ఈ .. సన్నాసులతో కష్టమొచ్చి పడిందే…?
పొట్టివాడిని పొడుగు వాడు కొడితే, పొడుగు వాడిని పోచమ్మ కొడుతుందని సామెత. కేసీఆర్ తరచూ ప్రవచించే సత్యమిది. ఇప్పుడు తనకే ఆ మాట ఎదురొస్తోంది. బీజేపీ పెరుగుతోంది. [more]
పొట్టివాడిని పొడుగు వాడు కొడితే, పొడుగు వాడిని పోచమ్మ కొడుతుందని సామెత. కేసీఆర్ తరచూ ప్రవచించే సత్యమిది. ఇప్పుడు తనకే ఆ మాట ఎదురొస్తోంది. బీజేపీ పెరుగుతోంది. [more]
పొట్టివాడిని పొడుగు వాడు కొడితే, పొడుగు వాడిని పోచమ్మ కొడుతుందని సామెత. కేసీఆర్ తరచూ ప్రవచించే సత్యమిది. ఇప్పుడు తనకే ఆ మాట ఎదురొస్తోంది. బీజేపీ పెరుగుతోంది. అటు కాంగ్రెసుకు తనను వ్యక్తిగతంగా ప్రత్యర్థిగా భావించే రేవంత్ రెడ్డి పీసీసీ పీఠం ఎక్కారు. కమలం పార్టీ ఎదగకుండా కాంగ్రెసు పెరగడం కేసీఆర్ కు కూడా ఇష్టమే. కానీ రేవంత్ సారథ్యంలో దీటుగా మారడం మాత్రం నచ్చే ప్రసక్తే లేదు. ఆ సంగతి పక్కన పెడితే… హుజూరాబాద్ ఉప ఎన్నిక కేసీఆర్ కు తక్షణ సమస్యగా కనిపిస్తోంది. హస్తం పార్టీ పుంజుకుంటుందా? దానివల్ల టీఆర్ఎస్ కు మేలు జరుగుతుందా? ఈటల రాజేందర్ ను పావుగా చేసుకుంటూ కమలం వికసిస్తుందా? అన్నది తేలాల్సి ఉంది. కాంగ్రెసులోని ముఠాలను, రాజకీయ అవకాశ వాదాన్ని ఆసరాగా చేసుకుని , ఆ పార్టీని అస్తవ్యస్తం చేసేశారు కేసీఆర్. దాని స్థానంలోకి వచ్చి కూర్చునేందుకు సిద్దమయ్యింది బీజేపీ. సైద్దాంతిక అజెండాలో కాంగ్రెసు కంటే కమలం నాలుగు ఆకులు ఎక్కువ చదివింది. స్వాభావికంగా బీజేపీ రాజకీయ వ్యవసాయానికి తెలంగాణ అనుకూలమైన ప్రాంతం. చారిత్రకంగా ఇక్కడ ఉన్న పరిస్థితులే అందుకు దోహదం చేస్తున్నాయి. నైజాం పాలనలో పీడనకు గురి అయిన పాత గాయాల మచ్చలు ఇంకా గోడలపై కనిపిస్తూనే ఉంటాయి. అందుకే బీజేపీ బలంగా కాలు మోపాలని భావిస్తోంది. ముస్లింలు 15 శాతం వరకూ ఉండటం, మరో అయిదు శాతం వరకూ క్రిస్టియన్ జనాభా ఉండటంతో వర్గ సమీకరణలో రాజకీయ శక్తిగా తనను తాను మోహరించుకునేందుకు బీజేపీకి వీలవుతోంది. లౌకిక పార్టీగా ముద్ర పడిన కాంగ్రెసు, అధికార టీఆర్ఎస్ కు దీటుగా నిలిచినప్పుడు కమల నాథులకు చాన్పు ఉండేది కాదు. కానీ క్రమేపీ కాంగ్రెసు హవా తగ్గుతుండటంతో కేసీఆర్ లో కలవరం మొదలైంది.
పోరాటం పోయె…
అంతర్గత కుమ్ములాటలు మినహా అధికారపార్టీపై కాంగ్రెసు పోరాటం సన్నగిల్లిపోయింది. నాగార్జున సాగర్ టీఆర్ఎస్ తో భవిష్యత్తు పోరుకు ఒక దిశ నిర్దేశిస్తుందని కార్యకర్తలు ఆశించారు. అంత పెద్ద నాయకుడు జానారెడ్డి బరిలో ఉన్నప్పటికీ మిగిలిన కాంగ్రెసు నాయకుల నుంచి పెద్దగా సహకారం దొరకలేదు. ఈ ఓటమి తర్వాత పార్టీ పూర్తిగా డీలా పడిపోయింది. దాదాపు చతికిల పడిపోయింది. రాష్ట్రంలో రాజకీయంగా ప్రాముఖ్యం ఉన్న పరిణామాల్లో బీజేపీ వర్సస్ టీఆర్ఎస్ అన్నట్లుగానే ప్రజలు చూస్తున్నారు. ఆ రకమైన దూకుడు మనస్తత్వాన్ని బీజేపీ నాయకత్వం కనబరుస్తోంది. కాంగ్రెసు పార్టీకి పైనుంచి సరైన గైడ్ లైన్స్ లేవు. నాయకులు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఏఐసీసీ అధినాయకత్వమే అయోమయంలో ఉంది. ఈ పరిణామాలను బీజేపీ చక్కగా సొమ్ము చేసుకుంటోంది. కాంగ్రెసులో చోటు చేసుకుంటున్న ప్రతి పరిణామమూ కమలం పార్టీకి కలిసి వస్తోంది. తాజాగా రేవంత్ నియామకం మార్పు తెస్తుందేమో కాలమే తేల్చాలి. లేదంటే సీనియర్, జూనియర్ వివాదంతో మరిన్ని గ్రూపులు ఏర్పడినా ఆశ్చర్యపోనవసరం లేదు.
