లెక్కల చిక్కులు..?
జనాభా లెక్కల్లో కులం పరిగణనలోకి తీసుకోవాల్సిందేనంటున్నాయి రాజకీయ పార్టీలు. బీజేపీ కూడా ఒక పార్టీగా అందుకు సానుకూలమే. కానీ కేంద్రప్రభుత్వం మాత్రం పెద్దగా స్పందించడం లేదు. ఈ [more]
జనాభా లెక్కల్లో కులం పరిగణనలోకి తీసుకోవాల్సిందేనంటున్నాయి రాజకీయ పార్టీలు. బీజేపీ కూడా ఒక పార్టీగా అందుకు సానుకూలమే. కానీ కేంద్రప్రభుత్వం మాత్రం పెద్దగా స్పందించడం లేదు. ఈ [more]
జనాభా లెక్కల్లో కులం పరిగణనలోకి తీసుకోవాల్సిందేనంటున్నాయి రాజకీయ పార్టీలు. బీజేపీ కూడా ఒక పార్టీగా అందుకు సానుకూలమే. కానీ కేంద్రప్రభుత్వం మాత్రం పెద్దగా స్పందించడం లేదు. ఈ నిర్ణయం తీసుకోవడంలో ప్రభుత్వాల లెక్కలు వేరు. నిజానికి ప్రజాస్వామ్యంలో ఓట్ల లెక్కలే రాజ్యం చేస్తున్నాయి. కులాలవారీ ప్రాథాన్యాలు పెరిగిపోయాయి. అభ్యర్థుల ఎంపిక మొదలు , మంత్రివర్గాల్లో స్థానాల వరకూ అన్నిటా కులం లెక్కలే. మరి వివిధ సామాజిక కులాల జనాభాను ఒక నిర్దిష్టమైన పరిణామంలో సాధికారికంగా నిరూపించేందుకు సెన్సెస్ ను వినియోగించుకోవచ్చు. కానీ ప్రభుత్వాలు రకరకాల కారణాలతో వెనకంజ వేస్తున్నాయి. గడచిన 20 సంవత్సరాలుగా ఈ డిమాండ్ వినవస్తూనే ఉంది. దానంతటదే పక్కనపడుతోంది.
కచ్చితంగా కావాల్సిందే…
కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ స్థూలంగా జనాభా లెక్కల్లో కులగణనను ప్రామాణికంగా తీసుకోవడం లేదు. కేవలం షెద్యూల్డుకులాలు, షెడ్యూల్డు తెగలు, ఇతరులు అనే మూడు కేటగిరిల్లోనే జనాభాను పరిగణిస్తున్నారు. దేశవ్యాప్తంగా క్రమేపీ రిజర్వేషన్ సంస్కృతి విస్తరిస్తోంది. కేంద్రమే స్వయంగా ఓబీసీ ప్రవేశపెట్టింది. ఈబీసీని ఆచరణలోకి తెచ్చింది. ఇక రాష్ట్రాలు రిజర్వేషన్లను రకరకాల రూపంలో అమలు చేస్తున్నాయి. ఆయా సామాజిక వర్గాలను ఉద్దరించాలన్న లక్ష్యం కంటే ఓట్లుగా మలచుకోవాలనే తపనే ఎక్కువ. ఈ నేపథ్యంలోనే సామాజిక సంతులనం దెబ్బతింటోంది. వివిధ కులాలు తమ జనాభాను ఎక్కువ చేసి చూపేందుకే ప్రయత్నం చేస్తున్నాయి. తద్వారా ఆర్థిక, సామాజిక, రాజకీయ ప్రయోజనం ఎక్కువగా పొందాలనేది ఆయా వర్గాల లక్ష్యం. దీనివల్ల సమాజం నుంచి చేయూత పొందాల్సిన వర్గాలు అన్యాయానికే గురవుతున్నాయి. అందుకే ప్రతి పది సంవత్సరాలకోసారి నిర్వహించే జనాభా లెక్కల్లో కచ్చితంగా కులాలవారీ జనాభాను తేల్చడం అవసరమైన అంశమే.
