సబ్బం కి ఆ పని అప్పగిస్తే…?

చివరాఖరి నిముషంలో భీమిలీ వంటి కంచుకోట నుంచి పోటీ చేసి ఓడిపోయిన మాజీ ఎంపీ సబ్బం హరి రాజకీయంగా చరమాంకంలో ఉన్నట్లే లెక్క. ఆయన మేయర్ గా, [more]

Update: 2019-08-02 13:30 GMT

చివరాఖరి నిముషంలో భీమిలీ వంటి కంచుకోట నుంచి పోటీ చేసి ఓడిపోయిన మాజీ ఎంపీ సబ్బం హరి రాజకీయంగా చరమాంకంలో ఉన్నట్లే లెక్క. ఆయన మేయర్ గా, ఎంపీగా గెలిచారు. ఎమ్మెల్యే మాత్రం కాలేకపోయారు. మంత్రిగా పనిచేయాలన్న కోరికతోనే ఆయన తాజా ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీకి దిగారు. అయితే సబ్బం హరి కోరుకున్న సీటు వేరు, చంద్రబాబు ఇచ్చినది వేరు. విశాఖ నార్త్ లో కాపురం ఉంటున్న సబ్బం హరి అక్కడే తాను పోటీ చేయాలనుకున్నారు. తన వెలమ సామాజిక వర్గం అధికంగా ఉండడంతో పాటు, అఫీషియల్ ఏరియాగా ఉన్న ఆ ప్రాంతం నుంచి గెలుపు సులువు అని అంచనా వేసుకున్నారు. ఇక బాబు భీమిలీ నుంచి పోటీ చేయమనగానే తన పుట్టినూరు అంటూ ప్లేట్ మార్చేసి సబ్బం హరి వెళ్ళి ప్రచారం చేశారు కానీ దాదాపుగా పది వేల ఓట్ల తేడాతో ఓటమిపాలు అయ్యారు. అయినా కూడా భీమిలీలో టీడీపీ టఫ్ ఫైట్ ఇచ్చింది. ఓ వైపు అవంతి శ్రీనివాసరావు వైసీపీ తరఫున బరిలో ఉన్నారు. ఆయన ఒకసారి అక్కడ నుంచే ఎమ్మెల్యేగా గెలిచిన పరిచయాలు, అనుభవం ఉన్నాయి. అదే సమయంలో వైసీపీ గాలి బలంగా వీచింది. ఇక సబ్బం హరి పూర్తిగా టీడీపీకి కొత్త. ఇంత జరిగినా కూడా టీడీపీ మంచి ఓట్లే తెచ్చుకుందంటే ఆ పార్టీకి భీమిలి కంచుకోట అనడంలో సందేహం లేదు.

కోఆర్డినేటర్ గా….

ఇక టీడీపీ అభ్యర్ధిగాఓటమి పాలు అయిన సబ్బం హరిని పార్టీ కోఆర్డినేటర్ గా నియమించారు. ఆయన ఈ మధ్యన నియోజకవర్గంలో జరిగిన పార్టీ కార్యక్రమంలో పాల్గొన్నారు. టీడీపీకి తిరుగులేదని, క్యాడర్ బాగా పనిచేయలని కూడా కోరారు. భీమిలీ చూస్తే జీవీఎంసీలో విలీనం అయింది. తొందరలో ఎన్నికలు రాబోతున్నాయి. మరి అక్కడ పార్టీని బతికించి కార్పొరేషన్లో గెలిపించే బాధ్యత సబ్బం హరి గట్టిగా తీసుకుంటారా అన్న డౌట్స్ తమ్ముళ్ళలో వస్తున్నాయి. సబ్బం హరి ఉండేది విశాఖలో. ఆయన ఎపుడో చిన్నపుడు భీమిలీలో ఉండేవారు. పాత పరిచయాలు పనికిరావని తాజా ఓటమి తేల్చిచెప్పింది. మరి సబ్బం హరిని కోఆర్డినేటర్ గా పెట్టడం అంటే ఆయన నాయకత్వంలోనే ముందుకు సాగాలని చెప్పడమే కదా అని తమ్ముళ్ళు మధన పడుతుననారు. ఓటమి తరువాత సబ్బం హరి పెద్దగా తిరిగింది, క్యాడర్ కి ధైర్యం చెప్పింది కూడా లేదు. ఈ టైంలో మంత్రిగా కూడా ఉన్న అవంతిని ఢీ కొట్టాలంటే సబ్బం హరి వల్ల సాధ్యమవుతుందా అని ప్రశ్నిస్తున్నారు.

గంటా సైతం అలా…

ఇక గత అయిదేళ్లూ భీమిలీ ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసిన గంటా శ్రీనివాసరావు సైతం ఇపుడు భీమిలీని పట్టించుకోవడంలేదు. దాంతో క్యాడర్ తమ బాధలను ఎవరికి చెప్పుకోవాలో తెలియక సతమతమవుతున్నారు. మరో వైపు అవంతి శ్రీనివాసరావు తనకున్న పాత పరిచయాలతో టీడీపీలోని నాయకులకు ఎర వేస్తున్నారు. కంచు కోటను బద్దలు కొట్టేలా ప్లాన్ వేస్తున్నారు. పార్టీలో చురుకుగా ఉండే ద్వితీయ శ్రేణి లీడర్లను ఫ్యాన్ నీడకు చేరుస్తున్నారు. జీవీఎంసీ ఎన్నికలే లక్ష్యంగా మంత్రి వేగంగా పావులు కదుపుతున్నారు. ఈ నేపధ్యంలో గట్టి నాయకత్వాన్ని భీమిలీకి ఇవ్వాలని తమ్ముళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఎమ్మెల్యే అభ్యర్ధిగా మొదట్లో సబ్బం హరిని వ్యతిరేకించిన వారు ఎన్నికలు కాబట్టి సర్దుకుపోయారు. ఇపుడు అదే సబ్బం హరితోనే కధ నడిపిస్తే మాత్రం జీవీఎంసీ ఎన్నికల్లో కూడా తేడా కొట్టేస్తుందని అంటున్నారు. అయితే సబ్బం హరికే లోకల్ బాడీ ఎన్నికల బాధ్యతలు అప్పగించాలన్నది పార్టీ నిర్ణయంగా ఉంది. ఆ తరువాతనే మార్పులు చేర్పులు ఏమైనా అంటున్నారు. సబ్బం హరికి మేయర్ గా పనిచేసిన అనుభవం ఉందని హై కమాండ్ నమ్ముతోంది. ఇక సబ్బం హరికూడా భీమిలీ తన సొంత సీటు అంటూ వచ్చే ఎన్నికల్లో పోటీకి టికెట్ ఇస్తారని ఆశపడుతున్నారు. ఏది ఏమైనా కంచుకోటలో తమ్ముళ్ళు మాత్రం అసంతృప్తిగానే ఉన్నారు.

Tags:    

Similar News