ఎందుకంత రహస్యం…గుట్టు బయటపడుతుందనా?

కొన్నిసార్లు ప్రభుత్వాలు చాలా తెలివిగా వ్యవహరిస్తున్నామనుకుంటూ తప్పులో కాలేస్తుంటాయి. ప్రపంచమే సమాచార విశ్వంగా మారిపోతున్న రోజుల్లో రహస్యాలంటూ దాచడం కష్టమే. అందులోనూ ప్రజాధనంతో నడిచే ప్రభుత్వానికి లోగుట్టుగా [more]

Update: 2021-08-18 15:30 GMT

కొన్నిసార్లు ప్రభుత్వాలు చాలా తెలివిగా వ్యవహరిస్తున్నామనుకుంటూ తప్పులో కాలేస్తుంటాయి. ప్రపంచమే సమాచార విశ్వంగా మారిపోతున్న రోజుల్లో రహస్యాలంటూ దాచడం కష్టమే. అందులోనూ ప్రజాధనంతో నడిచే ప్రభుత్వానికి లోగుట్టుగా ఉంచుకోవాల్సిన అంశాలుండవు. ఏదైనా దేశ రహస్యాలు, ప్రముఖుల భద్రతకు సంబంధించిన అంశాల్లోనే గోప్యత పాటించాల్సి ఉంటుంది. కానీ ఏపీ ప్రభుత్వం మీడియా నుంచి, ప్రతిపక్షాల నుంచి ఎదురవుతున్న దాడిని తట్టుకోవడానికి అసంబద్ధమైన మార్గాన్ని ఎంచుకున్నట్లు కనిపిస్తోంది. ఇది ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసే ప్రమాదం ఉంది. పరిపాలనకు సంబంధించి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు మీడియా, పబ్లిక్ స్ర్కూటినిని ఎదుర్కోవాలి. విమర్శలు, వివాదాలు తలెత్తినప్పుడు దానికి తగిన వివరణ ఇవ్వాలి. అంతే తప్ప అసలు వాద ప్రతివాదనలు, విమర్శలే వద్దనుకుని జీఓలను బ్లాక్ లో ఉంచేస్తే , ప్రభుత్వ కార్యకలాపాలపై విపక్షాలు, ప్రసారమాధ్యమాలు మరింతగా నిఘా పెడతాయి.

అతి జాగ్రత్త…

ప్రభుత్వం జారీ చేసే ఉత్తర్వులను ఆన్ లైన్ లో పెట్టకూడదని ఆంధ్రప్రదేశ్ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమవుతోంది. ఇప్పటికే రాజకీయ పార్టీలు ఆక్షేపణ వ్యక్తం చేస్తున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి మొదలు పెడితే ఇప్పటికి 13 సంవత్సరాలుగా ఉత్తర్వులను ఆన్ లైన్ లో అందరికీ అందుబాటులో ఉంచుతున్నారు. దీనిపైన ప్రభుత్వాలు అనేక సందర్బాల్లో చిక్కులు ఎదుర్కోవాల్సి వచ్చింది. తాము అందిపుచ్చుకున్న సమాచారాన్ని చాలా వేగంగా మీడియా సంస్తలు విశ్లేషించి సర్కారుకు సవాల్ విసిరిన సందర్భాలూ ఉన్నాయి. అయినప్పటికీ జీఓలనే ఆన్ లైన్ లో ఉంచకూడదని ఎప్పుడూ నిర్ణయం తీసుకోలేదు. ప్రభుత్వాలు సున్నితంగా భావించిన వాటిని మాత్రం బ్లాక్ చేస్తూ వచ్చాయి.అవి కూడా ఏదోరకంగా బయటికి వచ్చేస్తుండేవి. ప్రభుత్వ తీరుపై మరింతగా విమర్శలు వచ్చేవి. తాజాగా ఏపీ ప్రభుత్వం అతిజాగ్రత్తకు పోతోంది. ఇది దీర్ఘకాలంలో ప్రభుత్వ పాలనపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. సమాచార హక్కు చట్టం వంటివి ప్రతి పనిలోనూ జవాబుదారీ తనం కావాలనే ఉద్దేశంతోనే వచ్చాయి. అటువంటిది ప్రజా ప్రభుత్వాలే వాటిని బ్లాక్ చేయడం అర్థరహితం.

