విశాఖ మేయర్ ఆయనేనట ?

తెలుగుదేశం పార్టీకి విశాఖ మేయర్ ఒక తీపి కల. ఎపుడో మూడున్నర దశాబ్దాల క్రితం నాటి ప్రముఖ న్యాయవాది డీవీ సుబ్బారావుని బరిలోకి దింపి ప్రత్యక్ష ఎన్నికల [more]

Update: 2020-12-08 00:30 GMT

తెలుగుదేశం పార్టీకి విశాఖ మేయర్ ఒక తీపి కల. ఎపుడో మూడున్నర దశాబ్దాల క్రితం నాటి ప్రముఖ న్యాయవాది డీవీ సుబ్బారావుని బరిలోకి దింపి ప్రత్యక్ష ఎన్నికల విధానంలో విశాఖ మేయర్ ని గెలుచుకున్నారు. అది కూడా ఎన్టీయార్ జమానాలో. ఆ తరువాత వరసగా మూడు సార్లు ఎన్నికలు జరిగినా టీడీపీకి మేయర్ సీటు దక్కలేదు. కాంగ్రెస్ మేయర్లే విశాఖను ఏలారు. ఇపుడు కాంగ్రెస్ బలం వైసీపీకి టర్న్ అయిన వేళ కొత్త మేయర్ ఎవరా, ఏ పార్టీకి చెందిన వారు గెలుస్తారు అన్నది ఆసక్తికరమైన చర్చగానే ఉంది.

రెడీ అయినట్లేనా…?

వచ్చే ఏడాదిలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. దాంతో ఇప్పటి నుంచే అన్ని రాజకీయ పార్టీలు రెడీ అవుతున్నాయి. ఈ ఏడాది మార్చి నాటికి వైసీపీ మేయర్ అభ్యర్ధిని ఎంపిక చేసుకుంది కానీ టీడీపీకి మాత్రం ఎవరూ లేరు. కొన్ని పేర్లు పరిశీలనలోకి వచ్చినా మేయర్ స్థాయిలో ఎవరూ లేకపోవడంతో గెలిచిన తరువాత చూసుకుందామని ఆగారు. ఇపుడు ఎటూ టైం ఉంది. దానికి తోడు విశాఖలో గెలిచి తీరాలన్న పట్టుదల కూడా టీడీపీకి ఉంది. అందుకే చంద్రబాబు విశాఖ మేయర్ విషయంలో కచ్చితమైన నిర్ణయమే తీసుకున్నారని తెలుస్తోంది.

ఆయనే అభ్యర్ధిగా….

విశాఖ పార్లమెంట్ ప్రెసిడెంట్ గా తాజాగా నియమితుడైన మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ ని మేయర్ అభ్యర్ధిగా నిలబెట్టాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఆయన గాజువాక నుంచి ఒకసారి గెలిచి సత్తా చాటారు. యాదవ సామాజికవర్గానికి పల్లా కనుక బరిలో ఉంటే ధీటైన అభ్యర్ధి అవుతారు అంటున్నారు. అయితే గతంలో ఈ ప్రతిపాదన వచ్చినప్పటికీ పల్లా వద్దు అని చెప్పారు. దానికి కారణం పరోక్ష పద్ధతిలో ఎన్నికలు జరగడం. అంటే కార్పోరేటర్ గా నెగ్గితేనే మేయర్ కి పోటీ పడాల్సి ఉంటుంది. ఇపుడు మారిన రాజకీయ పరిస్థితుల్లో పల్లా కూడా అంగీకరిస్తారు అంటున్నారు. పైగా యాదవ సామాజికవర్గాన్ని తోడు చేసుకుంటే విజయం ఖాయమని టీడీపీ భావిస్తోందిట.

అందుకే గురి….

ఇక వైసీపీ తరఫున పోటీలో ఉన్న వంశీక్రిష్ణ శ్రీనివాస్ కూడా యాదవ సామాజికవర్గానికి చెందిన వారే కావడం విశేషం. అయితే రాజకీయ పలుకుబడి, బలమైన రాజకీయ కుటుంబం కలిగిన పల్లా శ్రీనివాస్ తో పోలిస్తే వంశీ కొంత వెనకబడినట్లే. దానికి తోడు ఈ ఏడాది మార్చిలో ఎన్నికలు జరిగి ఉంటే వంశీ ఎలాగోలా గెలిచేవారు. కానీ ఇపుడు కొంత వ్యతిరేకత అధికార పార్టీకి ఉంది, పైగా విశాఖలో టీడీపీకి గట్టి పట్టుంది, దాంతో మేయర్ గా పల్లా వర్సెస్ వంశీ అయితే టీడీపీకి విజయావకాశాలు ఉంటాయని అధినాయకత్వం ఆలోచిస్తోందిట. అందుకే పాత ఎన్నికలను రద్దు చేసి తాజాగా నోటిఫికేషన్ విడుదల చేయాలని చంద్రబాబు డిమాండ్ చేస్తున్నారు.

Tags:    

Similar News