ఓన్లీ పీపుల్ ఆర్ మై జడ్జెస్

విపక్షంలో ఉన్నప్పుడే ఏ పార్టీకైనా విలువలు, సిద్ధాంతాలు గుర్తుకు వస్తాయి. సందర్భం వచ్చినప్పుడల్లా వాటి గురించి అదేపనిగా వల్లె వేస్తుంటాయి. అదే అధికారంలో ఉన్నప్పుడు వాటి గురించి [more]

Update: 2020-10-06 15:30 GMT

విపక్షంలో ఉన్నప్పుడే ఏ పార్టీకైనా విలువలు, సిద్ధాంతాలు గుర్తుకు వస్తాయి. సందర్భం వచ్చినప్పుడల్లా వాటి గురించి అదేపనిగా వల్లె వేస్తుంటాయి. అదే అధికారంలో ఉన్నప్పుడు వాటి గురించి ఉద్దేశపూర్వకంగానే విస్మరిస్తాయి. విలువలకు పాతరేస్తాయి. సిద్ధాంతాలకు నీళ్లు వదులుతాయి. తమ ప్రయోజనాలే పరమావధిగా వ్యవహరిస్తాయి. ఈ విషయంలో దాదాపు అన్ని పార్టీలది దాదాపు ఒకే వైఖరి, విధానం. అయితే తెలుగుదేశం ఈ విషయంలో నాలుగాకులు ఎక్కువే చదివింది. ప్రస్తుతం నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని పార్టీ మరింత ముందుకు వెళ్లింది.

సుద్దులు చెపుతున్న…..

గత ఏడాదిన్నరగాతెలుగుదేశం పార్టీ న్యాయం, ధర్మం, చట్టం, రాజ్యాంగం గురించి అదే పనిగా వల్లె వేస్తోంది. నిత్యం సుద్దులు చెబుతోంది. జగన్ ప్రభుత్వానికి చట్టాలన్నా, రాజ్యాంగమన్నా, కోర్టులన్నా కించిత్ గౌరవం లేదని విమర్శలు ఎక్కు పెడుతోంది. కోర్టుల నుంచి ఎన్ని వ్యతిరేక తీర్పులు వస్తున్నా ముఖ్యమంత్రి జగన్ చలించడం లేదని, కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరుతోంది. అంతేకాక 356 అధికరణను ఉపయోగించి రాష్ట్రంలో రాష్ర్టపతి పాలన విధించాలని డిమాండ్ చేసే స్థాయికి వెళ్లింది. 356కు మద్దతుగా ఒక ప్రాంతీయ పార్టీ మాట్లాడటం వింతగా ఉంది.

ఎన్టీఆర్ పై ద్రోణంరాజు……

తెలుగుదేశం గత చరిత్రను పరిశీలిస్తే ఇలా మాట్లాడే నైతిక అధికారం ఆ పార్టీకి లేదన్న విషయం అర్థమవుతుంది. నిజానికి న్యాయవ్యవస్థ పట్ల ఆ పార్టీకి గౌరవం ఏమిటో ఒక్కసారి ఎనిమిదో దశకంలోకి వెళితే విదితమవుతుంది. 1987 నవంబరులో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ సాక్షాత్తు హైకోర్టులోనే వ్యాజ్యం దాఖలైంది. నాటి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ద్రోణంరాజు సత్యనారాయణ దీనిని దాఖలు చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కట్టలి భాస్కరన్ సారథ్యంలోని ధర్మాసనం దీనిని విచారణకు స్వీకరించి ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఒక ముఖ్యమంత్రిపై ఉన్నత న్యాయస్థానం విచారణ జరపడం సంచలనం కలిగించింది. దేశవ్యాప్తంగా ఇది చర్చనీయాంశమైంది. వాది
ద్రోణంరాజు సత్యనారాయణ తరఫున సీనియర్ న్యాయవాదిఎస్. రామచంద్రరావు పదునైన వాదనలు వినిపించి ఆకట్టుకున్నారు.

ఏడు కేసుల్లో నిర్థారణ…..
ప్రభుత్వం కూడా ఈ వ్యాజ్యాన్ని సవాల్ గా తీసుకుంది. పలువురు న్యాయకోవిదులను రంగంలోకి దించింది. సహజంగానే రాష్ట్ర ప్రభుత్వం తరఫున నాటి అడ్వకేట్ జనరల్ ఇ.మనోహర్ విచారణకు హాజరయ్యారు. నానీ పాల్కీవాలా, రామ్ జెత్మలానీ వంటి ఉద్ధండులు కూడా ఎన్టీఆర్ తరఫున బలమైన వాదనలు వినిపించారు. సంక్లిష్టమైన ఈ విషయంలో కోర్టుకు సహాయపడేందుకు నాటి అటార్నీ జనరల్ కె.పరాశరన్ ను అమికస్ క్యూరీగా హైకోర్టు నియమించింది. (తమిళనాడుకు చెందిన ఈయన ఇటీవల అయోధ్య కేసులో హిందువుల తరఫున వాదనలు వినిపించి విజయవంతమయ్యారు. సినీ నటుడు కమలహాసన్ కు సమీప బంధువు) సుదీర్ఘంగా సాగిన వాదనలు విన్న హైకోర్టు 1988 జనవరి 2న తీర్పిచ్చింది. ఏడుకేసుల్లో ఎన్టీఆర్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ప్రాథమికంగా నిర్థారించింది.

అప్పుడు ఒప్పుకోమన్న టీడీపీ……

తీర్పుపై తెదేపా శ్రేణులు అగ్గిమీద గుగ్గిలమయ్యాయి. ఇది ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పీ ఐ ఎల్- పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్) కాదని పొలిటికల్ ఇంటరెస్ట్ పిటిషన్ (పీ ఐ ఎల్) అని ధ్వజమెత్తాయి. ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు పక్కదారి పడుతున్నాయని విమర్శించింది. రామారావు రాజీనామా చేయాల్సిన అవసరం లేదని వాదించాయి. ఓన్లీ పీపుల్ ఆర్ మై జడ్జెస్ (ప్రజలే నాకు న్యాయమూర్తులు) అని స్వయంగా ఎన్టీఆర్ వ్యాఖ్యానించడం గమనార్హం. నాటి చరిత్రను తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఉద్దేశపూర్వకంగా విస్మరించినట్లు కనపడుతోంది. నాడు తనకు వ్యతిరేకంగా వాదించినఎస్. రామచంద్రరావును 1994లో మళ్లీ ఎన్టీఆర్ గెలిచాక అడ్వకేట్ జనరల్ గా నియమించడం విశేషం. (రామచంద్రరావు ఇటీవలే మరణించారు). ప్రతిభావంతులను గుర్తించడం, గౌరవించడం ఎన్టీ ఆర్ గొప్పదనానికి నిదర్శనం. అదీ నాటి పార్టీ అధినేతకు, నేటి అధినేతకు గల తేడా.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News