స్వర రాగ గంగా ప్రవాహం…
నింగిని తాకిన గానగంధర్వుని ముందు నివాళి అన్నపదం చిన్నబోతుంది. ప్రతి గుండెలో కొలువైన పాటకు నీరాజనం నిత్యం హారతి పడుతూనే ఉంటుంది. శిశుర్వేత్తి, పశుర్వేత్తి, గాన రసం [more]
నింగిని తాకిన గానగంధర్వుని ముందు నివాళి అన్నపదం చిన్నబోతుంది. ప్రతి గుండెలో కొలువైన పాటకు నీరాజనం నిత్యం హారతి పడుతూనే ఉంటుంది. శిశుర్వేత్తి, పశుర్వేత్తి, గాన రసం [more]
నింగిని తాకిన గానగంధర్వుని ముందు నివాళి అన్నపదం చిన్నబోతుంది. ప్రతి గుండెలో కొలువైన పాటకు నీరాజనం నిత్యం హారతి పడుతూనే ఉంటుంది. శిశుర్వేత్తి, పశుర్వేత్తి, గాన రసం ఫణి అంటూ పశుపక్ష్యాదులకు సైతం రసామృతం పంచిన పాటల ధునికి ప్రణామాలర్పిస్తోంది భారతావని. సామవేద సారమైన సంగీత స్వరాలకు ప్రతిరూపు కట్టినట్లు కనిపిస్తాడు, అనిపిస్తాడు , వినిపిస్తాడు బాలు. ఆబాల గోపాలానికి అత్యంత ఇష్టమైన గాయకుడు. అసేతు హిమాచలాన్ని తన గాత్ర మాధుర్యంతో పులకరింప చేసిన శ్రీపతి పండితారాధ్యుల బాల సుబ్రహ్మణ్యం. వేణువై వచ్చి భువనానికి, గానమై తరలిపోయాడు గగనానికి అని సరిపెట్టుకునేంత సింపుల్ కాదు, ఆయన చరిత. అందుకే నేడు పండిత, పామరులన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరి కన్ను చెమరుస్తోంది. గుండె తడితో చమరుస్తోంది.
కృషితో నాస్తి దుర్భిక్షం…
బాల సుబ్రహ్మణ్యానికి చలనచిత్ర జగత్తులో అవకాశాలు ఊరకనే ఒడిలో వచ్చి వాలలేదు. ఘంటసాల వంటి అనితర సాధ్యుల సమయంలో తానేమిటో నిరూపించుకోవాల్సి వచ్చింది. లేలేత గొంతును సాధనతో రసరమ్యంగా మలచుకోవాల్సి వచ్చింది. వచ్చిన ప్రతి అవకాశాన్ని ఒడిసిపట్టుకోవడమే కాదు, తనదైన ముద్ర వేయడంలోనే బాలు చలనచిత్ర పరిశ్రమకు కావాల్సిన వాడయ్యాడు. మ్యూజిక్ తో మ్యాజిక్ చేయడం అతనితోనే మొదలైందని చెప్పవచ్చు. అంతవరకూ సందర్భాన్ని బట్టి గాయకులు గొంతులో లాలిత్యాన్ని, విరహాన్ని, విషాదాన్ని నింపుకునే వారు. బాలు ఈ విషయంలో స్పెషల్. నటించే నాయకుడిని, క్యారెక్టర్ ను అనుసరించి తన గొంతును సవరించాడు. మిమిక్రీని మిళితం చేశాడు. తన గొంతు మహత్తుతో చిత్ర జగత్తుపై మాయాజాలాన్ని గుమ్మరించాడు. అందుకే అగ్రనాయకులందరికీ వేరే చాయిస్ లేని సింగిల్ వాయిస్ గా నిలిచాడు.
వైవిధ్యమే బాణీగా….