ఓటు లెక్క తప్పుతోంది…
రాజకీయ పార్టీలు ప్రజలను మనుషులుగా చూడటం మానేశాయి. ఓట్ల కిందనే పరిగణనలోకి తీసుకుంటున్నాయి. జనాభా లో అధిక సంఖ్యలో ఉండాలి. లేదా ఆర్థికంగా బలంగా ఉండి, ఓట్లను గంపగుత్తగా కొనుగోలు చేయగల సామర్థ్యం ఉండాలి. అటువంటి వారే చట్టసభలకు అభ్యర్థులుగా ఎంపిక అవుతున్నారు. వారే పాలకులుగా మారుతున్నారు. సామాజిక సంక్సేమం, బలహీనవర్గాలను ఆదుకోవడం వంటి కబుర్లన్నీ మెరమెచ్చు మాటలే. ఆయా వర్గాలకున్న ఓటు బ్యాంకును దృష్టిలో పెట్టుకునే సంక్సేమ పథకాలను ఆచరణలోకి తెస్తున్నారు. తీవ్రంగా వెనకబడిన వారిని ప్రధాన స్రవంతిలోని వర్గాలకు సమానంగా తేవాలనే సామాజిక లక్ష్యం కనిపించడం లేదు. ఈ నేపథ్యంలోనే బలమైన సామాజిక వర్గాలు రిజర్వేషన్లు, సంక్షేమ పథకాలకోసం రాజకీయ పార్టీలను బ్లాక్ మెయిల్ చేస్తున్నాయి. దీంతో బలహీనంగా ఉన్నవారు నష్టపోతున్నారు. దీనికి పరిష్కారం సమాజంలో వివిధ వర్గాల జనాభాను సాధికారికంగా తేల్చి, తర్వాత వివిధ ప్రభుత్వ పదవులు, సామాజిక అంతస్థులో ఎవరెక్కడ ఉన్నారో లెక్క తీస్తే సరిపోతుంది. దానికనుగుణంగా సీట్ల కేటాయింపు, పదవుల పంపిణీ చేయవచ్చు. లేకపోతే కొన్ని వర్గాలు, పలుకుబడి కలిగిన వారికే రాజకీయ పార్టీలు పెద్దపీట వేస్తున్నాయి.
సెంటిమెంటుకో సింబల్…
భారతదేశంలో రిజర్వేషన్ కోరుకోని వారిదే తప్పు అన్నట్లుగా మారింది పరిస్థితి. దాదాపు అన్ని సామాజిక వర్గాలు రిజర్వేషన్ కోటాలో తమను చేర్చాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పటికే రిజర్వేషన్ పరిధిలో ఉన్నవర్గాలు తమకు మరింత మెరుగ్గా ఫలితాలు లభించేందుకు గాను ఇంకా మెరుగైన కోటా పరిధిలోకి తేవాలని డిమాండ్ చేస్తున్నాయి. అనుచితమైన ప్రయోజనం పొందాలని వెంపర్లాడుతున్నారు. ఎస్సీ,ఎస్టీ వర్గాల వారు కూడా పది ఇరవై సంవత్సరాల తర్వాత సమాజంలో ఇతరులతో సమాన స్థాయికి చేరుకొంటారని అంబేద్కర్ భావించారు. రిజర్వేషన్ దీర్ఘకాలం ఉండటం వాంఛనీయం కాదని పేర్కొన్నారు. కానీ 75 సంవత్సరాల తర్వాత కూడా రిజర్వేషన్ అన్నది మరింత గా విస్తరించింది. ప్రయోజనాలు పలచనైపోయాయి. రాజకీయ పార్టీలు ప్రతి ఎన్నికల సందర్భంలోనూ కొన్ని కొత్తకులాలకు రిజర్వేషన్ ఇస్తామంటూ నమ్మబలుకుతున్నాయి. అవసరాన్ని బట్టి వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. సమాజంలో ఒత్తిడి రాజకీయాలు పెరిగిపోయాయి. సామాజిక వెనకబాటుతనం కంటే అనుచిత లబ్ధి కోసం కొన్ని వర్గాలు ఆశపడటం, వాటికి రాజకీయ పార్టీలు దన్నుగా నిలవడం పరిపాటిగా మారింది. ఇది సమాజంలో సంక్షోభానికి కారణమవుతుంది. అందుకే ఎవరి జనాభా ఎంత ఉందనేది తేలాలి. ఇప్పటివరకూ ఆయా వర్గాలు పొందిన ప్రయోజనాలు వెల్లడి కావాలి. లోపాలను అనుసరించి దిద్దుబాటు చర్యలు తీసుకోవాలి. రిజర్వేషన్లకు అవసరమే ప్రాతిపదిక కావాలి. అంగబలంతో కొన్ని వర్గాలు మాత్రమే రిజర్వేషన్ ఫలాలను అనుభవిస్తే మిగిలిన వర్గాలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. అందుకే ఈ ఏడాది జరగబోయే జనగణనలో కచ్చితంగా కులాలవారీ లెక్కలు సేకరిస్తేనే మంచిది.
-ఎడిటోరియల్ డెస్క్