అసోంను అల్లాడించిన ఈయన ఇప్పుడెక్కడ?

ప్రఫుల్ల కుమార్ మహంతా ….ఈ తరం వారికి ఈ పేరు తెలియకపోవచ్చు. ఎనిమిదో దశకంలో ఆయన పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది. చిన్న వయసులో ఈశాన్య భారతంలోని అతి [more]

Update: 2021-03-26 16:30 GMT

ప్రఫుల్ల కుమార్ మహంతా ….ఈ తరం వారికి ఈ పేరు తెలియకపోవచ్చు. ఎనిమిదో దశకంలో ఆయన పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది. చిన్న వయసులో ఈశాన్య భారతంలోని అతి పెద్ద రాష్ర్టమైన అసోం ముఖ్యమంత్రిగా సంచలనం సృష్టించారు. విద్యార్థి నాయకుడిగా ప్రారంభమైన మహంతా ప్రస్థానం అనతికాలంలోనే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే దశకు చేరింది. రెండు దఫాలు సీఎంగా అసోం చరిత్రనే మలుపు తిప్పిన ఘనత ఆయనది. తరవాత కాలంలోనూ రాష్ర్టంలో ప్రధాన పార్టీ అధినేతగా కీలకంగా వ్యవహరించారు. ప్రస్తుతం రాజకీయంగా వానప్రస్థానంలో ఉన్నారని చెప్పవచ్చు.

ఇప్పటికీ శక్తిగానే….?

ఇప్పటికీ రాష్ట్ర రాజకీయాల్లో ప్రఫుల్ల కుమార్ మహంతా ఒక శక్తి అని చెప్పడంలో సందేహం లేదు. కానీ గతంలో మాదిరిగా రాష్ర్ట రాజకీయాలను శాసించే, చరిత్రను తిరగరాసే బలమైన నేత కాదన్నది చేదు నిజం. ప్రస్తుతం సొంత పార్టీనే ఆయనను చిన్నచూపు చూస్తోంది. ఎంతగా అంటే ఆయన సొంత నియోజకవర్గాన్ని మిత్రపక్షమైన భాజపాకు కట్టబెట్టి పార్టీ వ్యవస్థాపకుడైన ప్రఫుల్ల కుమార్ మహంతా కు మొండి చేయి చూపింది. ఈ పరిస్థితుల్లో ఆయన హస్తం పార్టీ కూటమిలో చేరవచ్చన్న ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో వ్యాపిస్తున్నాయి. మహంతా కూడా ఈ మేరకు సంకేతాలు పంపుతున్నారు. మూడు దశాబ్దాల క్రితం మహంతా రాజకీయ జీవితం మూడుపువ్వులు ఆరుకాయలు చందంగా ఉండేది.

విద్యార్థి సంఘం నేతగా…..

గువహతీ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా రాజకీయ అరంగ్రేటం చేశారు. అనంతరం ‘ఆసు’ (ఏఏఎసు – ఆల్ అసోం స్టూడెంట్స్ యూనియన్) అధ్యక్షుడిగా అక్రమ వలసలపై గళమెత్తారు. పొరుగున ఉన్న బంగ్లాదేశ్ నుంచి యథేచ్ఛగా కొనసాగుతున్న అక్రమ వలసలు, ముఖ్యంగా ముస్లిం మైనార్టీల వలసల కారణంగా అసోం ముఖచిత్రమే మారిపోతుందంటూ ఆందోళన వ్యక్తం చేస్తూ ఉద్యమబాట పట్టారు. అక్రమ వలసల కారణంగా రాష్ర్టంలోని స్థానికులు మైనార్టీలుగా మారిపోతున్నారని, ఇది అసోం ఉనికినే దెబ్బతీస్తుందని ప్రజల్లోకి వెళ్లారు. దీన్ని అరికట్టాలని కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చారు. దీంతో నాటి కేంద్రంలోని రాజీవ్ గాంధీ సర్కారు దిగివచ్చింది. 1985లో ఈ మేరకు అసోం ఒప్పందం రూపుదాల్చింది. దీని ప్రకారం రాష్ర్టంలో అక్రమంగా నివసిస్తున్న విదేశీయులు (బంగ్లాదేశీయులు) ను గుర్తించే పని చేపట్టారు. అనంతరం 1985 డిసెంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రఫుల్ల కుమార్ మహంతా నాయకత్వంలోని అసోం గణ పరిషత్ (ఏజీపీ) ఘన విజయం సాధించింది. తరవాత 1996లో జరిగిన ఎన్నికల్లో నూ మహంతా విజయం సాధించి రెండోసారి అధికార పగ్గాలు అందుకున్నారు. అప్పటి నుంచి 2001 వరకు అధికారంలో కొనసాగారు.

2001 నుంచి తిరోగమనంలో…..

అప్పటినుంచి మహంతా రాజకీయ జీవితం తిరోగమనంలో నడిచింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ 2005లో సొంత పార్టీ ఆయనను బహిష్కరించింది. దీంతో ఏజీపీ (ప్రోగ్రెసీవ్) పేరుతో సొంత పార్టీని పెట్టుకున్నారు. చివరికి 2008లో పార్టీని ఏజీపీలో విలీనం చేశారు. 2016లో భాజపాతో పొత్తు పెట్టుకుని ఏజీపీ 26 స్థానాల్లో పోటీ చేసి 14 చోట్ల విజయం సాధించింది. మంత్రివర్గంలో చేరింది. తాజాగా అతుల్ బోరా నాయకత్వంలోని ఏజీపీ మహంతాకు చెక్ పెట్టింది. మహంతా 1985 నుంచి పోటీ చేస్తున్న నౌగాన్ జిల్లాలోని బర్హంపూర్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని భాజపాకు కేటాయించింది. భాజపా అభ్యర్థి జితు గోస్వామి అక్కడి నుంచి బరిలోకి దిగారు. దీనర్థం మహంతా సేవలు పార్టీకి అవసరం లేదని, ఆయన బయటకు వెళ్లవచ్చని పరోక్షంగా చెప్పడమే. 1952 డిసెంబరులో జన్మించిన మహంతా అనారోగ్యంతో దిల్లీలోని ఎయిమ్స్ లో చేరారు. ఇటీవల ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జి అయిన మహంతా తన నియోజకవర్గాన్ని భాజపాకు పార్టీ కేటాయించడంపై ఏమీ మాట్లాడలేదు. గుంభనంగా ఉన్నారు. పరిస్థితులను గమనిస్తున్నారు. ఆయన ఆయన కాంగ్రెస్ నాయకత్వంలోని కూటమిలో చేరవచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ కూటమిలో ఇప్పటికీ సీపీఐ, సీపీఎం, సీపీఐ (ఎంల్), ఏఐయూడీఎఫ్ (ఆలిండియా యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్), బీపీటీ (బోడో పీపుల్స్ ఫ్రంట్) ఉన్నాయి. గత ఎన్నికల్లో ఏఐయూడీఎఫ్ 14, బీపీఎఫ్ 12 సీట్లు సాధించాయి. బీపీఎఫ్ మొన్నటిదాకా భాజపా మంత్రివర్గంలో కొనసాగింది. ఇప్పుడు మహంతా కూడా కలిస్తే కాంగ్రెస్ కూటమి బలోపేతమయ్యే అవకాశంఉంది.

 

– ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News