కమలం కొత్త పుంతలు

మొత్తమ్మీద దేశంలో కాంగ్రెసు స్థానాన్ని ఆక్రమించేసిన భారతీయ జనతాపార్టీ మరింత బలపడే దిశలో కదులుతోంది. ఒక పార్టీగా రాజకీయ లక్ష్యాలను పెట్టుకోవడం తప్పులేదు. అయితే ఇంతగా పట్టుపట్టి [more]

Update: 2019-07-24 16:30 GMT

మొత్తమ్మీద దేశంలో కాంగ్రెసు స్థానాన్ని ఆక్రమించేసిన భారతీయ జనతాపార్టీ మరింత బలపడే దిశలో కదులుతోంది. ఒక పార్టీగా రాజకీయ లక్ష్యాలను పెట్టుకోవడం తప్పులేదు. అయితే ఇంతగా పట్టుపట్టి కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఏకచ్ఛత్రాధిపత్యం సాధించడం వెనక వేరే వ్యూహం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కర్ణాటక ఉదంతంతో కమలం పార్టీ ఎంత పకడ్బందీగా పాచికలు కదపగలదో అర్థమైపోయింది. పదిరోజుల పైచిలుకు సమయం ఇచ్చినప్పటికీ కాంగ్రెసు, జేడీఎస్ పార్టీలు అధికారాన్ని కాపాడుకోలేకపోయాయి. తిరుగుబాటు చేసిన తమ సొంత సభ్యుల్లో మూడోవంతు మందిని కూడా వెనక్కి తెచ్చుకోలేక పోయాయి. అంతగా పొలిటికల్ పవర్ ను శాసించగల స్థాయికి చేరుకుంది బీజేపీ.

తలకిందులు చేసి…..

శాసనసభలో బలాబలాలను తలకిందులు చేసి తాను అనుకున్నది సాధించగలిగింది. ఒక రాష్ట్రంలో యడియూరప్పకు పట్టం గట్టబెట్టడానికైతే అధిష్ఠానం అంతగా చెడ్డపేరు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. అంతకుమించి పార్టీ సైద్ధాంతిక లక్ష్యాల సాధనలో ఇదొక భాగం అంటున్నారు పరిశీలకులు. బీజేపీ తొలి నుంచి ప్రవచిస్తున్న ఉమ్మడి పౌరస్మృతి వంటి అనేక అంశాలను ఆచరణలోకి తీసుకురావడానికి రాజ్యాంగ పరమైన అవరోధాలున్నాయి. లోక్ సభ, రాజ్యసభల ఆమోదంతో పాటు సగానికి పైగా రాష్ట్రాలు అంగీకరిస్తేనే కొన్ని కీలకమైన రాజ్యాంగ సవరణలు చేయడం సాధ్యమవుతుంది. ఇందుకుగాను రాజ్యసభలో బలం సాధించడానికి అనేక రకాల ఎత్తుగడలు అనుసరిస్తోంది. దక్షిణ భారతంలో సైతం తమ సిద్దాంతాలకు ఆమోదముద్ర వేయించుకోవడం అవసరం. కర్ణాటకలో పవర్ గేమ్ ను అందులో భాగంగానే చూడాలి. లేకపోతే ఉత్తరభారతంలో ఆధిక్యతతో రాజ్యాంగ సవరణలు చేసేస్తున్నారనే గగ్గోలు మొదలవుతుంది. ఇతర పార్టీలు సౌత్ ఇండియా, నార్త్ ఇండియా అన్న విభజనను తెచ్చి రాజకీయంగా చికాకు పెడతాయి. దీనిని దృష్టిలో పెట్టుకునే తమకు అవకాశమున్న కర్ణాటకను ఒడిసిపట్ట్టేసింది.

