అక్కడ టీడీపీ హరీ హరీ…?

ఆయన కాంగ్రెస్ లో పుట్టిన నాయకుడు. ఒకనాడు చంద్రబాబుని పదునైన విమర్శలతో ఎదుర్కొన్న నాయకుడు. కాలం కలసిరాక కాంగ్రెస్ కూలిపోతే వైసీపీలో చోటు లేకపోతే టీడీపీలో చేరిన [more]

Update: 2020-12-17 14:30 GMT

ఆయన కాంగ్రెస్ లో పుట్టిన నాయకుడు. ఒకనాడు చంద్రబాబుని పదునైన విమర్శలతో ఎదుర్కొన్న నాయకుడు. కాలం కలసిరాక కాంగ్రెస్ కూలిపోతే వైసీపీలో చోటు లేకపోతే టీడీపీలో చేరిన ఆ నాయకుడే మాజీ ఎంపీ సబ్బం హరి. హరి ఇపుడు చంద్ర కీర్తనలతో అనుకూల మీడియాలో తరిస్తున్నారు. బాబు కూడా ఆయన్ని ప్రోత్సహిస్తున్నారు. గత ఎన్నికల్లో భీమిలీ నుంచి టీడీపీ తరఫున పోటీ చేసే ఛాన్స్ సబ్బం హరికి ఇచ్చారు. మంత్రి అవంతి శ్రీనివాస్ చేతిలో సబ్బం హరి పది వేల ఓట్ల తేడాతో ఓడిపొయారు.

ఆ ఊసే లేదుగా…?

నాటి నుంచి భీమిలీ ముఖం సబ్బం హరి చూడడంలేదని అక్కడి క్యాడర్ గగ్గోలు పెడుతోంది. ఇక భీమిలీ తన సొంత ప్రాంతమని సబ్బం హరి ఎలా చెప్పుకున్నా ఆయన ఎన్నో దశాబ్దాల క్రితమే దాన్ని వీడి వచ్చేశారు. ఆయన అసలైన చోటు ఏది అంటే విశాఖ ఉత్తర నియోజకవర్గం అని చెప్పాలి. ఇక సబ్బం హరి ఎపుడూ తన ఇల్లు దాటి వెళ్ళరు, అక్కడే తన అనుచరులతో పంచాయతీలు చేస్తూంటారని ప్రచారంలో ఉంది. ఆయన్ని భీమిలీ నుంచి ఎవరైనా కలవాలన్నా కూడా విశాఖ వెళ్లాల్సిందే. మరి ఆయన్నే భీమిలీ టీడీపీ ఇంచార్జిగా చంద్రబాబు ఎందుకు కొనసాగిస్తున్నారు అన్నది తమ్ముళ్ళ ఆవేదన.

మనసు ఓ చోట ….

ఇపుడు సబ్బం హరి ఏడు పదులు దాటిన సీనియర్ నేత. కానీ ఆయనకు మళ్లీ పోటీ చేయాలని ఉందిట. అయితే ఈసారి విశాఖ ఎంపీ సీటుకే ఆయన గురి పెడుతున్నారు. తనకు కచ్చితంగా విశాఖ ఎంపీ టికెట్ టీడీపీ ఇస్తుందని నమ్ముతున్నారు. ఒకవేళ ఏ కారణం చేతనైనా ఇవ్వకపోతే మాత్రం తానున్న విశాఖ ఉత్తరం శాసనసభ సీటు నుంచి పోటీ చేసే అవకాశం కల్పించాలని కోరుతున్నారని అంటున్నారు. మరి సబ్బం హరి మనసు ఈ వైపు ఉంటే ఆయన్ని భీమిలీ ఇంచార్జిని చేసి పార్టీని అక్కడ పడకేయించారు అని తమ్ముళ్ళే ఆరోపిస్తున్నారు. భీమిలీ ఒకనాడు టీడీపీకి కంచుకోట. ఇపుడు మంత్రి అవంతి శ్రీనివాస్ తన కంచుకోటగా మార్చుకుంటున్నారు. వైసీపీకి గట్టి సీటుగా కూడా తయారుచేస్తున్నారు.

అలా వ‌దిలేశారా …?

కచ్చితంగా గెలిచే సీటు భీమిలీని సబ్బం హరి వదిలేశారు. అలా వదిలేసి ఉత్తరాంధ్రాలో టీడీపీ పుంజుకుంటుంది అని అధినాయకత్వం ఎలా భావిస్తుంది అని అంతా అశ్చర్యపోతున్నారు. ముందు మార్పు అన్నది భీమిలీ నుంచి మొదలుపెట్టాలని, అలాగే పూర్తిగా ప్రక్షాళన చేయాలని కూడా కోరుతున్నారు. భీమిలీలో పెద్ద సంఖ్యలో కాపు సామాజికవర్గం ఉంది. అవంతి కానీ గంటా శ్రీనివాస్ కానీ వారి మద్దతుతోనే వరసగా ఎమ్మెల్యేలుగా గెలిచారు అంటున్నారు. ఇక రాజుల ప్రాబల్యం కూడా బాగా ఉన్న సీటు ఇది. ఈ రెండు బలమైన సామాజికవర్గాల నుంచి ఎవరో ఒక నేతకు ఇన్చార్జి గా బాధ్యతలు అప్పగిస్తే భీమిలీలో టీడీపీ బాగుపడుతుంది అంటున్నారు. మరి చంద్రబాబు ఆ దిశగా ఆలోచన చేస్తారా. లేక హరి కధలు వింటూ కాలక్షేపం చేస్తారా అని తమ్ముళ్ళే అడుగుతున్న సీన్ ఉందిపుడు.

Tags:    

Similar News