సుడిగుండంలో రాజకీయం

గోదావరిలో బోటు మునిగిన నాటి నుంచి తూర్పు గోదావరిలో రాజకీయాలు సుడిగుండాల్లా తిరుగుతున్నాయి. అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేలా అన్ని పక్షాలు ముప్పేట దాడి మరింత ముమ్మరం [more]

Update: 2019-09-28 08:00 GMT

గోదావరిలో బోటు మునిగిన నాటి నుంచి తూర్పు గోదావరిలో రాజకీయాలు సుడిగుండాల్లా తిరుగుతున్నాయి. అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేలా అన్ని పక్షాలు ముప్పేట దాడి మరింత ముమ్మరం చేశాయి. వైసిపి ప్రభుత్వానికి బోటు వెలికితీయడం ఇష్టం లేక నిజాలు సమాధి చేసేందుకు ఆపరేషన్ తూతూ మంత్రంగా సాగిస్తుందని టిడిపి ఆరోపిస్తూ వస్తుంది. దీనికి తోడు మాజీ ఎంపి హర్ష కుమార్ బోటులో 93 మంది అంటూ చేసిన ప్రకటన సంచలనంగా మారి సర్కార్ ను మరింత ఇరుకున పెట్టింది. దాంతో తమ ముందు హాజరయి తన ప్రకటనపై ఆధారాలు తెలపాలంటూ అధికార యాంత్రాంగం ఇప్పటికే హర్ష కుమార్ కి నోటీసులు జారీ చేసింది. అయితే ఆ విచారణకు హర్షకుమార్ హాజరు కాలేదు కానీ అటు సోషల్ మీడియా లోను ఇటు అఖిలపక్ష వేదికలపై ప్రభుత్వ తీరును ఎండగడుతూ వార్తల్లో నిలుస్తున్నారు.

బోటు ఎందుకు తీయలేకపోతున్నారు ?

కచ్చులూరు లో జరిగిన బోటు ప్రమాద సమయంలో 77 మంది ఉన్నారని ప్రభుత్వ సవరించిన అంచనా. ఇందులో 26 మంది సురక్షితంగా బయట పడ్డారు. గల్లంతైన వారిలో 37 మృతదేహాలు లభించగా మరో 14 మంది ఆచూకీ లభించలేదు అన్నది అధికారుల లెక్క. ప్రమాదం జరిగిన ప్రాంతంలో తీవ్ర ప్రతికూల పరిస్థితుల కారణంగా బోటు బయటకు తీయలేకపోతున్నామని సర్కార్ చెబుతుంది. సుమారు 250 నుంచి 300 ల అడుగుల లోతున బోటు ఉందని గుర్తించారు. అయితే కచ్చులూరు ప్రాంతం లో మూడు అతి పెద్ద సుడిగుండాలు వెలికితీత ఆపరేషన్ కి ప్రతి బంధకాలుగా నిలుస్తున్నాయి. అత్యంత వేగవంతంగా సాగే ప్రవాహం నదిలోకి అడుగున మరింతగా ఉంటుంది. సముద్రం పై భాగంలో ప్రవాహం కనిపిస్తే గోదావరిలో ముఖ్యంగా పాపికొండల పరివాహక ప్రాంతంలో నది అడుగున అత్యంత వేగవంతంగా ప్రవాహం సాగుతుంది. అడుగు భాగాన కొండలు వంటివి బండరాళ్లు ఉండటంతో నది పైభాగంలో భారీ సుడిగుండాలు ఏర్పడతాయి. ఇలాంటి ప్రతికూల పరిస్థితులను అంచనా వేసిన దేశంలోని నిపుణుల బృందాలు బోటు వెలికి తీయడం ఇప్పట్లో అయ్యే పని కాదని వెనక్కి తగ్గాయి.

