రేవంత్ కు రాజయోగమేనా..?
రాజకీయాల్లో పాత దేవుళ్లకు ప్రత్యామ్నాయంగా కొత్త దేవుళ్లు పుట్టుకొస్తూనే ఉంటారు. రెడీగా కూడా కాచుకుని కూర్చుంటారు. మీరు కాదంటే.. మేం.. మీ తర్వాత మేం! అంటూ.. నాయకులు [more]
రాజకీయాల్లో పాత దేవుళ్లకు ప్రత్యామ్నాయంగా కొత్త దేవుళ్లు పుట్టుకొస్తూనే ఉంటారు. రెడీగా కూడా కాచుకుని కూర్చుంటారు. మీరు కాదంటే.. మేం.. మీ తర్వాత మేం! అంటూ.. నాయకులు [more]
రాజకీయాల్లో పాత దేవుళ్లకు ప్రత్యామ్నాయంగా కొత్త దేవుళ్లు పుట్టుకొస్తూనే ఉంటారు. రెడీగా కూడా కాచుకుని కూర్చుంటారు. మీరు కాదంటే.. మేం.. మీ తర్వాత మేం! అంటూ.. నాయకులు కీలక పదవుల కోసం ఎదురు చూస్తూనే ఉంటారు. ముఖ్యంగా అతిపెద్ద కాంగ్రెస్ పార్టీలో ఎన్ని పదవులు అనుభవించిన నేతైనా సరే..ఆ ఒక్క పదవి ఇచ్చుంటే.. వచ్చుంటే.. ఎంత బాగుండు.. పార్టీని ప్రక్షాళనచేసి పారేద్దును!! అనే డైలాగులు చాలా మంది నుంచి విన్నాం. కొన్ని దశాబ్దాలుగా పార్టీనే నమ్ముకుని ముందుకు సాగుతున్న నాయకులు ఇలా పదవులు కోరుకోవడంలో తప్పులేదు. అయితే, వారి వారి సామర్ధ్యాలను అంచనా వేసుకుంటే.. ఆయా పదవులకు వారు సరితూగుతారా? లేదా? అనేది తేలుతుంది.
ఉత్తమ్ ఫెయిలవ్వడంతో….
విషయంలోకి వెళ్తే.. తెలంగాణలో కాంగ్రెస్ అధ్యక్ష పగ్గాలను కోరుకుంటున్న నాయకులు చాలా మందే ఉన్నారు. రాష్ట్ర విభజన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ చీఫ్‌లను నియమించారు. ఈ క్రమంలో నే తెలంగాణ గతంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో కెప్టెన్‌గా వ్యవహరించి, తర్వాత కాలంలో కాంగ్రెస్‌లో చేరిన, కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్‌కు అత్యంత సన్నిహితుడైన ఉత్తమ్ కుమార్ రెడ్డిని నియమించారు. కొన్ని దశాబ్దాల నాటి తెలంగాణ కల నెరవేర్చాం కాబట్టి.. ఉత్తమ్.. పార్టీని అధికారంలోకి తెస్తారని అందరూ అనుకున్నారు. అయితే, 2014లో కాదుకదా.. ఇటీవల జరిగిన 2018 డిసెంబరు నాటి ఎన్నికల్లోనూ తెలంగాణలో కాంగ్రెస్‌ను ముందుకు నడిపించలేక పోయారు.
సంఖ్యాబలం కూడా తగ్గి….
అంతేకాదు, 2014తో పోల్చుకుంటే.. అసెంబ్లీలో కాంగ్రెస్ సంఖ్యా బలం భారీగా తగ్గిపోయింది. దీనికితోడు టీఆర్ ఎస్ దూకుడును నిలువరించడం, కాంగ్రెస్ నాయకులు గోడదూకకుండా నిలువరించడం, పార్ల మెంటు ఎన్నికల్లో అయినా.. పార్టీ పరువును నిలబెట్టేలా చేయడం వంటి అత్యంత కీలక విషయాల్లో ఉత్త మ్ వెనుకబడ్డారు. ఇక, పార్టీలో అసంతృప్తులు కూడా అదే రేంజ్‌లో పెరిగాయి. మరో పక్క రాహుల్ రాజీనామాతో రాష్ట్రాలకు చెందిన చీఫ్‌లు కూడా రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా కాంగ్రెస్ పగ్గాలు చేపడతారని భావిస్తున్న మాజీ అధ్యక్షురాలు సోనియా.. రాష్ట్రాల్లోనూ సారథులను మారుస్తారని అంటున్నారు.
అనేకమంది పోటీ పడుతున్నా….
ఈ క్రమంలోనే తెలంగాణ కాంగ్రెస్ సారథి విషయం చర్చకు వస్తోంది. ఉత్తమ్‌ను తప్పిస్తే.. ఈ పదవిని చేపట్టేందుకు ఇప్పటికే జీ గీతారెడ్డి, విజయశాంతి (ఈమె కూడా ఈ ప్రయత్నంలో ఉన్నారని వార్తలు వచ్చాయి) తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. మరోపక్క, సీనియర్లు.. పొన్నాల లక్ష్మయ్య, కోమటిరెడ్డి, జానా రెడ్డి, షబ్బీర్ అలీ వంటి వారు లైన్లో ఉన్నారు. వీరి పేర్లు కొన్నాళ్లుగా వినిపిస్తున్నవే. అయితే, తాజాగా మరో కొత్త నాయకుడి పేరు తెరమీదికి వచ్చింది. ఆయనే ఎంపీ రేవంత్ రెడ్డి. టీడీపీ నుంచి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న ఈయనకు యూత్ లో ఫాలోయింగ్ ఎక్కువ.
రేవంత్ రెడ్డి ఖాయమంటూ….
పైగా ఢీ అంటే ఢీ అనేలా సీఎం కేసీఆర్‌తో రాజకీయ వైరం ఉంది. ఈ నేపథ్యంలో ఈయన అయితే, పార్టీని ముందుకు నడిపించేందుకు వ్యూహాత్మకంగా ఉపయోగపడతారని కొందరు భావిస్తున్నారు. ఒక పక్క బీజేపీని, మరోపక్క, టీఆర్ఎస్‌ను కూడా ఎదుర్కొవడం ఇప్పుడు టీ కాంగ్రెస్‌కు కీలక లక్ష్యం. ఈ క్రమంలో ఎవరైతే.,.ఈ రెండు లక్ష్యాలను ఛేదించగలరో వెతికి పట్టుకుని చీఫ్‌ను చేయాలని నిర్ణయించుకున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి పేరు వినిపిస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.