ఎగవేత దారులకు హెచ్చరిక…?
దేశాన్ని మోసం చేసి, బ్యాంకులకు టోపీ వేసి వేల కోట్ల రూపాయలు కాజేసిన వారికి గట్టి గుణపాఠం ఇది . విజయమాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ [more]
దేశాన్ని మోసం చేసి, బ్యాంకులకు టోపీ వేసి వేల కోట్ల రూపాయలు కాజేసిన వారికి గట్టి గుణపాఠం ఇది . విజయమాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ [more]
దేశాన్ని మోసం చేసి, బ్యాంకులకు టోపీ వేసి వేల కోట్ల రూపాయలు కాజేసిన వారికి గట్టి గుణపాఠం ఇది . విజయమాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ ల ఉదంతం కేంద్ర ప్రభుత్వంపై నమ్మకం పెంచుతోంది. విదేశాల్లో సుఖసంతోషాలతో హ్యాపీగా కాలం గడిసిపోతుందనుకుంటున్న వారికి చెంపపెట్టులాంటి సంఘటనలు తాజాగా చోటు చేసుకున్నాయి. సాధారణంగా కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్తలు కేసులు నమోదు చేయడమే తప్ప వాటిని కొలిక్కి తెస్తున్న ఉదంతాలు కనిపించవు. రాజకీయ కారణాలు, చట్టపరమైన లొసుగులు, అవినీతి కలగలిసి ఆర్థిక నేరగాళ్లను బయటపడేస్తున్నాయి. అటువంటి స్థితిలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ మాల్యా, నీరవ్, చోక్సీల నుంచి జప్తు చేసుకున్న ఆస్తుల వేలం ద్వారా ఇప్పటికే 9 వేల కోట్ల రూపాయలు రాబట్టడం ఘనవిజయమే. ఇంతకంటే భారీగా బ్యాంకులను మోసం చేసిన వారు సైతం దేశంలో ఉన్నారు. అయితే విదేశాలకు పారిపోయి, సురక్షితంగా ఉంటామనుకోవడంతోనే వీరి వ్యవహారం పెద్ద చర్చనీయమైంది. ఎక్కడ దాక్కున్నా చట్టానికి స్వేచ్ఛ కలిపిస్తే పట్టుకోవచ్చని వీరి ఉదంతం తేటతెల్లం చేసింది. వారి ముగ్గుర్నీ దేశానికి రప్పించి శిక్షలు అమలు చేసేందుకు పూనుకుంటున్నట్లు భారత ప్రభుత్వం చెబుతోంది. దీనివల్ల మిగిలిన ఆర్థిక నేరగాళ్లకు గట్టి హెచ్చరికలు పంపినట్లు అవుతుంది.
మోడీ ప్రభుత్వ ఘనత…
ఈ ముగ్గురు ఆర్థిక నేరగాళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంది. దేశం విడిచి వెళ్లిపోయే సమయంలో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించిందని విమర్శలు వచ్చాయి. ప్రతిపక్షాల చేతికి బ్రహ్మాండమైన అస్త్రంగా మారింది. నిజానికి వీరి రుణాలు మోడీ ప్రభుత్వ హయాంలో మొదలు కాలేదు. యూపీఏ కాలం నుంచే బ్యాంకులను మోసం చేస్తూ తిమ్మినిబమ్మిని చేస్తూ వచ్చారు. మోడీ ప్రభుత్వం వచ్చేనాటికే మాల్యా దివాళా తీశారు. నీరవ్, చోక్సీలు కూడా రుణాలు చెల్లించడం సాధ్యం కాదని ఒక అంచనాకు వచ్చారు. ఫలితంగానే దేశం నుంచి ఉడాయించారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రభుత్వం గట్టి ప్రయత్నమే చేసిందని చెప్పాలి. 2018లో ప్రత్యేక చట్టమే చేసింది. ఇతర దేశాల్లో ఆశ్రయం పొందుతున్న దేశీయ ఆర్థిక నేరగాళ్ల ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి ఈ చట్టం వీలు కల్పించింది. అదే సమయంలో విదేశాల్లో ఆస్తులను కూడా స్వాధీనం చేసుకునే వెసులుబాటునిచ్చింది. పలితంగానే వీరు మొత్తం 22 వేల కోట్లు బ్యాంకులకు మోసం చేస్తే స్వదేశీ ఆస్తులు 17వేల కోట్లు, విదేశీ ఆస్తులు వెయ్యి కోట్లు జప్తు చేయగలిగారు. ప్రభుత్వ అధీనంలో ఉన్న మిగిలిన ఆస్తుల ద్వారా మరో తొమ్మిది వేల కోట్లు బ్యాంకులకు జమ అయ్యేందుకు అవకాశం ఉంది. మోసం చేసిన మొత్తంలో 80శాతం రాబట్టడమంటే చిన్న విషయం కాదు. ఈ విషయంలో ప్రభుత్వ చిత్తశుద్ధిని, దర్యాప్తు సంస్థల పనితనాన్ని మెచ్చుకోవాల్సిందే.