గంపగుత్తగా…

ఇతర పార్టీల సభ్యులను తమ పార్టీలో చేర్చుకునేందుకు విడివిడిగా మాట్టాడుకోవడం ఆనవాయితీగా వస్తోంది. టీఆర్ఎస్ వంటి ప్రాంతీయ పార్టీలు మాత్రం ఈవిషయంలో కొంత దూకుడు ప్రదర్శించి గ్రూపులుగా ఫిరాయింపులను ప్రోత్సహించాయి. ఇప్పుడు బీజేపీ సైతం ఈ ధోరణినే అనుసరిస్తోంది. రాజ్యసభలో టీడీపీ పక్షాన్ని విలీనం చేసేసుకుంది. గతంలో కర్ణాటకలో తమ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు కూడగట్టడానికి కాంగ్రెసు, జేడీఎస్ లకు చెందిన సభ్యులతో విడివిడిగా మాట్టాడటానికి యడియూరప్ప ప్రయత్నించారు. రికార్డింగుల్లో దొరికిపోయారు. ఇటువంటి చిల్లర వ్యవహారాల వల్ల పార్టీ ప్రతిష్ఠ దెబ్బతినడమే తప్ప పని కావడం లేదని అధిష్ఠానం గ్రహించింది. అందువల్లనే కొంతకాలం పాటు యడియూరప్పను నియంత్రించింది. ఈలోపు సార్వత్రిక ఎన్నికల్లో సంకీర్ణ సర్కారుకు ప్రజల్లో ఉన్న బలహీనత తేటతెల్లం కావడంతో వేగంగా పావులు కదిపింది బీజేపీ. కర్ణాటకలో కాంగ్రెసు, జేడీఎస్ ల మధ్య ఎన్ని విభేదాలున్నప్పటికీ సంకీర్ణం కుప్పకూలకుండా చాణక్యం నడపగల మేనేజర్లు కాంగ్రెసులో బాగానే ఉన్నారు. ఒకరిద్దరితో మాట్లాడితే కాంగ్రెసు మేనేజర్లు అప్రమత్తమైపోతారు. వారిని సర్ది చెప్పగలుగుతారు. అందువల్ల గంపగుత్తగా రాజీనామాలు సమర్పించేలా పకడ్బందీ వ్యూహం అనుసరించారు. వారికి ముంబై లో ఆశ్రయం కల్పించారు. కమలం పార్టీ ప్రభుత్వానికి మార్గం సుమగం చేసింది అధిష్ఠానం. కాంగ్రెసు ఈ వ్యూహాన్ని ఎదుర్కోవడం చేతకాక చతికిలపడింది.

తదుపరి ….

కేంద్రపాలితప్రాంతమైన పుదుచ్చేరిని మినహాయిస్తే కాంగ్రెసు పార్టీ నాలుగు రాష్ట్రాల్లో మాత్రమే అధికారంలో ఉంది. పంజాబ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ లు ఆ పార్టీకి అధికారం కల్పించాయి. తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల తర్వాత రాజస్థాన్, మధ్యప్రదేశ్ లో లుకలుకలు మరింతగా పెరిగిపోయాయి. అక్కడ ఉన్న కాంగ్రెసు గ్రూపులు ప్రభుత్వ మనుగడకే ముప్పు తెచ్చేలా పరిణమిస్తున్నాయి. బీజేపీ లోక్ సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నిగ్రహం పాటించింది. లేకపోతే మధ్యప్రదేశ్ లో ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మద్దతు ఇచ్చేందుకు కొందరు ఎమ్మెల్యేలు ఎప్పుడో ముందుకు వచ్చారు. కానీ సమయం,సందర్భం కాదని బీజేపీ నేతలు సంయమనం పాటించారు. మారిన పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు ఆ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంటే పెద్దగా అవరోధాలు ఉండకపోవచ్చు. ఇందుకు అవసరమైన మద్దతు కాంగ్రెసు గ్రూపుల నుంచే లభిస్తుంది. అవసరమైతే కర్ణాటక తరహాలోనే రాజీనామా చేయించి మరీ సర్కారు విషయంలో ముందుకు వెళ్లవచ్చని పరిశీలకులు చెబుతున్నారు. అదేవిధంగా రాజస్థాన్ లోనూ పావులు చకచకా కదులుతున్నాయి. రాష్ట్రాల్లో కాంగ్రెసు వర్గ విభేదాలతో సతమతమవుతోంది. జాతీయ స్థాయిలో నాయకత్వ సమస్య వెన్నాడుతోంది. తనకు అధ్యక్ష పదవి అవసరం లేదంటూ వెళ్లిపోయిన రాహుల్ గాంధీ స్థానంలో ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని తీసుకు వచ్చేందుకు కాంగ్రెసు ఎటువంటి ప్రయత్నాలు చేయడం లేదు. దీంతో ఆ పార్టీలో అయోమయం నెలకొంది. ఇది బీజేపీ రాజకీయానికి నల్లేరుపై బండి నడక మాదిరిగా తయారవుతోంది.

