గాజు గ్లాసు ఖాళీయేనా ..!!

జనసేనాని పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర జిల్లాలపైనే ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. ఇక్కడ ఉన్న మూడు జిల్లాల్లో మెగాభిమానులతో పాటు, సొంత సామాజికవర్గం కూడా కలిస్తే చాలు గెలుపు [more]

Update: 2019-01-30 09:30 GMT

జనసేనాని పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర జిల్లాలపైనే ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. ఇక్కడ ఉన్న మూడు జిల్లాల్లో మెగాభిమానులతో పాటు, సొంత సామాజికవర్గం కూడా కలిస్తే చాలు గెలుపు తీరాలకు చేరిపోవచ్చునని కూడా ఆయన అశించారు. కానీ జరుగుతున్నది వేరుగా ఉంది. పవన్ విశాఖ పర్యటన ఏ మాత్రం సంచలనం నమోదు చేయకుండానే చప్పగా ముగిసిపోయింది. విశాఖలో ఆయన మూడు రోజుల టూర్ చేశారు. పాడేరులో బహిరంగ సభలో పాల్గొన్న పవన్ అక్కడ పార్టీకి కొంత ఊపిరి తెచ్చారు. సహజంగానే అక్కడ బలమైన నాయకుడు, మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు వైసీపీలో ఉండడంతో జనసేనకు ఆశాజనకంగా ఉంది. ఆ తరువాత చూసుకుంటే మాత్రం సమీక్షల పేరుతో పవన్ గడిపారు తప్ప పేరున్న, నోరున్న నాయకుడెవరూ పార్టీలో చేరలేదు.

భారీ చేరికలేవీ….?

నిజానికి పవన్ విశాఖ టూర్ ఖరార్ అయినపుడు భారీ ఎత్తున చేరికలు ఉంటాయని అంతా భావించారు. టీడీపీ, వైసీపీల నుంచి బడా నేతలు వస్తే కండువాలు కప్పుతారని అనుకున్నారు. అయితే ఒక్క నాయకుడు కూడా రాలేదు. దాంతో నిరాశతో పవన్ కొన్ని కామెంట్స్ కూడా పార్టీ మీటింగులో చేశారు. టీడీపీ, వైసీపీలకు ధీటుగా పార్టీ బలం పెరగాలంటే నాయకులు జనంలోకి వెళ్ళాలని ఆయన ఆదేశించారు. మరో వైపు మంత్రి గంటా మీద కూడా సెటైర్లు వేశారు. ఆయన అవినీరిపరుడు, వలస పక్షి కాబట్టే పార్టీలోకి తీసుకోలేదని అన్నారు. ఇక పార్టీలో ఉన్న వారు సైతం పక్క చూపులు చూస్తే సహించేది లేదంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు కూడా నాయకులకు అసహనం తెప్పించాయి.

టికెట్ల లెక్క తేలలేదు…..

ఇదిలా ఉండగా పవన్ టికెట్ల లెక్క కూడా తేల్చకుండా తన పర్యటనను ముగించడంతో ఆశావహులు అసంతృప్తిలో ఉన్నారు. మరో వైపు అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ టికెట్ల మీద దృష్టి ఉంచితే పవన్ మాత్రం అంతా కలసి పనిచేసుకోవాలంటూ సూచించడం పట్ల క్యాడర్లో నీరసం వస్తోంది. విశాఖ జిల్లాలో చూసుకుంటే ఇప్పటికిపుడు జనసేనకు గట్టి అభ్యర్ధులు మెజారిటీ సీట్ల‌లో లేరు. గాజువాకలో మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకట రామయ్య ఉన్న ఆయనతో పాటు మరో నలుగుగు రేసులో ఉన్నారు. ఎలమంచిలిలో టీడీపీ నుంచి వచ్చిన సుందరపు విజయకుమార్ కాస్త బలమైన నేతగా చెప్పుకోవాలి. విశాఖ అర్బన్, రూరల్లో పార్టీకి జనంలో నానిన నాయకులు లేరు. దాంతో పవన్ జనంలోకి వెళ్ళాలని చెప్పి టికెట్లు సంగతి తేల్చకుండా వెళ్ళీపోయారని అంటున్నారు. మరో విడత పర్యటన ఫిబ్రవరిలో ఉంటుందని అపుడే టికెట్ల సంగతి చూస్తానని పవన్ చెప్పడంతో నేతలు దిగులుపడుతున్నారు. మొత్తానికి పవన్ పర్యటనలో చేరికలు ఉంటాయనుకున్నా ఏమీ కాకుండానే ముగియడం గాజు గ్లాస్ పార్టీకి ఇబ్బంది కరమేనంటున్నారు.

Tags:    

Similar News