ఎదిగే తొందరలో..?
లక్ష్యం నిర్దేశించుకున్నప్పుడు రుజు మార్గంలోనే ప్రయాణం చేయాలి. తొందరగా దానిని అందుకోవాలని అడ్డ దారిలో ప్రస్థానిస్తే గమ్యం చేరే చివరి క్షణాల్లో తమ పనులే కాళ్లకు అడ్డం [more]
లక్ష్యం నిర్దేశించుకున్నప్పుడు రుజు మార్గంలోనే ప్రయాణం చేయాలి. తొందరగా దానిని అందుకోవాలని అడ్డ దారిలో ప్రస్థానిస్తే గమ్యం చేరే చివరి క్షణాల్లో తమ పనులే కాళ్లకు అడ్డం [more]
లక్ష్యం నిర్దేశించుకున్నప్పుడు రుజు మార్గంలోనే ప్రయాణం చేయాలి. తొందరగా దానిని అందుకోవాలని అడ్డ దారిలో ప్రస్థానిస్తే గమ్యం చేరే చివరి క్షణాల్లో తమ పనులే కాళ్లకు అడ్డం పడతాయి. నిలువు కాళ్లపై బోర్లా పడతాం. అందేంత దూరంలో లక్ష్యం కనిపిస్తున్నా చేరుకోలేని నిస్సహాయత అలుముకుంటుంది. రాజకీయాలకే కాదు, అన్ని రంగాలకూ ఇది వర్తిస్తుంది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అగ్రనేతల్లో ఒకరైన రేవంత్ రెడ్డి పరిస్థితి ఇదే. రేపోమాపో పీసీసీ అధ్యక్షునిగా నియామకం ఖాయమవుతోంది. నేరుగా ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రధాన ప్రత్యర్థిగా రూపుదాల్చే అద్భుత అవకాశం ముంగిట్లో కనిపిస్తోంది. కానీ ఆ ఆశలన్నిటికీ గండి కొడుతూ ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితునిగా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ చార్జిషీటు దాఖలు చేసింది. అసలే కాంగ్రెసు పార్టీలో రేవంత్ రెడ్డి ఎదుగుదలను చూసి ఓర్వలేని నాయకులకు కొదవ లేదు. అధిష్ఠానం సానుకూలంగా ఉన్నప్పటికీ తాజా ఛార్జి షీటు రేవంత్ అవకాశాలకు గండి కొట్టే ప్రమాదం ఉంది. తీవ్రమైన కేసులో నిందితుడిని పీసీసీ అధ్యక్షునిగా పెట్టుకుని ఎన్నికలకు వెళ్లేందుకు కాంగ్రెసు సాహసిస్తుందా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.
రాజకీయ ఆజ్యం…
ఆరేళ్ల పాత కేసు హఠాత్తుగా మళ్లీ తెరపైకి రావడంలో అనేక రకాల అనుమానాలు ముసురుకుంటున్నాయి. రాష్ట్ర కాంగ్రెసులోని పెద్ద నాయకులు రేవంత్ రెడ్డి పట్ల కొంత విముఖతను ప్రదర్శిస్తూ వస్తున్నారు. ఒకసారి ఆయన గుప్పట్లోకి పార్టీ వస్తే తమకు శాశ్వతంగా వీడ్కోలు తప్పదని వారికి తెలుసు. విచిత్రమేమిటంటే వారెవరికీ ప్రజల్లో పలుకుబడి లేదు. ప్రజాప్రతినిధిగా, సుదీర్ఘకాలం మంత్రిగా పని చేసి, తనకు తాను పైస్తాయిలో ఊహించుకునే జానారెడ్డి సైతం ఈ వ్యతిరేకుల్లో ఒకరిగానే చెప్పాలి. రాష్ట్ర కాంగ్రెసు నిర్వీర్యమైపోతున్న పరిస్తితిని ఏఐసీసీ చాలాకాలం నుంచి గమనిస్తోంది. రేవంత్ రెడ్డి చురుకైన నేత. ప్రజల్లో పార్టీకి ఉత్సాహం తెచ్చి పెట్టగల నైపుణ్యం అతనికి ఉంది. పీసీసీ పగ్గాలు అప్పగిస్తే రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి పార్టీని పునరుత్తేజితం చేస్తానని ఇప్పటికే రాహుల్ కు ప్పష్టమైన హామీ ఇచ్చారాయన. రేవంత్ రెడ్డి మాత్రమే పార్టీని గట్టెక్కించగలడని సమాచారం ఏఐసీసీ వద్ద కూడా ఉంది. కేసీఆర్ ను దీటుగా ఎదుర్కోవడానికి పీసీసీ పగ్గాలు ఇచ్చేందుకు కాంగ్రెసు పార్టీ అధిస్టానం సానుకూలంగా ఉంది. నాగార్జునసాగర్ ఎన్నికల వరకూ ఓపిక పట్టమని జానారెడ్డి కోరడంతోనే ఈ నిర్ణయాన్ని వాయిదా వేశారు. సీనియర్ల సత్తా ఏమిటో ఆ ఒక్క ఎన్నికతోనే తేటతెల్లమై పోయింది. రేవంత్ కు పీసీసీ బాధ్యతలు అప్పగించడం మినహా ఇక ప్రత్యామ్నాయం లేదు. ఈ స్తితిలో ఓటుకు నోటు కేసు మరోసారి రచ్చ కెక్కడం బీజేపీ, టీఆర్ఎస్ వ్యూహంలో బాగమనే విమర్శలు వినవస్తున్నాయి. రెడ్డి సామాజిక వర్గం, కాంగ్రెసులో అసంత్రుప్తితో ఉన్న నాయకులను బీజేపీలో చేరకుండా రేవంత్ నిలువరిస్తున్నారు. పైపెచ్చు రాష్ట్రంలో టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయంగా ఎదగాలని బీజేపీ బావిస్తోంది. ఈ మార్గంలో రేవంత్ రెడ్డి అడ్గుగా నిలుస్తారని కమలనాథుల అంచనా. పైపెచ్చు కాంగ్రెసు బలపడితే బీజేపీ ఎప్పటికీ తృతీయ పక్షంగానే ఉండిపోవాల్సి వస్తుంది.
