పుతిన్ పంతం నెగ్గించుకున్నాడుగా?

రష్యా అధ్యక్షుడు పుతిన్ మరో పదహారేళ్ల పాటు అధ్యక్షుడిగా కొనసాగనున్నారు. ఈ మేరకు ఆయన పెట్టిన రాజ్యాంగ సవరణలకు ప్రజల ఆమోదం లభించడంతో పుతిన్ కు తిరుగులేకుండా [more]

Update: 2020-07-06 18:29 GMT

రష్యా అధ్యక్షుడు పుతిన్ మరో పదహారేళ్ల పాటు అధ్యక్షుడిగా కొనసాగనున్నారు. ఈ మేరకు ఆయన పెట్టిన రాజ్యాంగ సవరణలకు ప్రజల ఆమోదం లభించడంతో పుతిన్ కు తిరుగులేకుండా పోయింది. ఇప్పటికే ఇరవై ఏళ్ల నుంచి ఏదో ఒక పదవిలో కొనసాగుతున్న పుతిన్ మరో పదహారేళ్లు రాష్యా అధ్యక్షుడిగా ఉండనున్నారు. రాజ్యాంగ సవరణలపై వారం రోజుల పాటు ప్రజాభిప్రాయాన్ని సేకరించారు.

కరోనా సమయంలోనూ…..

కరోనా సమయంలోనూ రష్యాలో దాదాపు 60 శాతం మంది ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోవడం విశేషం. అయితే పుతిన్ కొత్తగా ప్రవేశ పెట్టిన రాజ్యాంగ సవరణకు దాదాపు 77 శాతం మంది ఓటింగ్ ద్వారా తమ అభిప్రాయాన్ని తెలిపినట్లు ఫలితాలు వెల్లడించాయి. దీంతో మరో పదహారేళ్ల పాటు పుతిన్ రష్యా అధ్యక్షుడిగా కొనసాగనున్నారు. ఆ దేశ పురోగతిని పుతిన్ నిర్దేశించనున్నారు. దీంతో సుదీర్ఘకాలం పాటు రష్యా అధ్యక్షుడిగా పుతిన్ రికార్డులకు ఎక్కనున్నారు. ఆయన పదవీకాలం 2036 వరకూ ఉండనుంది.

నియంతలా మారారంటూ….

అయితే తాజా రాజ్యాంగ సవరణలతో పుతిన్ నియంతలా మారారన్న వ్యాఖ్యలు కూడా విన్పిస్తున్నాయి. రష్యాలో అంతర్గత ప్రజాస్వామ్యానికి ఇక చెల్లుచీటీ ఇచ్చినట్లేనన్న కామెంట్స్ వినపడుతున్నాయి. నిజానికి పుతిన్ ఒక నిఘా విభాగం అధికారి. ఇప్పటికే ఆయన రెండుసార్లు అధ్యక్షుడిగా, రెండుసార్లు ప్రధానిగా పుతిన్ ఇప్పటికే పనిచేశారు. అధ్యక్షుడిగా ఆరేళ్లు, ప్రధానిగా నాలుగేళ్లు ఆయన వరసగా ఎన్నికవుతూ వచ్చారు. అంటే ఇరవై ఏళ్లకు పైగా రష్యాలో పుతిన్ అధ్యక్షుడిగా, ప్రధానిగా ఉన్నారు. తాజా రాజ్యాంగ సవరణలకు ప్రజామోదం లభించడంతో మరో 16 ఏళ్లు ఆయనే అధ్యక్షుడుగా ఉండనున్నారు.

పుతిన్ కు పట్టుండటంతో….

ఈ రాజ్యంగ సవరణకు పార్లమెంటు ఆమోదించినప్పుడే సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. రష్యాను గుప్పిట ఉంచుకునేందుకు పుతిన్ ఈ రాజ్యాంగ సవరణ తెచ్చారని మేధావులు సయితం అభిప్రాయపడ్డారు. కానీ పుతిన్ ఎవరినీ లెక్క చేయలేదు. రష్యా చట్టసభలైన డ్యూమా, ఫెడరేషన్ ఆఫ్ కౌన్సిల్ లో పుతిన్ కు పట్టు ఉన్న కారణంగానే రాజ్యాంగ సవరణను సులువుగా నెగ్గించుకోగలిగారు. రష్యాను గత రెండు దశాబ్దాలుగా పుతిన్ బలోపేతం చేసినప్పటికీ ఆయన శాశ్వత అధికారాన్ని కోరుకోవడం ప్రజాస్వామ్యానికి చేటు అని చెప్పక తప్పదు.

Tags:    

Similar News