బీటెక్ రవి ఆ నియోజకవర్గమే కావాలంటున్నాడా?
ఏపీలో వరుసగా స్థానిక సంస్థల ఎన్నికల హడావిడితో అన్ని నియోజకవర్గాల్లోనూ ఎన్నికల వేడి రాజుకుంది. ఎక్కడిక్కడ నేతలు బయటకు వచ్చి అధికార పార్టీని ధీటుగా ఎదుర్కొనే అంశంపై [more]
ఏపీలో వరుసగా స్థానిక సంస్థల ఎన్నికల హడావిడితో అన్ని నియోజకవర్గాల్లోనూ ఎన్నికల వేడి రాజుకుంది. ఎక్కడిక్కడ నేతలు బయటకు వచ్చి అధికార పార్టీని ధీటుగా ఎదుర్కొనే అంశంపై [more]
ఏపీలో వరుసగా స్థానిక సంస్థల ఎన్నికల హడావిడితో అన్ని నియోజకవర్గాల్లోనూ ఎన్నికల వేడి రాజుకుంది. ఎక్కడిక్కడ నేతలు బయటకు వచ్చి అధికార పార్టీని ధీటుగా ఎదుర్కొనే అంశంపై వ్యూహాలు రచిస్తున్నారు. అయితే సీఎం జగన్ సొంత జిల్లా కడపలో చాలా నియోజకవర్గాల్లో టీడీపీ సౌండ్ వినిపించడం లేదు. ఈ లిస్టులోనే జమ్మలమడుగు నియోజకవర్గం కూడా ఉంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి 2004 వరకు జమ్మలమడుగు నియోజకవర్గం టిడిపికి కంచుకోటగా ఉండేది. పొన్నపురెడ్డి శివారెడ్డి తర్వాత ఆయన రాజకీయ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన ఆయన అన్న కుమారుడు మాజీమంత్రి పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి నియోజకవర్గంలో తిరుగులేని హీరో అయ్యారు. తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు వరుసగా విజయాలు సాధించిన ఆయన జమ్మలమడుగును తనకు కంచుకోటగా మార్చుకున్నారు. రెండు సార్లు రామసుబ్బారెడ్డి మంత్రి అయ్యారు.
నాలుగు ఎన్నికల్లో…..
2004లో నాటి ఉమ్మడి రాష్ట్రంలో బలంగా వీచిన వైఎస్ ప్రభంజనంలో రామసుబ్బారెడ్డి జమ్మలమడుగులో ఓడిపోయారు. అప్పటి నుంచి ఆయన రాజకీయ రణక్షేత్రంలో వెనకబడి పోయారు. 2004 – 2009 – 2014 – 2019 ఎన్నికల్లో వరుస ఓటములతో ఆయన డీలా పడ్డారు. 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి ముచ్చటగా మూడోసారి గెలిచిన ఆదినారాయణ రెడ్డి 2016లో టిడిపిలో చేరి మంత్రి పదవి దక్కించుకున్నారు. చంద్రబాబు రామ సుబ్బారెడ్డిని బుజ్జగించేందుకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ చేసి విప్ పదవి కట్టబెట్టారు. గత ఎన్నికల్లో ఇద్దరు నేతలు జమ్మలమడుగు సీటు కోసం పోటీ పడడంతో మధ్యేమార్గంగా ఆదినారాయణ రెడ్డిని కడప ఎంపీగా… రామసుబ్బారెడ్డిని జమ్మలమడుగు ఎమ్మెల్యేగా పోటీ చేయిస్తే.. ఇద్దరు చిత్తు చిత్తుగా ఓడిపోయారు.
ఓటమి అనంతరం….
ఎన్నికల్లో ఓటమి అనంతరం ఆదినారాయణ రెడ్డి బిజెపి గూటికి చేరితే… రామసుబ్బారెడ్డి వైసిపి తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ఇప్పుడు జమ్మలమడుగు టిడిపి ఎవరూ లేని అనాధగా మిగిలిపోయింది. గత ఎన్నికల్లో ఆది, రామసుబ్బారెడ్డి కలిస్తేనే ఇక్కడ వైసీపీ అభ్యర్థి సుధీర్ రెడ్డికి ఏకంగా 53 వేల ఓట్ల మెజార్టీ వచ్చింది. ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు ఇంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. చంద్రబాబు సైతం ఇక్కడ ఓ ఇన్‌చార్జ్‌ను పెడదామన్న స్పృహలో ఉన్నట్టే లేరు.
బీటెక్ రవిని ఇన్ ఛార్జిగా నియమించాలని….
ఇక ఆది సోదరుడు శివనాథ్ రెడ్డి కూడా వైసీపీ వైపు చూస్తున్నారు. ఆది, రామసుబ్బారెడ్డి వర్గీయులు వారితో పాటు పార్టీ కండువాలు మార్చేశారు. అయితే ఎప్పటి నుంచో టీడీపీ హార్డ్‌కోర్ అభిమానులుగా ఉన్నవారు మాత్రం దయనీయంగా మారింది. కనీసం వారు పోటీ చేద్దామనుకుంటున్నా.. సపోర్ట్ చేసే వాళ్లే లేక ఈ ఫ్యాక్షన్ నియోజకవర్గంలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవించాల్సిన పరిస్థితి వచ్చేసింది. మరోవైపు టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవిని జమ్మలమడుగు ఇన్‌చార్జ్‌ను చేయాలన్న డిమాండ్లు కూడా స్థానికంగా వినిపిస్తున్నాయి. బీటెక్ రవి కూడా పులివెందుల కంటే జమ్మలమడుగే బెటర్ అని భావిస్తున్నారు. మరి చంద్రబాబు ఇక్కడ ఎప్పటికీ నాయకుడిని నియమిస్తారో ? చూడాలి.