దండం పెట్టినా దండెత్తుతున్నారే ?

ఒకరు కాదు, ముగ్గురు పెద్దలు చేతులు రెండూ జోడించారు. ఆందోళ‌న నిండిన వదనంలో కలవరపడుతున్న స్వరంతో పొంచి ఉన్న ముప్పు గురించి సవివరంగా చెప్పుకొచ్చారు. ఇది నివారణ [more]

Update: 2020-03-31 14:30 GMT

ఒకరు కాదు, ముగ్గురు పెద్దలు చేతులు రెండూ జోడించారు. ఆందోళ‌న నిండిన వదనంలో కలవరపడుతున్న స్వరంతో పొంచి ఉన్న ముప్పు గురించి సవివరంగా చెప్పుకొచ్చారు. ఇది నివారణ లేనిది కరోనా వైరస్. అంతా కోరస్ గా నిలిచి ఒక్కటైతేనే నియంత్రణ వరకూ సాధ్యపడుతుందని వేడుకున్నారు. ప్రధాని మోడీ, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ ఒక్క గొంతుకగా రానున్న ప్రమాదాన్ని గుర్తించి హెచ్చరించారు. లాక్ డౌన్ ఎందుకు పెట్టాల్సివచ్చిందో కూడా తెలిపారు. సహకరిస్తే సమాజం మొత్తం ముప్పు నుంచి తెప్పరిల్లుతుందని కూడా హిత బోధ చేశారు. కానీ దండం పెట్టినా వినని జనం ఒక్క పెట్టున దండయాత్రే చేస్తున్నారు.

ఇంకా ఎక్కువగా….

మామూలు రోజుల కంటే కూడా సామాన్య జనం ఎక్కువగా రోడ్ల మీదకు వస్తున్నారు. రేపు అన్నది ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి నేడే మనది అనుకుంటూ సరకులు ఇబ్బడి ముబ్బడిగా కొనుగోలు చేస్తున్నారు. తెల్లారుతూనే వీధుల్లోకి వెల్లువలా వచ్చేస్తున్నారు. అటు పచారీ దుకాణాలు, ఇటు రైతు బజార్లలో జనంతో జాతరనే తలపిస్తోంది. లాక్ డౌన్ పేరుకే కానీ జనం అంతా బయటే ఉంటున్న సీన్ స్పష్టంగా కనిపిస్తోంది.

రివర్స్ అయిందా….?

పెద్ద ప్రమాదం దూసుకువస్తోందని ఏలిన వారు చెప్పిన మాటలు రివర్స్ లో జనానికి తాకాయి. దాంతో అనుకోని విధంగా భయకంపితులవుతున్నారు. ఫలితంగా లాక్ డౌన్ కి సహకరించకుండా తమ స్వార్ధం చూసుకుంటున్నారు. ఓ విధంగా చెప్పాలంటే జనాలను కూడా తప్పుపట్టాల్సినది లేదిక్కడ. జీవన పోరాటం అది. తెల్లారిలేస్తే పొయ్యిలో పిల్లిని లేపాలంటే బజారున పడాల్సిందే. ఇలా వచ్చే వారందరికీ కరోనా వైరస్ భయం ఉంది. కానీ దాని కంటే ఆకలి భయమే వారిని రోడ్లకి ఈడుస్తోందని అంటున్నారు.

ఫెయిలేనా…?

జనాలను రోడ్డు మీదకు రావద్దు అన్నారు. బాగానే ఉంది. వారికి కావాల్సిన నిత్యావసరాలు ఇంటికి తెచ్చేలా మెకానిజం మాత్రం రూపొందించలేకపోయారు. దాంతో తప్పనిసరై జనాలు వస్తున్నారు. ఓ విధంగా లాక్ డౌన్ ఫెయిల్ కావడానికి ప్రభుత్వాలు ముందస్తు కసరత్తు చర్యలు చేపట్టపోవడమే కారణం అంటున్నారు. ఇప్పటికైనా ఇళ్ళ వద్దకే సరుకులు అందించేలా ఏర్పాటు చేస్తే లాక్ డౌన్ అన్నది నూరు శాతం కాకపోయినా మెజారిటీ సెక్షన్ పాటించే వీలు అవుతుంది. దండాలు పెట్టడం కాదు. అండగా ఉంటేనే ఇది సాధ్యపడుతుందని పాలకులు కూడా గుర్తెరగాలి.

Tags:    

Similar News