నా ఓటు ఇంగ్లీష్ మీడియానికే

ఇలాంటి సజీవ వాదనలు వినిపిస్తే, కనిపిస్తే సమర్ధనీయంగా ఉంటుంది. ఈ న్యాయవాది లాంటివాళ్ళు దేశంలో చాలా మంది ఉంటారు. అందులో నేనొకణ్ణి. ఎక్కడో కృష్ణా జిల్లా మెట్ట [more]

Update: 2020-09-04 09:30 GMT

ఇలాంటి సజీవ వాదనలు వినిపిస్తే, కనిపిస్తే సమర్ధనీయంగా ఉంటుంది. ఈ న్యాయవాది లాంటివాళ్ళు దేశంలో చాలా మంది ఉంటారు. అందులో నేనొకణ్ణి. ఎక్కడో కృష్ణా జిల్లా మెట్ట ప్రాంతంలో మారుమూల గ్రామంలో పుట్టి, తాటాకుల పాకే పాఠశాలగా ఉన్నచోట అక్షరాభ్యాసం చేసి, జిల్లా పరిషత్ పాఠశాలలో చదువుకుని ఓ మహానుభావుడి ఆర్ధిక సహాయంతో విజయవాడ ఆంధ్రా లొయొలా కళాశాలో అడుగుపెట్టినప్పుడు (1982) ఇంగ్లీష్ అక్షరం ముక్క కూడా అర్ధం కాకుండా ఎన్ని ఇబ్బందులు పడ్డానో నాకు తెలుసు.

నిలదొక్కుకుని…

ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళల్లో చదివివచ్చిన మంత్రులు, ఉన్నతాధికారులు, బడా వ్యాపారాలు, పారిశ్రామిక వేత్తల పిల్లలు ఎగతాళి చేస్తుంటే భరించలేక కాలేజీ నుండి పారిపోదామనుకున్నవాణ్ణి. చివరికి నిలదొక్కుకుని ఇంటర్ తెలుగు మీడియంలోనే చదివి ఆ క్రమంలోనే ఇంగ్లీష్ నేర్చుకుని, చుట్టూ ఉన్న అందరూ భయపెడుతున్నా, నిరుత్సాహపరుస్తున్నా డిగ్రీ ఇంగ్లీష్ మీడియంలో చదివి మూడు దశాబ్దాలుగా ఇంగ్లీష్ పత్రికల్లో వివిధ హోదాల్లో జర్నలిస్టుగా పనిచేస్తున్న నావంటి వారికి ఇంగ్లీష్ విద్య ప్రాధమిక స్థాయినుండే అవసరం అని తెలుస్తుంది.

ఇంగ్లీష్ తెలియకుండా…..

ఈ మూడు దశాబ్దాల కాలంలో నేను ఎంతోమందిని ఇంగ్లీష్ జర్నలిస్టులుగా తయారుచేయగలిగాను. తెలుగు జర్నలిస్టుల్లో కొందరిని, అసలు జర్నలిజం అనుభవమే లేని ఇంకొందరిని ఇంగ్లీష్ జర్నలిస్టులుగా తయారుచేయగలగడం ఒక గొప్ప అనుభూతినిస్తుంది. గ్రామాల్లో తెలుగు మీడియంలో జిల్లాపరిషత్ స్కూళ్ళలో చదివి సిటీకి వచ్చి ఈ కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగం సంపాదించడం ఎంత కష్టమో వడ్డించిన విస్తరి లాంటి జీవితంలో ఇంగ్లీష్ మీడియంలో చదివి ఇప్పుడు పెద్దపెద్ద పదవుల్లో ఉన్నవారికి ఎలా అర్ధం అవుతుంది?

కార్పొరేట్ స్కూళ్లలో…..

ఇప్పుడు విద్యను వ్యాపారంగా చేసి కోట్ల రూపాయల లాభాలు గడిస్తున్న వారు ఆ పాఠశాలల్లో తెలుగు కనీసం ఒక సబ్జెక్టుగా కూడా బోధించని పరిస్థితుల్లో, పేదలు కూడా కస్టపడి తమ పిల్లలను ఇంగ్లీష్ మీడియం కోసం ప్రవేటు స్కూళ్ళకు పంపిస్తుంటే, ఆ మాత్రం కూడా ఖర్చు చేయలేని కుటుంబాలు ఇంకా ప్రభుత్వ పాఠశాలల్లోనే తెలుగు మీడియం చదివిస్తుంటే, జ్ఞాన సముపార్జనలో ఇంత వ్యత్యాసం ఉంటే అవేమీ చూడకుండా మాతృ భాష అంటూ అడ్డుపడడం ఏంటో అర్ధం కావడం లేదు.

ఎంతమందికి తెలుగు వచ్చు?

ఈ ప్రవేటు స్కూళ్ళలో చదివిన, చదువుతున్న వారిలో ఎంతమందికి తెలుగు వచ్చు? ఎన్ని ప్రైవేటు స్కూళ్ళలో తెలుగు ఒక పాఠ్యాంశంగా ఉంది? ఇప్పుడు ప్రభుత్వం తెలుగును ఒక నిర్బంధ పాఠ్యాంశంగా అమలు చేయాలనీ, ఇంగ్లీష్ మీడియంలో బోధన చేయాలనీ చూస్తుంటే ఎందుకీ రాద్ధాంతమో తెలియడం లేదు. ప్రతిదీ రాజకీయమేనా? ఇంగ్లీష్ మీడియంలో బోధన వ్యతిరేకించే వారిలో చాలా మంది ఈ అంశాన్ని రాజకీయ కోణంలోనే చూస్తున్నట్టు కనిపిస్తోంది. పెద్దోళ్ళ పిల్లలకు తెలుగు వద్దు – పేదోళ్ళ పిల్లలకు ఇంగ్లీష్ వద్దు అనే కుట్ర కూడా కనిపిస్తోంది. వీటితో పాటు తమ స్కూళ్ళలో తెలుగు నిర్బంధ పాఠ్యాంశం కావడం, ప్రభుత్వ స్కూళ్ళలో ఇంగ్లీష్ అందుబాటులోకి రావడం పట్ల ప్రైవేటు స్కూళ్ళ వ్యతిరేకత, వ్యాపార ఇంట్రెస్టు కనిపిస్తున్నాయి.

 

– గోపి దారా, సీనియర్ జర్నలిస్ట్

Tags:    

Similar News