ప్రతి పాటలోనూ వైవిధ్యాన్ని చూపాలని పరితపించడం ఎస్పీబాలు ప్రత్యేకత. యాభై అయిదు సంవత్సరాల సుదీర్ఘ పాటల ప్రస్థానంలో మూడుతరాల గాయకులు తన కళ్లముందే కనుమరుగవుతున్నా బాలు వారందరికంటే అగ్రతముడిగా నిలవగలిగాడు. చిన్నారి పొన్నారి కిట్టయ్య నిన్నెవరు కొట్టారమ్మా అంటూ చిన్న చిన్న అలతి పదాలతో అలరించినా, అంతర్యామి అలసితి సొలసితి అంటూ ఆధ్యాత్మికతను చిలకరించినా అది అతనికే చెల్లింది. ప్రణయము, విరహము, చిలిపిదనము, శ్రుంగారము, రౌద్రము, ఏ భావనకు అయినా తన్మయత్వం చేకూర్చి శ్రోతలను తాదాత్మ్యం చెందించే గళ వైవిధ్యమే బాలును చిరయశస్విగా నిలిపింది. కొమ్మ కొమ్మకో సన్నాయి ఉంటుందేమో కానీ కోటి రాగాలకు అతను శాశ్వత చిరునామాగా మిగిలాడు. నిజానికి శాస్త్రీయ సంగీతంలో పెద్దగా ప్రావీణ్యం లేని బాలు ‘శంకరా నాద శరీర పరా, వేద విహారా హరా ’ అంటూ నటరాజుకు స్వరార్చన చేసిన తీరు తరతరాలు నెమరువేసుకునే గురుతు.
పల్లవించగా…
దేశంలో అగ్రశ్రేణి గాయకునిగా స్థానం సంపాదించినా ఎస్పీ కేవలం సినిమాపాటలకు , స్టూడియోలకే పరిమితం కాలేదు. ప్రజాబాహుళ్యంలో కి పాట మరింతగా చొచ్చుకుపోవడానికి వేలకు వేలు కచేరీలు నిర్వహించాడు. ప్రజలకు ప్రత్యక్ష అనుభూతులను అందించాడు. అందుకే ఇతర గాయకులెవరికీ లభించనంతటి కీర్తి ప్రతిష్ఠలు సొంతమయ్యాయి. బాలు గానాన్ని నేరుగా విని తరించిన అభిమానులు కోట్లమంది తెలుగు గడ్డపై కనిపిస్తారు. వారంతా తమ ఆత్మబంధువుగా బాలుతో అనుబంధాన్ని పెనవేసుకుంటారు. గాయకుడిగా, సంగీత దర్శకునిగా, నటునిగా, అభిరుచి గల నిర్మాతగా బహుముఖ ప్రజ్ణాశాలి. భాషపై మక్కువ, సంగీత సాగరపు లోతులను మధించాలన్న అన్వేషణ ఆయన జీవన ప్రస్థానాన్ని నిర్దేశించాయి. ఎన్నడూ తరగని ఉత్సాహం తన సొంతం. 16 భాషల్లో 40వేల పాటలు , అవార్డులు, రివార్డులు ఇవన్నీ ఒక ఎత్తు.
కొత్త తరం గాయకులను…..
కొత్త తరం గాయకులను శోధించే పాడుతా తీయగా, పాడాలని ఉంది వంటి కార్యక్రమాలు మరొక ఎత్తు. ఆయా వేదికల నుంచి బాలు నిర్వహించిన పాత్ర సమున్నత శిఖరాలను అధిరోహింప చేసింది. తద్వారా మట్టిలో మాణిక్యాలను వెలికితీసి ఎందరెందరినో చలనచిత్ర జగత్తుకు కానుకగా సమర్పించారు. తన బాధ్యతను నిర్వర్తించారు. పాటలో , మాటలో మాధుర్య స్వరం చిలకరించే బాలు కీర్తి నిరంతరం. తరం తరం.. స్వరం మూగబోయింది.. సంగీత ప్రపంచం నిశ్శబ్దమైపోయింది అంటూ సంప్రదాయ పదాలలో ఒదిగిపోయేంత గళం కాదాయనది. నూటికో కోటికో ఒక్కటై ప్రకాశించే పాటల జాబిలి, ప్రజలను ప్రతి సందర్భంలోనూ ఆనందోత్సాహాల మధ్య ఊరేగించే స్వరాల పల్లకి, ప్రతినిత్యం పలకరించే గాన భానూదయం, సేదతీర్చే చల్లని వెన్నెల… అలుపెరుగని గంగా ప్రవాహం.. అలలు అలలుగా ఎగసి పడే ప్రతి కెరటంలోనూ వినిపించే సంగీత ఝరి. అది సముజ్జ్వలం, శాశ్వతం.. సంగీతమంతటి సత్యం, నిత్యం.
-ఎడిటోరియల్ డెస్క్