కొత్త అనుమానాలు…

ప్రభుత్వానికి మీడియా, విపక్షాలు ఊపిరాడకుండా చేస్తున్నాయి. వాటిని చట్టబద్దంగానే ఎదుర్కోవాలి. తప్పులుంటే న్యాయస్థానాల్లో కేసులు వేసి ముప్పుతిప్పలు పెట్టవచ్చు. ప్రభుత్వం వద్ద అందుకు తగిన యంత్రాంగం ఉంటుంది. అంతే తప్ప డొంకతిరుగుడు మార్గాలను ఆశ్రయించడం శ్రేయస్కరం కాదు. ప్రభుత్వం ఆర్థికంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులు, నిధుల సమీకరణకు తీసుకుంటున్న నిర్ణయాలు, నిబంధనలను తోసిరాజంటూ జారీ చేస్తున్న ఉత్తర్వులు అన్నీ ఎప్పటికప్పుడు పబ్లిక్ డొమెయిన్ లోకి వచ్చేస్తున్నాయి. తీవ్రమైన విమర్శనాత్మక ధోరణిలోనే మీడియా వాటిని బయటపెడుతోంది. ప్రజాక్షేత్రంలో తిరుగులేని ఆధిక్యత ఉన్నప్పటికీ ప్రభుత్వం ఇరుకున పడుతోంది. నైతికంగా ప్రభుత్వానికి తలకొట్టేసినట్లవుతోంది. పైపెచ్చు న్యాయపరమైన వ్యాజ్యాలకూ ప్రభుత్వ ఉత్తర్వులు కారణమవుతున్నాయి. వీటన్నిటినీ ద్రుష్టిలో పెట్టుకుని ఉత్తర్వులను ఆన్ లైన్ రాకుండా చూడాలని బావిస్తున్నారు. అయితే కొండనాలుకకు మందేస్తే సామెత రీతిలో వికటించే అవకాశాలు ఉన్నాయి. పారదర్శకత లేని చోట్ల విభాగాధిపతులు, కార్యదర్శులు అక్రమాలకు తావిచ్చేందుకు వీలు ఉంటుంది. ఉద్యోగుల పదోన్నతులు , వ్యక్తిగత ప్రయోజనాలకు సంబంధించిన అంశాల్లోనూ అవకతవకలు చోటు చేసుకోవడానికి ఆస్కారం పెరుగుతుంది. మరిన్ని కొత్త అనుమానాలకు తావిచ్చినట్లవుతుంది.

నష్టం పూడ్చలేనిది…

ప్రస్తుతం పాలనలో ఉన్న వైసీపీ సర్కారుతో పోల్చుకుంటే 2009 నుంచి అధికారంలో ఉన్న పార్టీలు బలహీనమైనవనే చెప్పాలి. రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఎవరికీ ఇంతటి శాసనసభా బలం లేదు. అయినప్పటికీ పారదర్శకత విషయంలోసర్కారు ఎందుకు వెనకంజ వేస్తుందో చెప్పాలని ప్రతిపక్సాలు డిమాండ్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఆర్థిక వనరుల వ్యవహారాల్లో ప్రభుత్వ నిర్ణయాలు బయటికి రాకూడదనే ఉద్దేశమే కనిపిస్తోంది. దీనివల్ల మరింత ఎక్కువగా ప్రచారం జరుగుతుంది. మీడియా, ప్రతిపక్సాలకు ఆయాశాఖల్లోని విజిల్ బ్లోయర్స్ నుంచి ఎప్పటికప్పుడు సమాచారం అందుతూనే ఉంది. ప్రభుత్వ వైఖరితో మీడియాకే ఎక్కువ ప్రయోజనం. పరిశోధించి రాసినట్లుగా ప్రతి విషయాన్ని వండి వార్చి పతాక శీర్షికల్లో హైలైట్ చేసే ప్రమాదం ఉంది. ప్రభుత్వం ఖండించలేక, సర్దుబాటు చేసుకోలేక రెంటికీ చెడినట్లవుతుంది. లోగుట్టు పెరుమాళ్లకెరుక. జీఓల వంటి పబ్లిక్ డాక్యుమెంట్లను దాయడంలోని ఆంతర్యం విప్పి చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంటుంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News