ఆది నుంచే ….

పరస్పరం విశ్వాసం లేని పార్టీలు అవసరార్థం పొత్తు కుదుర్చుకుంటే ఏం జరుగుతుందనేందుకు కర్ణాటక ఒక ఉదాహరణ. అవకాశవాద మైత్రి శాశ్వతమైన ప్రయోజనం సమకూర్చదు. అందుకే అధికారం దక్కగానే కీచులాటలు మొదలయ్యాయి. వాటాలు, వంతుల కోసం తన్నులాట తయారైంది. అందుకే తొలినాళ్ల నుంచే సంకీర్ణ సర్కారు మూడుకాళ్లపై నడుస్తూ వస్తోంది. కర్ణాటకలో ఏర్పాటైన పొత్తుల ప్రభుత్వం బీజేపీకి ఒక రకంగా వరంగా పరిణమించింది. పరస్పర వైరుద్ధ్యాలతో, కుమ్ములాటలతో కాంగ్రెసు, జేడీఎస్ లు తమ ప్రతిష్ఠను దిగజార్చుకున్నాయి. కర్ణాటకలోని 28 సీట్లకుగాను 25 సీట్లు బీజేపీ గెలుచుకోవడానికి ఈ సంకీర్ణ సర్కారు నిర్వాకమే కారణం. ప్రజలు ఎంతగా వీరి పదవీ లాలసతను అసహ్యించుకున్నారనేందుకు లోక్ సభ ఫలితాలే నిదర్శనం. ప్రజాతీర్పు తర్వాతనే బీజేపీ సాహసించింది. ప్రభుత్వాన్ని గద్దె దింపినా ప్రజల్లో తిరుగుబాటు రాదని నిర్ధరించుకుంది. తర్వాత చాలా వేగంగా పరిణామాలు సంభవించాయి. నిజానికి స్పీకరు, సుప్రీం కోర్టు, గవర్నర్ వంటి రాజ్యాంగ పదవుల సున్నితత్వం, ఆయా వ్యవస్థల బలహీనతలు సైతం కర్ణాటక ఉదంతంలో ప్రజల కళ్లకు కట్టాయి. రాజ్యాంగ నిబంధనల్లోని పరిమితులు, పరిధులు, లోటుపాట్లు వెల్లడయ్యాయి. భవిష్యత్తులో ఇటువంటి సంక్లిష్ట పరిస్థితులు ఏర్పడకుండా ఉండాలంటే రాజ్యాంగ ధర్మాసనం కొలువు తీరి ఫిరాయింపుల నిరోధకచట్టం, స్పీకరు విచక్షణాధికారాలపై స్పష్టతనివ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే కర్ర ఉన్నవాడిదే బర్రె చందంగా ప్రజాతీర్పుతో సంబంధం లేకుండా పవర్ పుల్ పార్టీలకు అధికారం సొంతమైపోతూ ఉంటుంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News