భాజపా బలం…
బీజేపీ ఒక్కరోజులో తెలంగాణలో బలపడలేదు. టీఆర్ఎస్ ను , కాంగ్రెసును వ్యతిరేకించే శక్తులు తెలంగాణ లో ఎక్కువగానే ఉన్నాయి. ఒకనాడు కాంగ్రెసు, ప్రస్తుతం టీఆర్ఎస్ మైనారిటీలకు అనుకూలమైన విధానాలతో సంతృప్తీకరణ చర్యలతో ఉన్నాయని ఒక వర్గం ప్రజల విశ్వాసం. ఆయా వర్గాలు గతంలో తెలుగుదేశం పార్టీతో ఉంటుండేవి. ప్రస్తుతం తెలంగాణలో తెలుగుదేశం చాప చుట్టేసింది. ప్రత్యామ్నాయంగా బీజేపీని ఎంచుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. బీసీ సామాజిక వర్గాలు తమ రాజకీయ ఆశలు నెరవేర్చుకోవడానికి బీజేపీని ఒక వేదికగా వినియోగించుకునే వాతావరణం ఏర్పడుతోంది. వారి ఆలోచనలకు మతపరమైన అజెండా కూడా తోడుగా నిలుస్తోంది. మతము, కులము బలమైన రాజకీయ కాంబినేషన్ కు ఉపయోగపడతాయి. వాటినే అస్త్రాలుగా టీఆర్ఎస్ పై పోరాటం చేసేందుకు కమలం పార్టీ సిద్ధమవుతోంది.
స్వయంకృతాపరాధం…
కాంగ్రెసు పార్టీ లోపాలపై టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల తరచూ వ్యాఖ్యానాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతిగ్రామంలో కార్యకర్తలు, నాయకులు ఉన్న పార్టీ ఇలా డీలా పడిపోతోందేమిటన్న బాధ ఆయనను కూడా తొలిచి వేస్తోంది. ఈ కాంగ్రెసు సన్నాసులతో కష్టమొచ్చి పడిందే అంటూ కేబినెట్ సమావేశంలోనే వ్యాఖ్యానించారనేది సమాచారం. బీజేపీ కంటే కాంగ్రెసు పార్టీ ప్రత్యర్థిగా ఉంటే పోరాటం చేయడం సులభం. కానీ కాంగ్రెసు పార్టీ మూలాలు క్రమేపీ కరిగిపోతున్నాయి. దుబ్బాక, జీహెచ్ ఎంసీలో బీజేపీ హవా కొనసాగించడానికి హస్తం పార్టీ బలహీన పడటమే కారణం. బీజేపీ, కాంగ్రెసు రెండూ కూడా ప్రభావం చూపగల స్థాయిలో ఉంటే టీఆర్ఎస్ దే పైచేయి అవుతుంది. కానీ జాతీయ పార్టీలు రెండింటిలో ఒకటి నామమాత్రమైపోతే టీఆర్ఎస్ గట్టిపోటీని ఎదుర్కోవాల్సి వస్తోంది. పోరు ముఖాముఖిగా మారితే ప్రభుత్వ వ్యతిరేక ఓట్ల చీలిక తగ్గిపోతోంది. తాజాగా హుజూరాబాద్ విషయంలోనూ అదే పరిస్థితి ఏర్పడుతుందేమోనని కేసీఆర్ తల పట్టుకుంటున్నారు. ఈటలకు నియోజకవర్గంలో మంచి పట్టు ఉంది. జాతీయ పార్టీ అండ ఉంది. కాంగ్రెసు పార్టీ చేతులెత్తేస్తే టీఆర్ఎస్ వర్సస్ ఈటలగా వాతావరణం మారుతుంది. టీఆర్ఎస్ రాష్ట్ర స్థాయి నాయకులకు హుజూరాబాద్ పై పట్టు తక్కువ. అందువల్ల ఈటలకు అనుకూలంగా సమీకరణలు మారే చాన్పులు ఎక్కువ. అందుకే కాంగ్రెసు బలపడాలని కేసీఆర్ భావిస్తున్నారు. కానీ 2014లో తనకు ప్రత్యర్థిగా ఉన్న కాంగ్రెసును, టీడీపీని పూర్తిగా నిర్వీర్యం చేయాలని సంకల్పించి చాలావరకూ సక్సెస్ అయ్యారు కేసీఆర్. ఆ స్వయంక్రుతాపరాధమే ఇప్పుడు మరింత బలమైన ప్రత్యర్థిని తెచ్చి పెట్టింది.
-ఎడిటోరియల్ డెస్క్