లేకుంటే ఐసీయూలో అలా వదిలేయాల్సిందేనా?

ఈరోజు కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక దినం. 1885లో సరిగ్గా ఇదే రోజు, డిసెంబర్ 28న, భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పాటయింది. పార్టీ వ్యవస్థాపనలో ప్రధాన లక్ష్యం దేశానికి [more]

Update: 2020-12-28 16:30 GMT

ఈరోజు కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక దినం. 1885లో సరిగ్గా ఇదే రోజు, డిసెంబర్ 28న, భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పాటయింది. పార్టీ వ్యవస్థాపనలో ప్రధాన లక్ష్యం దేశానికి స్వాతంత్య్రం సాధించడం. బ్రిటిష్ పాలకులనుండి దేశానికి విముక్తి సాధించడం. ఇందుకోసం పార్టీ ఏర్పాటు చేయడంలో బ్రిటిష్ నేతలు కీలకపాత్ర పోషించడం విశేషం. అప్పటి నుండి భారత స్వాతంత్ర్య సంగ్రామం కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోనే నడిచింది. స్వాతంత్య్రం తర్వాత పార్టీని రద్దు చేయాలని గాంధీ ప్రతిపాదించారు. అయినా పార్టీ కొనసాగుతూనే ఉంది. నేటికి 135 సంవత్సరాలు.

1970వ దశకం వరకూ….

1885లో ప్రారంభమైన కాంగ్రెస్ పార్టీ 1947లో స్వాతంత్య్రం సాధించిన తర్వాత మొదటి ప్రభుత్వం ఏర్పాటు చేసి 1970వ దశకం వరకూ ఏకఛత్రాధిపత్యం వహించింది. కేంద్రంతో పాటు అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలే నడిచాయి. ఇతర పార్టీలన్నీ నామమాత్రంగానే ఉండేవి. ఇందిరాగాంధీ కాలం నుండీ కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ పోరు మొదలై, పివి నరసింహ రావు, సీతారాం కేసరి, సోనియాగాంధీ కాలానికి అంతర్గత పోరు తీవ్రమై చివరికి పార్టీలో బలవంతులైన నేతలు దూరం అయ్యారు. మహారాష్ట్ర లో శరద్ పవార్, బెంగాల్లో మమతా బెనర్జీ వంటివారు పార్టీకి దూరం అయ్యారు. ఉత్తరప్రదేశ్ కాన్షిరాం ప్రభావం ఎక్కువైంది. అలాగే దక్షిణాదిలో తమిళనాడులో ద్రవిడ ఉద్యమం బలపడింది. కేరళలో, బెంగాల్లో కమ్యూనిస్టు శక్తులు బలపడ్డాయి. ఈ కారణాలతో ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ బలహీనపడింది.

అదే జన్ సంఘ్ కలిసొచ్చింది…

ఈ కాలంలోనే కమ్యూనిస్టులు కాంగ్రెస్ పార్టీపై దృష్టిపెట్టి ఆ పార్టీని బలహీనపర్చేందుకు తమ శక్తియుక్తులను ప్రయోగించడంలో నిమగ్నం అయి జనసంఘ్ తన బలం పెంచుకోవడాన్ని గమనించలేదు. కమ్యూనిస్టులు తమ రెండు కళ్ళు కాంగ్రెస్ పై కేంద్రీకరించడం, దృష్ట్రీ ఆవైపు నుండి మరల్చకపోవడం జనసంఘ్ శక్తులకు కలిసొచ్చింది. మరోవైపు వాజ్ పాయ్ నాయకత్వం పట్ల ప్రజల్లో సానుకూలత పెరిగింది. వాజ్ పాయ్ వ్యక్తిత్వం కారణంగా లౌకిక శక్తులు మెతకవైఖరి అవలంభించి జనసంఘ్ నెమ్మదిగా బలపడుతుండడాన్ని గమనించలేదు. వాజపేయి అరుదైన వ్యక్తిత్వం బిజెపిగా రూపాంతరం చెందిన జనసంఘ్ బలపడేందుకు ఉపయోగపడింది. వాజపేయి పట్ల ఏర్పడిన సానుకూలత బిజెపి పెరుగుదలకు ఉపయోగపడింది. ఈ క్రమం మొత్తం మరోవైపు కాంగ్రెస్ బలహీనపడేందుకు పరోక్షంగా పనిచేసింది.

పార్టీకి ఆమె ఉపయోగపడలేదు కానీ….

ఇక పీవీ తర్వాత పార్టీ పగ్గాలు చేపట్టిన సోనియాగాంధీ పార్టీ బలపడేందుకు ఏమాత్రం కృషి చేయలేదు. అప్పటికే పార్టీకి ఉన్న బలాన్ని ఉపయోగించుకుని తానే బలమైన నేతగా పదేళ్ళు వృధా చేసుకున్నారు సోనియా. ఇంకో మాటలో చెప్పాలంటే పార్టీకి ఆమె ఉపయోగపడలేదు కానీ, పార్టీ బలాన్ని ఆమే ఉపయోగించుకున్నారు. ఈ సమయంలోనే దేశంలోనే అత్యంత శక్తివంతమైన నేతగా బలపడిన వైఎస్సార్ వంటి నేతను పార్టీ కోల్పోయింది. మరోవైపు పార్టీలోని సోనియా కోటరీ రాష్ట్రాల్లో బలమైన నేతలు ఎదగకుండా తప్పుమీద తప్పులు చేస్తూ పార్టీ పునాదులు బలహీనపడే నిర్ణయాలు చేసింది. భస్మాసురుడి పాత్ర పోషించింది సోనియా కోటరీ.
ఇప్పుడు దేశంలో చాలాచోట్ల కాంగ్రెస్ ప్రాతినిధ్యం లేదు.

స్వయంకృతాపరాధమే….

కాంగ్రెస్ ని శత్రువుగా ఎంచుకోవడం ద్వారా కమ్యూనిస్టులు తాము బలహీనపడి, కాంగ్రెస్ ను బలహీనపర్చి, బీజేపీ బలపడేందుకు పరోక్షంగా సహకరించారు. కాంగ్రెస్ కూడా భస్మాసుర పాత్రతో స్వయంగా భస్మం అయింది. కాంగ్రెస్ ఆత్మహత్యా ప్రయత్నాలు ఇంకా కొనసాగిస్తూనే ఉంది. అయితే కాంగ్రెస్ చెరువుల్లో, కాలువల్లో ఉండే తూటికాడ లాంటిది. బలం లేదనుకున్నా అది సజీవంగానే ఉంటుంది. పీకేశాం అనుకున్నా, వేర్లనుండి మళ్ళీ ఉపిరిపోసుకుంటుంది. ఈసారి కాంగ్రెస్ పునర్జీవం చూడాలంటే, సోనియాగాంధీతో పాటు ఆమె కోటరీని కూడా వేర్లతో సహా పీకేయాల్సిందే. మరో మార్గం లేదు. లేదంటే ఐసీయూ లో అలా వదిలేయాల్సిందే.

 

-గోపి దారా, సీనియర్ జర్నలిస్ట్

Tags:    

Similar News