టీఆర్ఎస్ కూ ఆనందమే….
రేవంత్ రెడ్డి కి పీసీసీ పగ్గాలు దక్కకుండా ఉంటే చాలని టీఆర్ఎస్ భావిస్తోంది. ఆయన చాలా దూకుడు కలిగిన నాయకుడు. రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేపడితే కాంగ్రెసు శ్రేణులన్నీ ఏకతాటిపైకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే కాంగ్రెసు పార్టీలో రేవంత్ కు ఆ రకమైన క్రేజ్ ఉంది. అతను అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాలని ప్రతి కార్యకర్త కోరుకుంటున్నారు. ప్రజల్లో పలుకుబడి లేని నాయకులు తమంతతాము వైదలగాల్సి ఉంటుంది. 2004కి ముందు కాంగ్రెసులో అనేక ముఠాలుండేవి. కానీ మాస్ ఇమేజ్ తో వై.ఎస్. పాదయాత్ర చేసిన తర్వాత మిగిలిన నాయకులందరూ నామ మాత్రులైపోయారు. పార్టీ అధికారంలోకి వచ్చింది. తెలంగాణలో రేవంత్ రెడ్డి పార్టీకి ఆ రకమైన పునర్వైభవం తేగలరనే నమ్మకం ఉంది. ఈ అంశమే టీఆర్ఎస్ ను భయపెడుతోంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావం సాకారం చేసిన పార్టీ కాంగ్రెసు. తమ కృషిని నాయకులు ప్రజల్లోకి తీసుకెళ్లి గెలుపు సాధించలేకపోయారు. టీఆర్ఎస్ మాత్రమే రాజకీయ ప్రయోజనం పొందగలిగింది. వచ్చే ఎన్నికల నాటికి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి పదేళ్లు అవుతుంది. ఎంతోకొంత ప్రజావ్యతిరేకత తప్పదు. కాంగ్రెసు పార్టీకి సింగిల్ లీడర్ గా మాస్ ఇమేజ్ తో రేవంత్ నిలిస్తే కేసీఆర్ కు కష్ట కాలమే. అందుకే రేవంత్ రెడ్డి పై ఎన్ పోర్స్ మెంట్ డైరెక్టరేట్ కేసు అధికార పార్టీ కి ఆనందం కలిగిస్తోంది.
ఉన్నత శిఖరాలపై ఉచ్చు…
ఉజ్యలమైన భవిష్యత్తు ఉన్న రేవంత్ రెడ్డి వ్యూహనైపుణ్యంలో దిట్ట. చంద్రబాబు నాయుడికి చేరువ కావడం ద్వారా పార్టీలో మిగిలిన నాయకులందర్నీ దాటుకుని పైకెదగాలని చేసిన ప్రయత్నంలో భాగమే ఓటుకు నోటు కేసు. నాయకుడి మనసు గెలుచుకోవడానికి ప్రజల్లో పని చేయాలి. పార్టీకి గెలుపు తెచ్చిపెట్టాలి. అడ్డగోలు వ్యవహారాల ద్వారా పని చేయాలనుకుంటే అడ్గంగా దొరికిపోక తప్పదు. ప్రత్యక్ష ప్రమేయం కనిపించని అగ్రనాయకులు హ్యాపీగా బయటపడిపోతుంటారు. వారి కోసం పని చేసిన వారే శిక్షను అనుభవించాల్సి వస్తుంది. తాజా కేసులోనూ చంద్రబాబు నాయుడికి ప్రమేయం లేదంటూ ఆయనను పక్కన పెట్టేశారు. ఆ పార్టీ కోసమే ఓటుకు నోటు వ్యవహారంలో నిండా మునిగిన రేవంత్ రెడ్డి మాత్రం ప్రదాన నిందితునిగా విచారణను ఎదుర్కొంటున్నారు. ఇది స్వయం క్రుతాపరాధం. ఆయనకు ఒక్కరికే పరిమితమైన విచిత్రమైన అంశమేమీ కాదు. జయలలిత, లాలూ ప్రసాధ్ యాదవ్ స్థాయి నాయకులే గత తప్పులకు పరిహారంగా జీవన చరమాంకంలో శిక్షలను అనుభవించాల్సి వచ్చింది. ఇంకా ఎదుగుదల దశలో ఉన్న రేవంత్ రెడ్డి పై కేసుల పడగ ఉచ్చ స్థాయికి చేరకుండానే నిలువరిస్తుందో, లేదో చూడాలి. విచారణలు సుదీర్ఘకాలం పట్టే వ్యవహారం. ప్రజలూ వాటిని పెద్దగా పట్టించుకోరు. పార్టీ ప్రయోజనాలే ముఖ్యమనుకుంటే రేవంత్ రెడ్డి కు అధిష్టానం పగ్గాలు ఇచ్చినా కార్యకర్తలు ఆహ్వానిస్తారు. అయితే కాంగ్రెసులోని ముఠా నేతలు ఎంతమేరకు రచ్చ చేసి అడ్డుకొంటారనేదే ఇప్పుడు 50 లక్షల రూపాయల ప్రశ్న.
-ఎడిటోరియల్ డెస్క్