ఊచలు రమ్మంటున్నాయా?

వందేళ్లకు పైగా చరిత్రగల కాంగ్రెస్ పార్టీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. వరుస పరాజయాలతో పావు కుదేలయ్యింది. 2014, 2019 ఎన్నికల్లో కనీసం ప్రతిపక్ష హోదాకు సరిపడ లోక్ [more]

Update: 2019-09-12 16:30 GMT

వందేళ్లకు పైగా చరిత్రగల కాంగ్రెస్ పార్టీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. వరుస పరాజయాలతో పావు కుదేలయ్యింది. 2014, 2019 ఎన్నికల్లో కనీసం ప్రతిపక్ష హోదాకు సరిపడ లోక్ సభ స్థానాలు గెలవలేక చతికిల పడింది. కాంగ్రెస్ చరిత్రలో ఈ పరిస్థితి ఎదురవడం ఇదే తొలిసారి. దీనిని పక్కన పెడితే పార్టీ ఇటీవల కాలంలో వరుస కేసులను ఎదుర్కొంటుంది. వివిధ కేసుల్లో సీనియర్ నాయకులు అరెస్టవ్వడాన్ని పార్టీ జీర్ణించుకోలేకపోతోంది. కోర్టులు, కేసులు, అరెస్టులు, బెయిళ్లు, ఈడీ, సీబీఐ పిలుపులతో సతమతమవుతోంది. ఎప్పుడు ఏ నేతకు శ్రీ ముఖాలు వస్తాయో తెలియక ఆందోళన చెందుతోంది. వరుస అరెస్టులు పార్టీని నైతికంగా దెబ్బతీస్తున్నాయి. పార్టీకి చెందిన న్యాయనిపుణులు, కపిల్ సిబాల్, అభిషేక్ మను సంఘ్వి, వివేక్ ఠంకా, సల్మాన్ ఖుర్షీద్ వంటి వారు అరెస్టయిన పార్టీ ప్రముఖులకు బెయిళ్లు ఇప్పించేందుకు శక్తి వంచన లేకుండా నిరంతరం న్యాయ పోరాటం చేస్తున్నారు. వారి ప్రయత్నాలే అన్ని సందర్భాల్లో విజయవంతంకావడంలేదు.

చిద్దూ…డీకేలను….

సీనియర్ నేత పళనియప్పన్, చిదంబరం, మధ్యప్రదేశ్ ప్రముఖుడు కమలనాధ్ మేనల్లుడు రతున్ పూరీ, సోనియా కోటరీలోని ప్రముఖుడైన అహ్మద్ పటేల్ కుమారుడు ఫైజల్ పటేల్, కర్ణాటకకు చెందిన నేత డి.కె. శివకుమార్ కోర్టు చుట్టూ సిబిఐ, ఈడీ చుట్టూ తిరిగితూ సతమతమవుతున్నారు. స్వయ్యంగా పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, మజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, సీనియర్ నాయకుడు మోతీలాల్ ఓరా, సోనియా అల్లుడు రాబర్డ వాద్రా తదితరులు న్యాయపరంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ కేసుల నుంచి నాయకులు ఎలా బయటపడతారో అనేది ప్రశ్నార్థకంగా మారింది. అందరిలో కన్నా సీనియర్ నేత చిదంబరం పరిస్థితి దయనీయం. 2004 నుంచి 2014 వరకు పదేళ్ల పాటు కేంద్ర హోం, ఆర్థిక మంత్రిగా చక్రం తిప్పిన ఈ తమిళ నాయకుడు ఇప్పుడు తిహార్ జైల్లో తీరిగ్గా ఊచలు లెక్కపెడుతున్నారు. ఐఎన్ఎక్స్ మీడియా, ఎయిర్ సెల్ మాక్సిస్ కేసును ఎదుర్కొంటున్నారు.ఈ 75 సంవత్సరాల హార్వర్డ్ విద్యార్థి ఈ నెలలో పుట్టిన రోజును కూడా జైల్లోనే జరుపుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఒకప్పుడు ఆర్ధిక మంత్రిగా ఈడీని, హోమంత్రిగా సీబీఐని తన కనుసైగలతో శాసించిన పళనియప్పన్ చిదంబరానికి ఇప్పుడు ఆ పేర్లు వింటేనే వెన్నులో వణుకు పుడుతుంది. ఈ కేసుల్లో బెయిలు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు బయటపడతాడో తెలియని అయోమయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.

వారసులనూ వదలకుండా…..

