సేనకు తెలియంది కాదు

మహారాష్ట్రలో ఏర్పాటయిన మహా వికాస్ అగాఢీ ప్రభుత్వం చిక్కుల్లో పడింది. రాష్ట్రానికి సంబంధించిన అంశాల్లో సఖ్యతగా ఉన్న కూటమిలోని పార్టీలు జాతీయ స్థాయి అంశాలపై మాత్రం డిఫర్ [more]

Update: 2019-12-21 17:30 GMT

మహారాష్ట్రలో ఏర్పాటయిన మహా వికాస్ అగాఢీ ప్రభుత్వం చిక్కుల్లో పడింది. రాష్ట్రానికి సంబంధించిన అంశాల్లో సఖ్యతగా ఉన్న కూటమిలోని పార్టీలు జాతీయ స్థాయి అంశాలపై మాత్రం డిఫర్ అవుతున్నాయి. కూటమిలో ముఖ్యమంత్రి బాధ్యతలను తీసుకున్న శివసేనకు ఈ పరిస్థిితి మరింత ఇబ్బందికరంగా మారింది. పౌరసత్వ సవరణ చట్ట అమలుకు శివసేన సుముఖంగా లేదు. కానీ కూటమిలో ఉన్న కాంగ్రెస్, ఎన్సీపీ చట్టాన్ని అమలు చేయకూడదంటున్నాయి.

హిందుత్వ నినాదంతో….

శివసేన తొలి నుంచి హిందుత్వ సిద్ధాంతాలకు అనుగుణంగా నడిచే పార్టీయే. ఆ పార్టీ ఆవిర్భవించింది మరాఠాల ప్రయోజనాల కోసమే అయినా తర్వాతి రోజుల్లో హిందుత్వ పార్టీగా మారిపోయింది. ఆర్ఎస్ఎస్ కూడా శివసేనను వెనకేసుకొచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి. శివసేన బీజేపీతో కలసి నడిచేందుకు చివరిక్షణం వరకూ ఆర్ఎస్ఎస్ నేతలు ఒప్పించేందుకు ప్రయత్నించారు. కానీ అధికారం వైపు మొగ్గు చూపిన శివసేన కాంగ్రెస్, ఎన్సీపీ వెంట నడిచింది.

చిచ్చు రేపినా…..

కానీ పౌరసత్వ సవరణ చట్ట బిల్లు ఇప్పుడు కూటమిలో చిచ్చు రేగేలా ఉంది. తాము పౌరసత్వ చట్ట సవరణకు వ్యతిరేకంగా ఆందోళన చేయబోమని శివసేన కూటమిలోకి కాంగ్రెస్, ఎన్సీపీలకు స్పష్టం చేసింది. తమ విధానాలకు వ్యతిరేకంగా పనిచేయబోమని తేల్చి చెప్పింది. దీంతో ఎన్సీపీ సంగతి ఎలా ఉన్నా కాంగ్రెస్ మాత్రం గుర్రుగా ఉంది. కూటమిలో పార్టీలు అన్నీ ఒక మాట మీద ఉండాలని కాంగ్రెస్ పట్టుబడుతోంది. ఒకవైపు ఈ చట్ట సవరణపై బీజేపీని విమర్శిస్తున్నా పూర్తి స్థాయిలో వ్యతిరేకతను శివసేన ప్రదర్శించలేకపోతోంది.

అవి తొందరపడవని….

అలాగే ఇటీవల సావర్కర్ పై రాహుల్ చేసిన వ్యాఖ్యలపై కూడా శివసేన మండిపడుతోంది. రాహుల్ గాంధీ తన వ్యాఖ్యలను ఇప్పటి వరకూ వెనక్కు తీసుకోలేదు. దీంతో పాటు శివసేన తమ ఓటు బ్యాంకును పదిలపర్చుకోవడానికి కొన్ని కీలక అంశాల్లో కఠినంగానే వ్యవహరించాలని నిర్ణయించింది. కాంగ్రెస్ అంత త్వరగా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదన్నది సేన విశ్వాసం. అదే జరిగితే బీజేపీకి లబ్ది చేకూరుతుందని కాంగ్రెస్, ఎన్సీపీలకు తెలుసు. అందుకే తాము అనుకున్నట్లుగానే ముందుకు వెళ్లాలని శివసేన నిర్ణయించింది. అంతే తప్ప కూటమిలోని పార్టీలకు తలొగ్గకూడదని భావిస్తోంది. మొత్తం మీద మహా అగాఢీలో పెద్ద అగాధం ఏర్పడినట్లేనన్నది విశ్లేషకుల అంచనా. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News