పిచ్చోళ్లకు చాలా రాళ్లున్నాయి…?
చట్టం అధికార పార్టీలు, ప్రభుత్వాల చేతిలో చుట్టంగా మారిపోతుంది. అందుకు కావాల్సినన్ని అవకాశాలు మన ఇండియన్ పీనల్ కోడ్ లో ఉన్నాయి. యధేచ్చగా దుర్వినియోగం అవ్యడమే కాదు, [more]
చట్టం అధికార పార్టీలు, ప్రభుత్వాల చేతిలో చుట్టంగా మారిపోతుంది. అందుకు కావాల్సినన్ని అవకాశాలు మన ఇండియన్ పీనల్ కోడ్ లో ఉన్నాయి. యధేచ్చగా దుర్వినియోగం అవ్యడమే కాదు, [more]
చట్టం అధికార పార్టీలు, ప్రభుత్వాల చేతిలో చుట్టంగా మారిపోతుంది. అందుకు కావాల్సినన్ని అవకాశాలు మన ఇండియన్ పీనల్ కోడ్ లో ఉన్నాయి. యధేచ్చగా దుర్వినియోగం అవ్యడమే కాదు, ప్రశ్నించే నోళ్లకు చట్టం ప్లాస్టర్ లు వేసేస్తోంది. సుపరిపాలనను ఆశించి మనం చేసుకున్న రాజ్యాంగ సవరణలూ అదే తంతును తలపిస్తున్నాయి. వీటికి ఎక్కడో ఒక చోట ఫుల్ స్టాప్ పెట్టాలి. బ్రిటిషర్ల చేతిలో భారతీయుల అణచివేతకు ఉద్దేశించిన రాజద్రోహం చట్టం ఇంకా అవసరమా? అన్న సుప్రీం కోర్టు ప్రశ్న ప్రభుత్వాలను ఆలోచింప చేయాలి. తమ బతుకు తాము బతికే సామాన్యులకు ఇదంతా అర్థం కాకపోవచ్చు. మానవ హక్కుల కార్యకర్తలు, రాజకీయాల్లో ఉన్నవారు, స్వతంత్ర భావ వ్యక్తీకరణలో తీవ్రత కనబరిచేవారు, మీడియాకు చెందినవారు ఎక్కువగా ఈ చట్టాల బారిన పడుతున్నారు. 1906లోనే ఈ చట్టాన్ని బాలగంగాధర్ తిలక్ పై బ్రిటిష్ ప్రభుత్వం ప్రయోగించింది. ప్రజల్లో తిరుగుబాటును ప్రేరేపిస్తున్నారంటూ ఆరేళ్ల ప్రవాస శిక్ష విధించింది. 1922లో గాందీకి సైతం అదే శిక్షను అమలు చేశారు. అనారోగ్య కారణాలతో రెండేళ్ల తర్వాత విడుదల చేశారు. తీవ్రమైన స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో విదేశీ సర్కారు వాడుకున్న చట్టం ఇది. ఇప్పుడు చీటికీమాటికీ ప్రభుత్వాలు సొంత పౌరులపైనే ప్రయోగిస్తున్నాయి.
అవకాశవాదం .. అనుచిత ధోరణి..
ఈ చట్టం పిచ్యోడి చేతిలో రాయి లా మారిందంటూ సుప్రీం కోర్టు చాలా తీవ్రంగానే వ్యాఖ్యానించింది. సాయుధ తిరుగుబాటు వంటి సందర్బాల్లో వినియోగించాల్సిన సెక్షన్ 124(ఎ) ను బావ ప్రకటనపై ఎక్కు పెడుతున్నారు. ఈ మధ్య కాలంలో ఇది మరింత ఎక్కవై పోయింది. విద్యార్థులు, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినవారు, రాజకీయ ప్రత్యర్థులు, మీడియా అందరిపైనా సులభంగా పెట్టేస్తున్నారు. విచక్షణ రహితంగా వాడుతున్నారు. గతంలో కేసుల వారీగా తీసుకుంటూ విచారణలు జరిపిన న్యాయస్థానం దుర్వినియోగం పెరిగిపోవడంతోనే మూలాలపై ద్రుష్టి పెట్టాల్సి వచ్చింది. రాజకీయ ప్రత్యర్థులకు బెయిల్ రాకుండా నిర్బంధించేందుకు దీనిని వినియోగిస్తున్నట్లు న్యాయస్థానం గుర్తించింది. దీనివల్ల ప్రజాస్వామ్య భావనకే అర్థం లేకుండా పోతోంది. అధికారంలో ఉన్న పార్టీలు చాలా తెలివిగా వీటిని వినియోగిస్తున్నాయి. ఇష్టారాజ్యంగా వినియోగిస్తున్నట్లు పైకి కనిపించినప్పటికీ ప్రజాభిప్రాయాన్ని అణచివేసేందుకు పకడ్బందీ అస్త్రంగా దీనిని ప్రయోగిస్తున్నారు. ఈ చట్టం కింద ఇంతవరకూ ఎవరెవరిపై కేసులు పెట్టారు? అందులో ఎన్నిటిని నిరూపించారు. బాధితుల్లో ఎవరెవరు ఉన్నారనే జాబితా తీస్తే చాలు. చట్టం దుర్వినియోగం ఏ స్థాయిలో చోటు చేసుకుందో తెలిసిపోతుంది. సుప్రీంకోర్టు తన వ్యాఖ్యల్లో గాంధీ, తిలక్ ల పేర్లు ప్రస్తావించడం ద్వారా స్వాతంత్ర్య భారత ప్రభుత్వాల దమననీతిని బయటపెట్టినట్లయింది.
