ఈయన వల్లనే ఎదగడం లేదా?

పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన చుట్టూ అంతా తిరిగారు. ఆయన వల్లనే విజయం సాధ్యమయిందని బహిరంగంగానే చెప్పారు. కానీ అధికారం కోల్పోగానే ఆయనే అందరికీ టార్గెట్ అయ్యారు. [more]

Update: 2021-02-23 18:29 GMT

పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన చుట్టూ అంతా తిరిగారు. ఆయన వల్లనే విజయం సాధ్యమయిందని బహిరంగంగానే చెప్పారు. కానీ అధికారం కోల్పోగానే ఆయనే అందరికీ టార్గెట్ అయ్యారు. ఆయనే కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రస్తుం కాంగ్రెస్ పార్టీలో సిద్ధరామయ్య వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఆయన వల్లనే పార్టీ రోజురోజుకూ దిగజారుతుందన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. ఈ మేరకు కొందరు కాంగ్రెస్ నేతలు హైకమాండ్ కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

మరోసారి సీఎంగా….

సిద్ధరామయ్య మళ్లీ మరోసారి ముఖ్యమంత్రి అవ్వాలని భావిస్తున్నారు. అందుకే ఆయన ఇప్పటి నుంచే పార్టీని తన గ్రిప్ లో ఉంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఉప ఎన్నికల్లో కూడా పార్టీ గెలవకపోవడానికి కారణం సిద్ధరామయ్య వ్యవహారశైలి అని పార్టీ నేతలే చెబుతున్నారు. కేవలం తన స్వార్థం కోసం సిద్దరామయ్య పార్టీని బలిచేస్తున్నారన్న అభిప్రాయం ఎక్కువమందిలో వినిపిస్తుంది. పీసీీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ ను ప్రతి అంశంలో సిద్ధరామయ్య సైడ్ లైన్ చేయాలని చూస్తున్నారు.

జేడీఎస్ తో విభేదాలు….

ఇక జనతాదళ్ ఎస్ కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్లిపోవడానికి కూడా సిద్ధరామయ్య కారణం. సిద్ధరామయ్య జనతాదళ్ ఎస్ నుంచి వచ్చిన నేత. ఆయనకు దేవెగౌడ కుటుంబంతో సత్సంబంధాలు లేవు. 14 నెలల పాటు రెండు పార్టీలు కలసి అధికారంలో ఉన్నా వారిని సిద్ధరాయమ్య కుదరుగా ఉండనివ్వలేదు. తన పదవిని కుమారస్వామి తన్నుకుపోయారన్న అభిప్రాయం ఆయనలో ఉండటమే అందుకు కారణం. చివరకు ఆయన వర్గ ఎమ్మెల్యేలే పార్టీని వీడటంతో ప్రభుత్వం కుప్పకూలిపోయింది.

నేతలతో విడిగా సమావేశాలు….

వచ్చే ఎన్నికలు తన నేతృత్వంలోనే జరగాలని సిద్ధరామయ్య భావిస్తున్నారు. ఆయన ఇప్టటి నుంచే వివిధ నియోజకవర్గాల నేతలతో విడిగా సమావేశం అవుతున్నట్లు తెలుస్తోంది. ఎక్కువ మంది అభ్యర్థులు తన వారు ఉంటే ముఖ్యమంత్రి పీఠం తనను వదలి వెళ్లదన్నది ఆయన ప్రగాఢ విశ్వాసం. ఇది పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ కు ఇబ్బందికరంగా మారింది. మొత్తం మీద సిద్ధరామయ్య పార్టీకి ఇబ్బంది కలిగించే విధంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు మాత్రం గుప్పు మంటున్నాయి.

Tags:    

Similar News