వందమంది పెట్టు .. ఒక్క గళమేనా..?
సజ్జల రామకృష్ణా రెడ్డి వైసీపీ పార్టీకి, ప్రభుత్వానికి ఒన్ అండ్ ఓన్లీ వాయిస్ గా మారుతున్నారు. చాలామంది మాట్టాడుతున్నారు కదా? అని అనుమానం రావచ్చు. కానీ వాటికి [more]
సజ్జల రామకృష్ణా రెడ్డి వైసీపీ పార్టీకి, ప్రభుత్వానికి ఒన్ అండ్ ఓన్లీ వాయిస్ గా మారుతున్నారు. చాలామంది మాట్టాడుతున్నారు కదా? అని అనుమానం రావచ్చు. కానీ వాటికి [more]
సజ్జల రామకృష్ణా రెడ్డి వైసీపీ పార్టీకి, ప్రభుత్వానికి ఒన్ అండ్ ఓన్లీ వాయిస్ గా మారుతున్నారు. చాలామంది మాట్టాడుతున్నారు కదా? అని అనుమానం రావచ్చు. కానీ వాటికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధికారముద్రతో కూడిన సాధికారత మాత్రం లేదు. అందుకే మంత్రుల్లో కొందరు తాము మీడియాలో కనిపించడానికి సురక్షితమైన మార్గం ఎంచుకుంటున్నారు. ప్రతిపక్షాలపై తిట్ల పురాణం వినిపిస్తే పెద్దగా డేంజర్ ఉండదు. అధిష్ఠానానికి రుచిగా ఉంటుంది. కొంచెం పెద్ద తరహాలో వ్యవహరించే మంత్రులు మౌనాన్ని ఆశ్రయిస్తున్నారు. తమ శాఖలకు సంబంధించిన సమాచారం వెల్లడించడానికి కూడా మరికొందరు మంత్రులు సాహసించడం లేదు. పార్టీని నడిపేందుకు నియమించిన ముగ్గురిలో ఇద్దరి పవర్ ను అనధికారికంగా జగన్ కట్ చేసేశారు. అందుకే సజ్జల రామకృష్ణా రెడ్డి మాత్రమే ముఖ్యమంత్రి చల్లని చూపుల్లో ఉన్నారు. ప్రస్తుతం ఎటువంటి రాజకీయ అంశమైనా, అధికారిక సమాచారమైనా ఆయనే సమాచార మాధ్యమాలకు వెళ్లడిస్తున్నారు. ప్రభుత్వ, పార్టీ పరమైన కీలక ప్రకటనలనూ బహిరంగంగా చెబుతున్నారు. హిజ్ మాస్టర్స్ వాయిస్ గా పార్టీలో ప్రస్తుతం సజ్జల రామకృష్ణారెడ్డిని చెప్పుకుంటున్నారు.
ప్రవాసంలో బాబాయి….
తిరుమల తిరుపతి దేవస్థానాలకు రెండోసారి ఛైర్మన్ గా నియమితులైన వై.వీ.సుబ్బారెడ్డి ఇంతవరకూ బాధ్యతలు స్వీకరించలేదు. జూన్ నెలలో పదవీకాలం ముగిసింది. కొంత కాలం త్రిశంకు స్వర్గంలో ఉంచారు. జులై నెలలో ఏవో కార్పొరేషన్లలో భాగంగా టీటీడీ పదవినీ మరోసారి సుబ్బారెడ్డికి ధ్రువీకరించారు. అప్పటికే అసంతృప్తితో , అవమానంతో ఉన్న బాబాయి సుబ్బారెడ్డి ప్రవాసం చెక్కేశారు. పదవి ప్రకటించిన నాలుగు రోజుల తర్వాత బాద్యతలు స్వీకరించకుండా ఆయన అమెరికా వెళ్లిపోయారు. ఇప్పటికి మూడు వారాలు దాటినా అయిపూ అడ్రస్ లేరు. కార్యనిర్వహణాధికారే ప్రస్తుతానికి అధారిటీ ఛైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వంలోనూ, పార్టీలోనూ తన పలుకుబడి సన్నగిల్లిన విషయం వైవీ గ్రహించారు. అందుకే రాజ్యసభ సీటు కానీ, మంత్రివర్గంలో స్తానం కానీ చాలాకాలంగా ఆశిస్తూ వస్తున్నారు. ఆ ఆలోచనలు అన్నిటినీ తోసిపుచ్చారు ముఖ్యమంత్రి. కనీసం టీటీడీ ఛైర్మన్ పదవి కొనసాగింపుపై కూడా వెంటనే నిర్ణయం తీసుకోకుండా పెండింగులో పెట్టేశారు. నలుగురితో నారాయణ అన్నట్లుగా ద్వితీయ శ్రేణి నాయకుల పదవుల పందేరంతో కలిపి ప్రకటించారు. ఇదంతా చూసి, నొచ్చుకుని వైవీ విదేశీ యానం పెట్టుకున్నారనేది పార్టీ వర్గాల లోగుట్టు.
ఆయనతో అంతే సంగతులు..
ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ చార్జి విజయసాయి రెడ్డికి పార్టీలో చురుకుగా చక్రం తిప్పాలనే ఆలోచన ఉంది. కానీ ఆయన దేనిని పట్టుకున్నా కలిసి రావడం లేదు. దుందుడుకు వైఖరి, సరైన ప్రణాళిక లేకపోవడంతో విజయసాయి చేపట్టిన ప్రతి ప్రయత్నమూ పార్టీకి ఇబ్బందికరంగా మారుతోంది. మాన్సాస్ ట్రస్టు విషయంలో అశోక్ గజపతితో వివాదం వల్ల పార్టీకి కలిసి వచ్చింది లేదు. ఉత్తరాంధ్రలో కొంతమేరకు వ్యతిరేకత పెరిగింది. విశాఖ రాజధానిపై ఆయన చేసిన హడావిడి సానుకూల ఫలితాలను ఇవ్వలేదు. రఘురామ కృష్ణ రాజును దారికి తేవడంలో సున్నితంగా వ్యవహరించలేదు. ఫలితంగా రఘురామ ఏకు మేకు గా మారారు. కనీసం రఘురామపై లోక్ సభలో చర్యలు తీసుకునే విషయంలోనూ విజయసాయి విఫలమవుతున్నారు. స్పీకర్ పక్షపాతంగా ఉన్నారంటూ అనాలోచితంగా మాట్టాడి పార్టీని ఇరుకున పెట్టారు. దీనిపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఢిల్లీలోనూ విజయసాయికి గతంలో ఉన్న పలుకుబడి క్షీణించిపోయింది. పార్లమెంటరీ పార్టీ నేతగా రాష్ట్రానికి కొత్త ప్రాజెక్టులు, నిధులు రాబట్టడం వంటివి చేయలేకపోతున్నారు. కనీసం ప్రభుత్వం అప్పులు చేసుకోవడానికి ఆర్థిక శాఖ అనుమతులు కూడా సంపాదించలేకపోతున్నారు. దీంతో ముఖ్యమంత్రి వద్ద ఆయన పలుకుబడి తగ్గిపోయింది. ప్రత్యర్థి పార్టీలు, నాయకులపై విమర్శలు, ఆరోపణలు చేస్తున్నప్పటికీ వైసీపీ అధికారిక వాయిస్ గా విజయసాయిని బావించడం లేదు.
మాటలు రాని మంత్రులు…
ప్రభుత్వానికి ఎదురవుతున్న సమస్యలను ఎలా ఎదుర్కోవాలనే అంశంపై మంత్రులకు స్పష్టత లోపించింది. ఒకవైపు మీడియా, మరోవైపు ప్రతిపక్షాలు కలిసికట్టుగా సర్కారుపై దాడి చేస్తున్నాయి. తాజాగా ఉద్యోగ వర్గాలు సైతం సన్నగా గళం కలుపుతున్నాయి. గడచిన నాలుగైదు నెలలుగా వరసగా జీతాలు ఆలస్యం కావడం, అదనపు సదుపాయాలు, బిల్లులకు సంబంధించిన పెండింగు పెరిగిపోతోంది. దాంతో ఉద్యోగుల్లోనూ అసంతృప్తి మొదలైంది. ఆర్థిక పరిస్థితి, అప్పుల సంక్షోభంపై రోజువారీ ప్రసార మాధ్యమాలు తూర్పారబడుతున్నాయి. మంత్రులు సమష్టిగా ఈ ప్రచారంపై దాడి చేయాల్సి ఉంది. కానీ తమకు సంబంధించిన వ్యవహారం కాదన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఆర్థిక మంత్రి ఒకే ఒకసారి వివరణ ఇచ్చి మళ్లీ మాట్టాడటం మానేశారు. ఢిల్లీలో కేంద్ర ఆర్థిక శాఖకు వివరణలు పంపడంతోనే సరిపోతోంది. సజ్జల రామకృష్ణారెడ్డి ఒన్ మేన్ షో పట్ల సీనియర్ మంత్రుల్లోనూ అసంతృప్తి ఉన్నట్లు తెలుస్తోంది. రాజకీయాల్లో తలపండిన తమను కాదని సజ్జలకు పెద్దపీట వేయడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. కేవలం ప్రభుత్వ సలహాదారు పాత్రలో ఉంటూ సర్వం తానే అన్నట్లుగా వ్యవహరించడాన్ని ఆంతరంగికంగా తప్పుపడుతున్నారు. కానీ జగన్ తో సజ్జలకు ఉన్న సాన్నిహిత్యం కారణంగా ఎవరూ పైకి మాట్టాడలేకపోతున్నారు. లోలోన కుమిలిపోతున్నారు. ప్రభుత్వ సలహాదారు మంత్రుల హోదాను, స్థాయిని కించపరిచే విధంగా ప్రవర్తించకూడదు. ప్రొటోకాల్ రీత్యా కూడా సలహాదారు మంత్రులకు దిగువస్తాయిలోనే ఉంటారు. అయినా సజ్జల రామకృష్ణా రెడ్డి మాటలనే తాము ఫాలో కావాల్సి రావడం వారికి ఇబ్బందికరంగా మారింది.
-ఎడిటోరియల్ డెస్క్