కేంద్రం, రాష్ట్రం అదే రీతి…
తమకు అనుకూలంగా లేని వర్గాలు, నిరసనల తీవ్రత పెంచిన స్వరాలంటే ప్రభుత్వాలకు ఎప్పుడూ నచ్చదు. అన్ని పార్టీలదీ అదే తీరు. ఇందులో తరతమ బేదాలు లేవు. కేంద్ర, రాష్ట్ర వ్యత్యాసం కూడా లేదు. ఒకవైపు సుప్రీం కోర్టు ఈ చట్టం రాజ్యాంగ బద్ధతను సమీక్షిస్తామని హెచ్చరించింది. మరోవైపు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులపైనే రాజద్రోహం నమోదు చేశారు. అంటే దీనిని పూర్తిగా రద్దు చేస్తే తప్ప పోలీసులు, ప్రభుత్వాలు తమ అధికారాన్ని వదులుకోవడానికి ఇష్ట పడటం లేదు. ఐటీ చట్టంలోని నిర్బంధ సెక్సన్లను ఒకసారి సుప్రీం కోర్టు రద్దు చేస్తే అమల్లోకి రావడానికి ఏళ్లూపూళ్లూ పట్టింది. ఇటీవల మళ్లీ ఆ నిబంధనల కింద కేసులు నమోదు అయిన విషయాన్ని సుప్రీంకోర్టు గుర్తించింది. ఆగ్రహం వ్యక్తం చేసింది. దానిపై కేంద్రం ఆ సెక్షన్ల కింద కేసులు పెట్టవద్దని రాష్ట్రాలను కోరింది. అంటే తమకు ఇబ్బందికరంగా ఉన్న వాటిపై వెంటనే స్పందించడానికి కేంద్రం, రాష్ట్రాలు సిద్ద పడటం లేదు. సుప్రీం కోర్టు తీర్పు ను ‘ లా ఆఫ్ ద లాండ్ ’ గా పేర్కొంటారు. రాజ్యాంగ ప్రతిపత్తి ఉంటుంది. అమల్లో ఉన్న చట్టాలకంటే శక్తిమంతంగా చూడాలి. కానీ అటు కేంద్రం, ఇటు రాష్ట్రాలు తీర్పులను తేలికగా తీసుకుంటున్నాయి.
కావాలి.. పరిష్కారం.. .
స్వాతంత్ర్య అమృతోత్సవంలో ప్రవేశిస్తున్నాం. ఈ 75 ఏళ్లలో ప్రజాస్వామ్యాన్ని మరింత పరిపుష్టం చేసుకుని ఉండాల్సింది. కానీ బలహీనపడిన ఉదంతాలే కనిపిస్తున్నాయి. గతంలో పంచాయతీ, మునిసిపల్ వ్యవస్థలను బలోపేతం చేసేందుకు 73,74 రాజ్యాంగ సవరణలు చేసుకున్నాం. వీటి అమలు రాష్ట్ర ప్రభుత్వాల దయాదాక్షిణ్యాలపై ఆధారపడుతోంది. పంచాయతీలు, పురపాలక సంఘాలకు విధులు, నిధులు ఇంకా పూర్తిగా బదిలీ కాలేదు. సకాలంలో కనీసం ఎన్నికలు కూడా పెట్టడం లేదు. చట్టసభల్లో పార్టీ ఫిరాయింపుల నిరోధానికి ఉద్దేశించిన రాజ్యాంగ సవరణ స్పీకర్ల చేతిలో అపహాస్యానికి గురవుతోంది. ఇతర పార్టీల తరఫున ఎన్నికైన వారు అధికార పార్టీలో మంత్రులైపోతున్నారు. ఇవన్నీ ప్రజాస్వామ్యానికి మచ్చ తెచ్చే పరిణామాలే. 75వ ఏట ప్రవేశించేనాటికైనా నిజమైన ప్రజాస్వామ్య స్ఫూర్తి పరిఢవిల్లేలా చూడాలి. న్యాయస్థానాలు, చట్టసభలు ఈవిషయంపై దృష్టి సారిస్తే భవిష్యత్ భారతావనికి మేలు చేకూరుతుంది.
– ఎడిటోరియల్ డెస్క్