ఆలస్యంగానైనా అర్థం చేసుకున్నారా?

అనుభవమైతేగానీ తత్వం బోధపడదన్నది పాత తెలుగు సామెత. సీపీఎం కేరళ శాఖకు ఈ సామెత ఇప్పుడు చక్కగా వర్తిస్తుంది. రాష్ర్టంలోని ప్రముఖ హిందూ దేవాలయమైన శబరిమల విషయంలో [more]

Update: 2021-04-20 16:30 GMT

అనుభవమైతేగానీ తత్వం బోధపడదన్నది పాత తెలుగు సామెత. సీపీఎం కేరళ శాఖకు ఈ సామెత ఇప్పుడు చక్కగా వర్తిస్తుంది. రాష్ర్టంలోని ప్రముఖ హిందూ దేవాలయమైన శబరిమల విషయంలో గతంలో చేతులు కాల్చుకున్న ప్రస్తుత పినరయి విజయన్ ప్రభుత్వం ఇప్పుడు ఆకులు పట్టుకునే పనిలో నిమగ్నమైంది. సిద్ధాంతాలు, విధానాలను పట్టుకుని ఎన్నికల వేళ వేలాడితే ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని కాస్త ఆలస్యంగా అయినా అర్థం చేసుకుని ఆ మేరకు అడుగులు వేసింది సీపీఎం సర్కార్. శబరిమల విషయంలో గతంలో భక్తుల మనోభావాలకు విరుద్ధంగా వ్యవహరించినందుకు స్వయంగా రాష్ర్ట దేవాదాయ శాఖ మంత్రి, ముఖ్యమంత్రి పినరయి విజయన్ కు సన్నిహితుడైన కె.సురేంద్రన్ క్షమాపణలు చెప్పడం ద్వారా హిందూ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నించారు. క్షమాపణ అక్కర్లేదని స్వయంగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతాారం ఏచూరి స్పష్టం చేసినా సురేంద్రన్ తన ప్రకటనకు కట్టుబడి ఉండటం విశేషం.

శబరిమల వివాదంలో…..

ఈ పరిస్థితి కారణం తెలియాలంటే ఒక్కసారి 2018, 2019ల్లోకి ఒక్కసారి వెళ్లాలి. ఒక వయసుగల మహిళలకు సంబంధించి శబరిమల ఆలయ ప్రవేశం విషయంలో హిందూమత సంప్రదాయం ప్రకారం కొన్ని ఆంక్షలు ఉన్నాయి. ఇవి చెల్లవంటూ 2018లో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఎవరైనా వెళ్లవచ్చంటూ సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. సహజంగానే ఆస్తికత్వాన్ని నిరసించే సీపీఎం సర్కార్ ఈ తీర్పును అందివచ్చిన అవకాశంగా భావించింది. తీర్పు అమలు పేరుతో కొంతమంది మహిళల ఆలయ ప్రవేశానికి సహకరించింది. వారికి పోలీసు రక్షణ కూడా కల్పించింది. సహజంగానే సంప్రదాయవాదులు దీనిని తీవ్రంగా నిరసించారు. ఈ సందర్భంగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పెద్ద సంఖ్యలో అరెస్టులు జరిగాయి.

దాని ప్రభావం….

తమ మత సంప్రదాయాలను, ఆచారాలను సర్కార్ ఉద్దేశపూర్వకంగానే దెబ్బతీసినట్లు మెజార్టీ హిందువులు భావించారు. దీని ఫలితం 2019 ఎన్నికల్లో కనపడింది. మొత్తం 20 సీట్లకు గాను కాంగ్రెస్ నాయకత్వంలోని యూడీఎఫ్ (యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్) 19 కైవశం చేసుకోగా సీపీఎం ఒక్క స్థానంతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. నాటి చేదు అనుభవం ప్రస్తుత ఎన్నికల్లో ఎక్కడ పునరావతమవుతుందోనని భయపడిన పినరయి విజయన్ ప్రభుత్వం ఒక్కసారిగా తన విధానాన్ని మార్చుకుంది. తమది హిందూత్వ అజెండాగా చెప్పుకునే బీజేపీ, మధ్యేమార్గంగా వ్యవహరించే హస్తం పార్టీ ఎక్కడ లబ్ది పొందుతాయోనన్న భయం ఈ పరిస్థితికి కారణమని చెప్పక తప్పదు.

హిందువులే అధికం……

కేరళలో హిందువులు, క్రైస్తవులు, ముస్లిములు ఉన్నప్పటికీ మెజార్టీ ప్రజలు హిందువులే. వీరంతా శబరిమల అయ్యప్ప స్వామిని విశ్వసిస్తారు. ముఖ్యంగా నాయర్ సామాజిక వర్గం వారు ఈ విషయంలో ముందుంటారు. ఒక్క కేరళ హిందువులే కాదు, దేశవ్యాప్తంగా గల హిందువులు అయ్యప్ప మాలలు ధరించి శబరిమల వస్తుంటారు. ముఖ్యంగా తెలుగు రాష్రాల నుంచి ఏటా పెద్దసంఖ్యలో భక్తులు వెళుతుంటారు. ప్రజల మనోభావాల ముందు చట్టాలు, కోర్టులు, రాజ్యాంగాలు, నిబంధనలు నిలబడవని గ్రహించిన పినరయి విజయన్ తన విధానాన్ని మార్చుకుని ప్రాప్త కాలజ్నతను ప్రదర్శించింది. మారుతున్న కాలానికి అనుగుణంగా మారనట్లయితే మనుగడ కష్టమన్న వాస్తవాన్ని చివరకు అయిష్టంగానే అయినా గుర్తించింది. ఓటర్ల మనోభావాలను మన్నించనట్లయితే రాజకీయంగా కనుమరుగు కావాల్సి వస్తుందన్న తెలివిడిని వామపక్ష ప్రభుత్వం ప్రదర్శించింది. ఇంతచేసినా రేపటి ఎన్నికల్లో ఓటర్ల వైఖరి ఎలా ఉంటుందనేది ప్రశ్నార్థకమే.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News