నేతల గుట్టు వెలికి తీయాలి…
భారతదేశంలో ఆర్థిక నేరాలు చేసిన వాళ్లకు చట్టం పట్ట భయం తక్కువ. తమకేమీ కాదనే దీమా వారిది. కంపెనీల పేరిట అప్పులు చేసి దివాళా చూపించి తర్వాత దుకాణం మూసేస్తూ ఉంటారు. బ్యాంకులు మునిగిపోతుంటాయి. ఇబ్బడిముబ్బడిగా రుణాలు తీసుకున్న వాళ్లు మాత్రం పక్కదారి పట్టించిన నిధులతో విలాసవంతంగా జీవిస్తూ ఉంటారు. ఈ రకంగా వివిధ వ్యాపారాలు, కాంట్రాక్టులు, పరిశ్రమల పేరిట లక్షల కోట్ల లోనే బ్యాంకులకు టోపీ వేసిన వారున్నారు. దేశంలోనే ఉంటూ చట్టం నుంచి తప్పించుకుంటూ దర్యాప్తు సంస్తలను ముప్పుతిప్పలు పెడుతున్న వీరిపైన కూడా కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి. వీరిలో ఎక్కువ మంది రాజకీయ ఆశ్రయం పొందుతున్నారు. ఎంపీలుగా చెలామణి అవుతున్నారు. లేదా అధికారపార్టీల్లో కొనసాగుతున్నారు. అటువంటి వారి వల్లే బ్యాంకులకు ఎక్కువ నష్టం వాటిల్లుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆర్థిక అక్రమాలకు పాల్పడినట్లు దర్యాప్తు సాగుతున్న వారిలో చాలామంది ప్రముఖులే ఉండటం విశేషం. మాజీ కేంద్ర మంత్రి సుజనాచౌదరి , కావూరి సాంబశివరావు, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు, టీఆర్ఎస్ లోకసభా పక్ష నేత నామా నాగేశ్వరరావు వంటి వారి సంగతి అందరికీ తెలిసిందే. రాజకీయ సంబంధాలున్నవారిపై కూడా నిష్పాక్షికంగా విచారణ జరిగేలా దర్యాప్తు సంస్థలకు స్వేచ్ఛ కల్పించాలి.
ఇంటి దొంగలు….
ఐసీఐసీఐ , హెచ్ డీఎప్ సీ వంటి బ్యాంకులు వ్యాపార రంగంలో దూసుకుపోతున్నాయి. కానీ ప్రభుత్వ రంగ బ్యాంకులు దివాళా దిశలో పయనిస్తున్నాయి. ప్రభుత్వపరమైన ఒత్తిళ్లు, బ్యాంకింగ్ వ్యవస్థలోని అవినీతి ఒక కారణంగా చెప్పుకోవాలి. బ్యాంకులను ఆదుకోవడానికి ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం నిధులు సమకూరుస్తోంది. కానీ జవాబుదారీతనం రావడం లేదు. పారిశ్రామిక, కాంట్రాక్టు సంస్థలు ఎగవేసిన నిధుల్లో అదికమొత్తాలు ప్రభుత్వ రంగ బ్యాంకులకు చెందినవే. ప్రభుత్వ పెద్దల పొలిటికల్ ఇన్ ఫ్లూయన్స్ కు లొంగిపోతున్నారు ఉన్నతాధికారులు. చిన్న మొత్తాల్లో ఇచ్చే గ్రుహరుణాలలో మాత్రమే 99శాతం వరకూ రికవరీలున్నాయి. మిగిలిన పెద్ద రుణాల్లో ప్రత్యేకించి పారిశ్రామిక, కార్పొరేట్ రుణాల వసూళ్లు దైవాధీనంగా ఉంటున్నాయి. పారిశ్రామికీకరణ, మేకిన్ ఇండియా వంటి వాటిని ప్రోత్సహించాలనే ప్రబుత్వ లక్ష్యాలను ఆసరాగా చేసుకుంటూ బ్యాంకులు కొందరు పారిశ్రామిక వేత్తలతో కుమ్మక్కు అవుతున్నాయనే ఆరోపణలను ఎదుర్కొంటున్నాయి. దీనిపై కూడా సమగ్రంగా నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది. మాల్యా, నీరవ్; చోక్సీల విషయంలో సాధించిన విజయం దేశీయ ఆర్థిక నేరగాళ్లపై ఉక్కుపాదం మోపడానికి ఉత్సాహం నింపాలి.
-ఎడిటోరియల్ డెస్క్