సోము వీర్రాజు వ్యక్తిగ‌తంగా మంచి మిత్రులు. నిజానికి 2014కు ముందు ప‌వ‌న్ క‌ల్యాణ్ మోడీతో స‌మావేశం కావ‌డంలో సోము వీర్రాజు కీల‌క పాత్ర పోషించారు. రాష్ట్ర శాఖ అధ్యక్షునిగా బాధ్యత‌లు తీసుకున్న త‌ర్వాత కొంత దూరం పెరిగింద‌నేది రెండు పార్టీల్లో విన‌వ‌స్తున్న అభిప్రాయం. తెలుగుదేశం పార్టీతో మూడు సార్లు గ‌తంలో పొత్తు కుదుర్చుకున్నప్పటికీ జూనియ‌ర్ పార్టన‌ర్ గానే బీజేపీ మిగిలిపోయింది. ఈసారి వ‌చ్చిన అవ‌కాశంతో మేజ‌ర్ భాగ‌స్వామిగా ఆంధ్రప్రదేశ్ లో నిల‌వాల‌నేది బీజేపీ యోచ‌న‌. క‌నీసం ఎంపీ స్థానాల్లో అయినా త‌మ‌కే అత్యధిక సీట్లు వ‌చ్చేలా చూసుకోవాల‌ని బీజేపీ పార్టీ నాయ‌కులు అంత‌ర్గతంగా చ‌ర్చిస్తున్నారు. అయితే ఇందుకు జ‌న‌సేన సిద్ధంగా లేదు. తిరుప‌తి లోక్ స‌భ స్థానానికి జ‌రిగే ఉప ఎన్నిక ఈ పీట‌ముడిని విడిపోయేలా చేయ‌వ‌చ్చు. ఇక్కడ త‌మ‌కు బ‌లం ఉంది. తామే పోటీ చేయాల‌నుకుంటున్నట్లు ప‌వ‌న్ బీజేపీ పెద్దల‌కు చెప్పిన‌ట్లు స‌మాచారం. అయితే వారు మాత్రం సానుకూలంగా స్పందించ‌లేద‌ని తెలుస్తోంది. ఇప్పటికిప్పుడు జ‌న‌సేన
చేయ‌గ‌లిగింది ఏమీ లేదు కాబ‌ట్టి తాత్కాలికంగా ఈవిష‌యంపై ప‌ట్టుద‌ల‌కు పోకూడ‌ద‌ని ప‌వ‌న్ నిర్ణయించిన‌ట్లుగా పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి.

అక్కడా, ఇక్కడా..?

ఆంధ్రప్రదేశ్ తోపాటు తెలంగాణ‌లోనూ త‌మ పార్టీ ప్రభావం చూప‌గ‌లుగుతుంద‌ని ప‌వ‌న్ అభిమానులు విశ్వసిస్తుంటారు. అయితే తెలంగాణ‌లో అస‌లు క‌మ‌ల‌నాథులు ప‌ట్టించుకోవ‌డం లేదు. గ్రేట‌ర్ ఎన్నిక‌లో జ‌న‌సేన‌తో పొత్తు ఉండ‌ద‌ని బీజేపీ రాష్ట్ర నాయ‌కులు ముందుగానే ప్రక‌టించారు. జ‌న‌సేన ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే ప్రక‌ట‌న ఇది. అందుకే గ్రేట‌ర్ లో పోటీ చేయాల‌ని ముందుగా భావించినా చివ‌రికి జ‌న‌సేన సంయ‌మ‌నం పాటించింది. నిర‌స‌న‌ను మ‌రో రూపంలో ప‌వ‌న్ కల్యాణ్ వ్యక్తప‌రిచారు. మిత్రప‌క్షానికి మ‌ద్దతుగా ప‌వ‌న్ క‌ల్యాణ్ హైద‌రాబాద్ లో ప్రచారం చేయ‌లేదు. ల‌క్షల సంఖ్యలో అభిమానులు, సామాజిక మ‌ద్దతు, ల‌క్షల్లోనే ఆంధ్రప్రాంతం నుంచి స్థిర‌ప‌డిన ఓట‌ర్లు ఉన్నప్పటికీ ప‌వ‌న్ బీజేపీకి మ‌ద్దతు స‌మ‌కూర్చే ప్రయ‌త్నం చేయ‌డం లేదు. జ‌న‌సేన అసంత్రుప్తికి ఇది పెద్ద నిద‌ర్శన‌గా చెప్పుకోవ‌చ్చు.

 

– ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News