ఏపీ సంగతి సరే మీ సంగతేంటి?

ఒకప్పుడు అప్పు చేయడానికి ఎవరైనా వెనకాడేవారు. కాలక్రమంలో అప్పు చేయడం అనివార్యమైంది. అది కాస్తా ఫ్యాషనైంది. ఇప్పుడు అసలు అప్పు చేయని వ్యక్తులు, సంస్థలు, వ్యవస్థలు, ప్రభుత్వాలు [more]

Update: 2021-08-08 16:30 GMT

ఒకప్పుడు అప్పు చేయడానికి ఎవరైనా వెనకాడేవారు. కాలక్రమంలో అప్పు చేయడం అనివార్యమైంది. అది కాస్తా ఫ్యాషనైంది. ఇప్పుడు అసలు అప్పు చేయని వ్యక్తులు, సంస్థలు, వ్యవస్థలు, ప్రభుత్వాలు ఏమైనా ఉన్నాయా అన్న ప్రశ్నకు సమాధానం దొరకడం కష్టమే. అభివద్ధి, సంక్షేమ కార్యక్రమాల పేరుతో పలు రాష్ర్ట ప్రభుత్వాలు విచ్చలవిడిగా అప్పులు చేస్తున్నాయి. దీనికి సంబంధించి ఎఫ్ఆర్ బీఎం (ఫిస్కల్ రెస్పాన్స్ బిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్ మెంట్) పరిమితులను అతిక్రమించేందుకు కొన్ని రాష్ర్ట ప్రభుత్వాలు సిద్ధపడుతున్నాయి. ఎఫ్ ఆర్ బీ ఎం పరిమితిని పెంచమని కొన్ని రాష్ర్ట ప్రభుత్వాలు కేంద్రాన్ని అదేపనిగా కోరుతున్నాయి.

రాష్ట్రాలను నియంత్రించే…?

మరోపక్క రాష్రాల ఆర్థిక వ్యవహారాలను కొంతవరకు నియంత్రించే కేంద్ర ప్రభుత్వం పరిస్థితి సైతం అంత గొప్పగా లేదు. హస్తిన సర్కారు కూడా ఎడాపెడా అప్పులు చేస్తూ ప్రజల పైన భారం మోపడానికి వెనకాడటం లేదు. ప్రజల సంక్షేమం, అభివద్ధి కార్యక్రమాల కోసమే అప్పులు చేస్తున్నామని కేంద్ర ప్రభుత్వ పెద్దలు పేర్కొంటున్నారు. రాష్ర్ట ప్రభుత్వాల ఆర్థిక వ్యవహారాలను రాజ్యాంగపరంగా సంక్రమించిన కొన్ని పాక్షిక అధికారాలతో కేంద్రం కొంతవరకు నియంత్రించగలదు. కానీ కేంద్రమే ఎడాపెడా అప్పులు చేస్తుంటే ఏం చేయాలన్న ప్రశ్నకు సమాధానం దొరకదు. కేంద్ర ప్రభుత్వం అప్పు చూస్తే కళ్లు తిరగక మానవు. 2020 – 21 తాత్కాలిక లెక్కల ప్రకారం దేశ జీడీపీ (స్థూల జాతీయోత్పత్తి ) రూ.197 లక్షల కోట్లు కాగా, అప్పుల భారం రూ.119 లక్షల కోట్లు కావడం గమనార్హం.

ఖర్చులు, ఆదాయానికి….

జీడీపీలో కేంద్ర ప్రభుత్వ రుణ నిష్పత్తి 60.5 శాతం. ఏడాది కాలంలో కేంద్రం అప్పు 13.85 శాతం పెరిగిన తీరు చూస్తేఆందోళన కలగక మానదు. అంతకు ముందు ఏడాది జీడీపీలో రుణాల నిష్పత్తి 51.61 శాతం కాగా 2021-22లో 61.7 శాతానికి చేరింది. జీడీపీలో 3.5 శాతం విదేశీ రుణాలు కాగా, అంతర్గత రుణాలు 48.5 శాతం. ఇతర రుణాలు 8.5 శాతంగా ఉన్నాయి. 2019-2020లో విదేశీ అప్పుల శాతం 5 శాతం కాగా, 2020-21లో ఆరు శాతానికి పెరిగాయి. అంతర్గత రుణాలు 13.4 శాతం నుంచి 19.5 శాతానికి చేరాయి. ఆదాయానికి, ఖర్చుల మధ్య పొంతన లేకపోవడమే అప్పులకు కారణమని కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి ఆగస్టు మొదటివారంలో పార్లమెంటులో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా వెల్లడించారు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం అప్పులు అక్షరాలా కోటీ నాలుగు లక్షల 99వేల 460 కోట్లు. అదేవిధంగా 2020-21 ఆర్థిక సంవత్సరంలో అప్పులు కోటీ 19 లక్షల 53వేల 758 కోట్లకు చేరుకోవడం గమనార్హం.

ఏటా పెరగడమే…?

అంటే ఏటా అప్పుల భారం పెరగడం అనివార్యమవుతోంది. అంతే తప్ప దానిని తగ్గించడం లేదా కనీసం పెరగకుండా చూసుకోవాలన్న ధ్యాస కేంద్ర పాలకులకు కలగడం లేదు. ఏటా రూ.26,781 కోట్ల చొప్పున గత ఎనిమిదేళ్లుగా అప్పులు తీరుస్తోంది. చేస్తున్న అప్పులకు, చెల్లిస్తున్న రుణానికి పొంతన ఉండటం లేదు. జపాన్ సారథ్యంలోని ఆసియా అభివద్ధి బ్యాంకు (ఏడీబీ), బ్రిక్స్ దేశాల సారథ్యంలో చైనాలోని షాంఘై కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న న్యూ డెవలప్ మెంట్ (ఎన్ డీ బీ) తదితర బ్యాంకు, ఇతర బ్యాంకుల ద్వారా కేంద్ర ప్రభుత్వం అప్పులు పొందుతోంది . అభివద్ధి, సంక్షేమ కార్యక్రమాలే కాకుండా పాలకుల ఆడంబరాలకు పెద్దయెత్తున వ్యయమవుతోంది. ఆడంబరాలను తగ్గించుకుని, ఎన్నికల పథకాలను పక్కనపెడితే అప్పుల భారం తగ్గుతుంది. ఆ దిశగా పాలకులు అడుగులు వేస్తారా అన్నదే అసలు ప్రశ్న?

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News