మేము తీస్తామంటూ…

ఇలాంటి వాతావరణంలో ఆపరేషన్స్ చేపట్టే బృందాలు వెలికితీతకు వెనక్కి వెళుతుంటే కొందరు మత్స్యకారులు తమకు అవకాశం ఇవ్వండి అంటూ ముందుకు వస్తున్నారు. అయితే వీరికి ఎలాంటి అనుభవం బోట్లు వెలికితీతలో లేనందున అధికారులు రిస్క్ తీసుకోలేక పోతున్నారు. అయితే అన్ని వైపులా ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతూ ఉండటంతో మంత్రి కన్నబాబు ద్వారా సర్కార్ వివరణ ఇచ్చింది. ప్రస్తుత తాజా పరిస్థితి వివరిస్తూ ఎవరైనా బోటు తీసేందుకు ముందుకు వస్తే వారు తూర్పు జిల్లా గోదావరి కలెక్టర్ ను కలిసి తమ ప్లాన్ వివరించవచ్చని ఆఫర్ ఇచ్చింది ప్రభుత్వం. ఇప్పటివరకు ఈ అవకాశం ఇచ్చేందుకు ప్రభుత్వం ముందుకు రాలేదు. కానీ వారు బయటకు తీస్తాం అంటే ఎందుకు అనుమతి ఇవ్వరంటూ అన్ని వర్గాల నుంచి వత్తిడి పెరగడం తో ఈ నిర్ణయానికి రాక తప్పలేదు.

సాహస వీరులకు బహుమానం…

కచ్చులురు దగ్గర ప్రమాదం సంభవించిన వెంటనే ప్రాణాలకు తెగించి కొందరు పర్యాటకులను కాపాడిన గ్రామస్థులకు 25 వేల రూపాయల చొప్పున నగదు రివార్డు ను ముఖ్యమంత్రి జగన్ అందజేయాలని ఆదేశించినట్లు మంత్రి కన్నబాబు వెల్లడించారు. సాహస వీరులను కీర్తిస్తూ సోషల్ మీడియా లో అంతా ప్రశంసలు కురిపించారు. ఈ గిరిపుత్రులకు ప్రభుత్వం ప్రోత్సహం అందించాలని అభిలషించారు. వాటిని పరిగణలోకి తీసుకున్న సర్కార్ ఈ నిర్ణయం ప్రకటించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

విమర్శలకు దారితీసిన 144…..

బోటు ప్రమాదం జరిగిన ప్రాంతంలో 144 వ సెక్షన్ ను అధికార యంత్రాంగం అమలు చేయడం తీవ్ర విమర్శలకు తెరతీసింది. మీడియా పైనా ఆంక్షలను అన్ని పక్షాలు ఖండిస్తున్నాయి. అధికార యంత్రాంగం ఇలాంటి నిర్ణయాలతో అనుమానాలు ఆరోపణలు పెల్లుబికుతున్నాయి.అయితే మావోయిస్టు ల వారోత్సవాల సందర్భంగానే ఈ ఆంక్షలు అని అధికారుల వివరణ తో అంతా సంతృప్తి చెందడం లేదు. బోటు వెలికితీస్తే క్యాబిన్ లో చిక్కుకున్న మృత దేహాలు లభిస్తాయని బంధువుల ఆవేదన, ఆందోళనకు తెరదించవచ్చని అంతా అంటున్నారు.

డెత్ సర్టిఫికెట్లు మరో సమస్య…

మృత దేహాలు లభిస్తే డెత్ సర్టిఫికెట్ల జారీ నుంచి నష్ట పరిహారం వరకు ప్రక్రియ సజావుగా సాగుతుంది. ఫలితంగా భీమా కంపెనీలకు మృతులు క్లెయిమ్ చేసుకునే వీలు ఉంటుంది. అదే మృతదేహం లభించక గల్లంతు జాబితాలో ఉంటే కర్మ కాండల నుంచి ఇన్సూరెన్స్ క్లెయిమ్ ల వరకు అనిశ్చితి… ఆందోళనే. దీనిపైనే గల్లంతు అయిన వారి తాలూకా బంధువులు అధికారులను ఈ సమస్య ను పరిష్కరించాలని వేడుకుంటున్నారు. బాధితులు విపక్ష టిడిపి వారిని ప్రజాసంఘాల నేతల చుట్టూ తిరుగుతూ ప్రాధేయపడటం తో వారంతా విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం గల్లంతైన వారి బంధువుల సమస్యలపై దృష్టి పెట్టింది. అవసరం అయితే ప్రత్యేక జీవో ద్వారా డెత్ సర్టిఫికెట్లు గల్లంతు అయిన వారికి మంజూరు చేసేందుకు న్యాయపరమైన చిక్కులు ఎదురుకాకుండా కార్యాచరణ రూపొందిస్తోంది. మొత్తానికి బోటు ప్రమాదం జరిగిన నాటి నుంచి తూర్పున రాజకీయం వేడెక్కింది. మరి జగన్ సర్కార్ దీనికి ఎప్పటికి ఫుల్ స్టాప్ పెడుతుందో వేచి చూడాలి.

Tags:    

Similar News