క్యాపిటల్ ల్యాండ్ స్కామ్ వెనక సూత్రధారి ఈయనేనా?

నిజమే కాదనలేం. రాజధాని అమరావతి భూముల కుంభకోణం వెనక రిటైర్డ్ అధికారి సాంబశివరావు పాత్రను తోసిపుచ్చలేం. ఆయన వెనక ఉండి అంతా నడిపించారన్న వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల [more]

Update: 2021-07-05 06:30 GMT

నిజమే కాదనలేం. రాజధాని అమరావతి భూముల కుంభకోణం వెనక రిటైర్డ్ అధికారి సాంబశివరావు పాత్రను తోసిపుచ్చలేం. ఆయన వెనక ఉండి అంతా నడిపించారన్న వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆరోపణలు తోసిపుచ్చలేం. ఎందుకంటే దశాబ్దాల కాలాల నుంచి సాంబశివరావుకు, చంద్రబాబుకు మధ్య సంబంధాలు అలాంటివి. తెలుగుదేశం పార్టీ 2014 ఎన్నికల్లో విజయం సాధించిన వెంటనే సాంబశివరావు హైదరాబాద్ లోనే ఉండి రాజధాని ఏర్పాటుపై చంద్రబాబుతో చర్చించారు. రాజధాని ఏర్పాటు విషయంలో చంద్రబాబు తనకు అత్యంత సన్నిహితులతో సమావేశమయ్యారు. వారిలో సాంబశివరావు ఒకరు.

ఐఏఎస్ గా పనిచేసి….

సాంబశివరావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఐఏఎస్ అధికారిగా పనిచేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న 1999 నుంచి 2004 వరకూ ఆయన చక్రం తిప్పారు. ఐఏఎస్, ఐపీఎస్ ల బదిలీల విషయంలోనూ సాంబశివరావు ప్రమేయం ఎక్కువగా ఉండేదని అప్పట్లోనే ప్రచారం జరిగింది. దీంతో సీనియర్ ఐఏఎస్ అధికారులు సయితం సాంబశివరావును మచ్చిక చేసుకోవడం కోసం పడరాని పాట్లు పడేవారంటారు. అలాంటి సాంబశివరావు పదవి విరమణ చేసిన వెంటనే చంద్రబాబు తన హెరిటేజ్ కంపెనీలో డైరెక్టర్ గా నియమించారు. తర్వాత మేనేజింగ్ డైరెక్టర్ ను కూడా చేశారు. నారా వారి కుటుంబంతో సాంబశివరావుకు ప్రత్యేక అనుబంధం ఉంది.

హెరిటేజ్ లో కీలకంగా మారి….

హెరిటేజ్ కంపెనీ వృద్ది చెందడంలోనూ, దాని షేర్ల విక్రయంలోనూ ఈ మాస్టర్ మైండ్ ప్రముఖ పాత్ర పోషించారు. సాంబశివరావు అంటే చంద్రబాబుకు అంత నమ్మకం. అలాంటి సాంబశివరావు అమరావతి రాజధానిని ప్రకటించకముందే ఇక్కడ భూముల కొనుగోళ్లలో కీలక భూమిక పోషించారు. ఐఏఎస్ అధికారి కావడం, రెవెన్యూలో లొసుగులన్నీ తెలిసి ఉండటంతో ఆయనను నేరుగా రంగంలోకి చంద్రబాబు దించారన్నది వాస్తవం. ఆయనే దగ్గరుండి అప్పటి ఐఏఎస్ అధికారులు, రెవెన్యూ అధికారులను సమన్వయం చేసుకుంటూ, అప్పటి మంత్రి నారాయణను ముందు పెట్టి కథంతా నడిపించారన్న టాక్ ఉంది.

అందరినీ సమన్వయం చేసుకుంటూ….

రాజధాని ప్రాంతంలో టీడీపీ నేతలు భూములు కొనుగోలు చేయాలన్నా అప్పట్లో ముందు సాంబశివరావును సంప్రదించేవారంటారు. రెవెన్యూ రికార్డులన్నీ తాను స్వయంగా తెప్పించుకుని పరిశీలన చేసిన తర్వాతే భూములు కొనుగోలు చేశారంటారు. అమరావతి భూముల విషయంలో చంద్రబాబు సయితం సాంబశివరావు పైనే ఆధారపడ్డారు. అసైన్డ్ మెంట్ ల్యాండ్ లను తీసుకోవడం, ప్రత్యేక జీవోను రూపొందించడంలోనూ సాంబశివరావు కీలకంగా వ్యవహరించారంటారు. ఐఏఎస్ అధికారులు కోన శశిధర్, కాంతిలాల్ దండే సహకారంతో సాంబశివరావు ఈ వ్యవహారాలను నడిపినట్లు ఆరోపణలు ఉన్నాయి. వీటిని నిరూపించాల్సిన బాధ్యత మాత్రం సీఐడీదే.

Tags:    

Similar News