ఆ సంగతి తెలియడంతోనే పక్కన పెట్టారటగా?

ఆయన మంచి మాటకారి, పెద్దగా వ్యూహాలు తెలియకపోయినా రాజకీయం తెలిసినవాడు. అందుకే ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా కీలక పదవులు అందుకున్నారు. ఓ ప్రముఖ నాయకుడిగా గుర్తింపు [more]

Update: 2020-03-29 05:00 GMT

ఆయన మంచి మాటకారి, పెద్దగా వ్యూహాలు తెలియకపోయినా రాజకీయం తెలిసినవాడు. అందుకే ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా కీలక పదవులు అందుకున్నారు. ఓ ప్రముఖ నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయనే విశాఖ జిల్లాకు చెందిన మాజీ ఎంపీ సబ్బం హరి. గిట్టని వారు రాజకీయ పబ్బం గడుపుకునే హరి అంటారు. ఆయన మనుషులు దాన్ని తెలివైన ఎత్తుగడలుగా తిప్పు చదువుకుంటారు. ఇక కరోనా వైరస్ ఉన్నా, మరేదైన ప్రమాదం ఉన్నా కూడా జగన్ మీద ఠంచనుగా బాణాలు ఎక్కుపెట్టే వారిలో సబ్బం హరి ముందు వరసలో ఉంటారు. జగన్ కి ఒకనాడు అత్యంత సన్నిహితుడైన సబ్బం హరి ఇపుడు పరమ శత్రువుగా మారిపోయారు. దానికి ఇద్దరూ కారణమే. ఎందుకంటే ఇద్దరి మనస్తత్వాలు దాదాపుగా ఒక్కటే.

మరచిపోరుగా….

జగన్ తన శత్రువులను ఎపుడూ గుర్తుపెట్టుకుంటారు. తనకు వ్యక్తిగతంగా అన్యాయం చేస్తే ఆయన జీవితంలో క్షమించరు అన్న మాట కూడా ఉంది. అలాంటి వారిలో విశాఖ జిల్లా నుంచి కొణతాల రామకృష్ణ, సబ్బం హరి పేర్లు ఉంటాయి. జగన్ ఈ ఇద్దరినీ బాగా నమ్మారు. అయితే ఈ ఇద్దరూ జగన్ ని మోసం చేశారని పార్టీ నాయకులు అంటారు. పార్టీలో ఎంతో ఫ్రీ హ్యాండ్ ఇస్తే దాన్ని దుర్వినియోగం చేశారని కూడా చెబుతారు. ఫలితంగా కొణతాల, సబ్బం హరి జగన్ కి మళ్ళీ దగ్గర కాలేకపోయారని గుర్తు చేస్తారు. ఇక సబ్బం హరి విషయం తీసుకుంటే ఆయన కూడా అంత తొందరగా శత్రువుని మరచిపోరు. జగన్ తనను అవమానకరంగా పార్టీ నుంచి సస్పెండ్ చేశారన్నది సబ్బం హరి వాదన. నాటి నుంచి ఆయన జగన్ వ్యతిరేక ప్రచారం కొనసాగిస్తునే ఉన్నారు.

వ్యతిరేక జోస్యాలే…?

టీడీపీ అనుకూల మీడియా సబ్బం హరిని బాగా ఎంటర్ టైన్ చేస్తుంది. ఆ అవకాశాన్ని వాడుకుని సబ్బం హరి సైతం జగన్ మీద కావాల్సినంత బురద ఎప్పటికపుడు జల్లుతుంటారు. జగన్ నియంత అన్న మాట ఒక్క సబ్బం హరి మాత్రమే అనగలరేమో. తాను దగ్గరుండి జగన్ ని చూశానని, ఆయన ఎవరి మాటా వినరని, ఏపీని జగన్ సర్వనాశనం చేస్తున్నారని సబ్బం హరి చానళ్ళలో ఘాటు కామెంట్స్ చేస్తున్నారు. వాటిని ఎప్పటికపుడు వైసీపీ నేతలు ఖండిస్తున్నా సబ్బం హరి మాత్రం తన వ్యతిరేక వైఖరి అసలు మార్చుకోవడంలేదు. పైగా జగన్ అసలు అధికారంలోకి రారు అని చెప్పిన ఈ విశాఖ ఆక్టోపస్ సీఎం సీట్లో జగన్ ఉండడాన్ని తట్టుకోలేకపోతున్నారని అంటారు.

ఉగాండాతో పోలిక….

ఇక ఏపీని జగన్ ఉగాండా మాదిరిగా మార్చేశారని సబ్బం హరి తాజాగా చేసిన కామెంట్స్ వైసీపీ నేతలకు ఆగ్రహం పుట్టిస్తున్నాయి. ఓ వైపు కరోనా వైరస్ మీద ప్రపంచం మొత్తం పోరాడుతూంటే తీరిగ్గా కూర్చుని వ్యక్తిగత కక్షతో జగన్ మీద విమర్శలు చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. ఈ వేడిలో వైసీపీ నేతలు కొందరు సబ్బం హరి గురించి చెప్పిన మాటలు సంచలనం అవుతున్నాయి. జగన్ ఎంతో ఆదరించి హరికి పార్టీ అత్యున్నత విషయాలు చెవిన వేస్తే వాటిని అప్పట్లో టీడీపీకి చేరవేసిన కోవర్ట్ అని ఇపుడు అసలు నిజాలు బయటపెడుతున్నారు. ఈ కారణంగానే జగన్ సబ్బం హరిని పూర్తిగా దూరం పెట్టారని అంటున్నారు.

వదలని కిరికిరి ….

సబ్బం హరికి రాజకీయ బిక్ష పెట్టిన వైఎస్సార్ కుటుంబంపై ఇలా పెద్ద ఎత్తున విషం కక్కడం హరి ఇకనైనా మానుకోవాలని వైసీపీ నేతలు కోరుతున్నారు. అయినా సబ్బం హరి నోరు విప్పితే మొదటి పదమే జగన్. మరి ఆయన వైఖరి ఆయనదని వదిలేసినా టీడీపీ అనుకూల మీడియా దాన్నే పెద్దది చేసి చూపించడంతో వైసీపీ నేతలకు అసలు సమస్య వస్తోందిట. మొత్తానికి వైసీపీని సబ్బం హరి కిరికిరి వదలడంలేదులా ఉంది.

Tags:    

Similar News