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్ మేనల్లుడు రతుల్ పూరీకి చందిన రూ.254 కోట్ల ఆస్తులను ఐటీ శాఖ సీజ్ చేసింది. అక్రమంగా ఆస్తులను ఆర్జించాడన్నది ఆయనపై ఉన్న అభియోగం. కర్ణాటక రాష్ట్ర కాంగ్రెస్ లో నేత అయిన డికె శివకుమార్ ను అక్రమ ఆస్తుల కేసులో ఈడీ (ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్) అదుపులోకి తీసుకుంది. గత ఏడాది ఏర్పాటైన కాంగ్రెస్ – టీడీ (ఎస్) సంకీర్ణ ప్రభుత్వాన్ని కాపాడటంలో ఆయన పాత్ర కీలకం. గుజరాత్ కు చెందిన అహ్మద్ పటేల్ రెండేళ్ల క్రితం రాజకీయంగా ఎన్నికవడంలో కనకపుర కు చెందిన ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యే కీలకపాత్ర పోషించారు. గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బెంగళూరు రిసార్ట్స్ లో ఉంచి అహ్మద్ పటేల్ రాజ్యసభకు ఎన్నికయ్యేందుకు దోహదపడ్డారు. అక్రమాస్తుల కేసులో అరెస్టయిన ఈ కర్ణాటక మాజీ మంత్రి డికె శివకుమార్ ను ఈడీ ప్రత్యేక న్యాయ స్థానంలో హాజరుపరిచారు. ఆయనకు బెయిల్ కోసం కాంగ్రెస్ న్యాయనిపుణుడు అభిషేక్ మనుసంఘ్వి చేసిన ప్రయత్నాలు వృథా అయ్యాయి. ఈ నెల 13 వరకు ఆయనను ఈడీ కస్టడీలోనేఉంచాలని ప్రత్యేక న్యాయస్థానం న్యాయవాది అజయ్ కుమార్ ప్రకటించారు. శివకుమార్ పై తీవ్రమైన మనీ లాండరింగ్ ఆరోపణలు ఉన్నాయి.

ప్రముఖులందరిపైనా….

ఇక కాంగ్రెస్ ప్రముఖుడు సోనియా కోటరీలోని కీలకమైన అహ్మద్ పటేల్ కుమారుడు ఫైజల్ పటేల్ ను కూడా ఈడీ అదుపులోకి తీసుకుంది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ రాబర్డ్ వాద్రాను ఇంతకుముందు భోఫోర్స్ కుంభకోణానికి సంభందించి ఈడీ పలుమార్లు ప్రశ్నించింది. 2014 ఎన్నికల్లో వాద్రా భూముల కుంభకోణాన్ని మోదీ ఎన్నికల ప్రచార అస్త్రంగా మలుచుకున్నారు. తాజాగా హర్యానా మాజీ మంత్రి భూపేందర్ సింగ్ హుడా ఒత్తిడులను ఎదుర్కొంటున్నారు. భూములు కొన్న కారణంగా ఆయన పాత్రపై అనేక ఆరోపణలు వస్తున్నాయి. వీటి ఆధారంగా ఆయనను కూడా అరెస్టు చేసే అవకాశాలున్నాయి. దీంతో ఆయన కాంగ్రెస్ ను వీడే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. వచ్చే నెలలో జరగనున్న హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఆయన హస్తం పార్టీని వీడే అవకాశాలున్నాయి. గతంలో తృణముల్ కాంగ్రెస్ ఎంపీగా ఉన్న ముకుద్ రాయ్, కాంగ్రెస్ లో ఉన్న అసోం నాయకుడు హిమంత్ భిశ్వశర్మపై కేసులు నమోదయ్యాయి. తరువాత వారు బీజేపీలో చేరడంతో కేసులు అటకెక్కాయి. శర్మ ఇప్పుడు బీజేపీ ఆధ్వర్యంలో అసోం ప్రభుత్వంలో మంత్రి కావడం గమనార్హం. పార్టీ అధినేత సోనియా , రాహుల్, సీనియర్ నేతలు మోతీలాల్ఓరా, ఆస్కార్ ఫెర్నాండేజ్ వివిధ కేసులకు సంబంధించి ప్రస్తుతం బెయిల్ పై ఉన్నారు. నేషనల్ హరాల్డ్ పత్రికకు సంబంధించిన కేసులో సోనియా, రాహుల్ పై కేసులు నమోదయ్యాయి. వీరిపై చర్యలకు సంబంధించి ప్రభుత్వం మరింత ముందుకు వెళ్లే అవకాశం ఉంది. మొత్తానికి కాంగ్రెస్ ఒక రకమైన కలవరపాటుకు గురవుతోంది. ఎప్పుడు దుర్వార్త వినాల్సివస్తుందన్న ఆందోళనలో ఉంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News