పొగుడుట పెరుగుట కొరకే… ?

తీపి ఎక్కువగా తినవద్దు. హెల్త్ కి అనర్ధం, సుగర్ వ్యాధి వస్తుంది అని డాక్టర్లు బాగానే చెబుతారు. కానీ తీపి ఎవరికి చేదు అనే అంటారు. తీపి [more]

Update: 2021-09-14 00:30 GMT

తీపి ఎక్కువగా తినవద్దు. హెల్త్ కి అనర్ధం, సుగర్ వ్యాధి వస్తుంది అని డాక్టర్లు బాగానే చెబుతారు. కానీ తీపి ఎవరికి చేదు అనే అంటారు. తీపి రుచి ఒక్కసారి మరిగాక ఇక చావైనా రేవైనా తేల్చుకుంటామనే అంటారు. తీపిలో అత్యంత మధురం పొగడ్తలు. ఒక్క పొగడ్త చాలు ఎటువంటి వారైనా ఎక్కడికో వెళ్ళిపోతారు. నిజానికి పొగడ్త లేని రంగం ఉందా. ఆఫీసులలో బాస్ ని ప్రసన్నం చేసుకునేందుకు మొదలుపెట్టే ఈ పొగడ్తలు సినీ రంగం నుంచి రాజకీయ రంగం వరకూ అంతటా బాగానే విస్తరించేశాయి. పొగడ్తలకు పడను అనే వారే ఎక్కువగా వీటికి బలి అవుతూంటారు. ఇక రాజకీయాల్లో మైకు అందుకునే నేతాశ్రీల నోటి నుంచి తొంబై శాతం వచ్చే మాటలు పొగడ్తలే.

అవసరమేనా…?

రాజకీయాలు బాగా మారిపోయాయి. ఒకపుడు తాను ఉన్న పార్టీకి జై అనే నాయకులు ఇపుడు తనకు టికెట్ ఇచ్చిన అధినాయకుడికి జేజేలు పలుకుతున్నారు. ఒకపుడు పార్టీ చుట్టూ నాయకులు తిరిగేవారు. ఇపుడు అధినేత తోనే అంతా అంటున్నారు. వన్ మ్యాన్ షోగా పార్టీలు, పాలిటిక్స్ మారిపోయిన వేళ పొగడడం అనే ఆయుధం లేకపోతే ఎవరైనా ఎలా నెగ్గుకురాగలరు చెప్పండి అంటున్నారు నాయకులు. భారత దేశ రాజకీయాల్లో ఇందిరా గాంధీ నుంచి వ్యక్తి పూజ మొదలైంది. అదిపుడు పాకాన పడింది. బీజేపీలో వాజ్ పేయి అద్వానీల శకం ముగిశాక మోడీ కే ఎక్కువగా పొగడ్తల వర్షం కురుస్తోంది.

పాదాభివందనాలే ….

ఇక ప్రాంతీయ పార్టీలలో చూసుకుంటే పాదాభివందనాలు కూడా చాలా కామన్ అయిపోయాయి. తమకు టికెట్ ఇచ్చి మంత్రి గిరీ ఇచ్చిన అధినాయకుడు దేవుడి కంటే కూడా ఎక్కువ అని భావించే తరం బయల్దేరింది. ప్రమాణ స్వీకార ఘట్టంలో మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన వారు వేదిక మీదనే అధినాయకుడికి సాష్టాంగ ప్రమాణం చేస్తూ వేలాది జనానికి విస్మయం కలుగచేస్తున్నారు. ఇక తమిళనాట ఎమ్జీయార్ దేవుడు, జయల‌లితమ్మ దేవత అయిపోయారు వారి పార్టీ జనాలకు. డీఎంకేలో కూడా కరుణానిధిని దర్శించుకుని కాళ్ళు కడిగిన నాయకులు ఎందరో ఉన్నారు. ఇక తెలుగు రాజకీయాలో పాదాభివందనాలు అన్న గారి టైమ్ నుంచి మొదలయ్యయని చెబుతారు. ఇది ఎంతవరకూ వెళ్ళిందంటే అలా చేయని వారు పార్టీకి విరోధులుగా అధినాయకత్వం భావించేటంతగా అని చెప్పాలి.

జాఢ్యమైనా తప్పదుగా …?

ఇక వర్తమాన రాజకీయాలు చూసుకుంటే చంద్రబాబును పొగడని తెలుగు తమ్ముడు కనిపిస్తాడా. నాడు వైఎస్సార్ ని కానీ నేడు జగన్ ని కానీ కీర్తించని అనుచరులను చూడగలమా. ఇదంతా ఒక అలవాటుగా సాగిపోతున్న రాజకీయం. అలాంటిది డీఎంకే అధినేత‌, తమిళ సీఎం స్టాలిన్ తనను ఎవరూ పొగడవద్దు అంటే మాత్రం ఆగుతుందా. ఇక స్టాలిన్ ని ఆదర్శంగా తీసుకోవాలని నీతులు చెబుతున్న సీపీఐ నారాయణ వంటి వారు దేశంలో రాజకీయ ఒరవడి ని మొత్తం మార్చేయగలమని ధీమా పడుతున్నారా అనిపించకమానదు. ఇది పరస్పర అవసరం. ఎవరి బాధ వారిది. పొగిడితే పదవి దక్కిన వేళ అలాగే చేస్తారు. పొగిడినా ఏమీ ఇవ్వకపోతే అపుడు వేరేలా వాయిస్ మారుతుంది. ఇక ఒకసారి టికెట్ ఇచ్చి మంత్రిని చేసి తరువాత ఎన్నికల్లో నో చెప్పినా ఆ పొగడ్తలే శాపనార్ధాలుగానూ మారతాయి. అందువల్ల పొగడడం ఆపేయాలి అంటే అసలు కుదరదు ఈ రాజకీయ రొంపిలో. ఇది ఇంతే.

Tags:    

Similar News