జెయింట్ కిల్లర్స్ కి పెద్దపీట వేస్తారా..?

ఇటీవలి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు కొందరు కాంగ్రెస్ బలమైన నేతలకు చేదు ఫలితాలను మిగిల్చాయి. రెండుమూడు దశాబ్దాలుగా బలమైన నాయకులుగా ఎదిగిన కాంగ్రెస్ నేతలు ఈ ఎన్నికల్లో [more]

Update: 2018-12-27 11:00 GMT

ఇటీవలి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు కొందరు కాంగ్రెస్ బలమైన నేతలకు చేదు ఫలితాలను మిగిల్చాయి. రెండుమూడు దశాబ్దాలుగా బలమైన నాయకులుగా ఎదిగిన కాంగ్రెస్ నేతలు ఈ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. టీఆర్ఎస్ ముందు నుంచే వీరిని టార్గెట్ చేయడం, బలమైన అభ్యర్థులను రంగంలోకి దించడం వల్ల టీఆర్ఎస్ బలమైన కాంగ్రెస్ నేతలను ఓడించగలిగింది. దీంతో వీరిపై గెలిచిన టీఆర్ఎస్ అభ్యర్థులకు ఇప్పుడు పార్టీలో, ముఖ్యంగా కేసీఆర్ వద్ద ప్రత్యేక ఇమేజ్ ఏర్పడింది. టీఆర్ఎస్ ప్రభుత్వమే ఏర్పడటంతో వీరికి పెద్దపీట వేయనున్నారు. పదవులతో పాటు నియోజకవర్గ అభివృద్ధి విషయంలో వారు అడిగ గానే ఫైళ్లు కదిలి పరిస్థితి ఉందంటున్నారు.

‘పట్నం’కి మంత్రి పదవి దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్ లో ఫైర్ బ్రాండ్ గా ముద్రపడ్డ రేవంత్ రెడ్డి ఓడిపోతారని ఎవరూ ఊహించలేదు. బహుశా టీఆర్ఎస్ నేతలు కూడా ఊహించి ఉండరు. అయితే, పట్నం నరేందర్ రెడ్డి సంవత్సర కాలంగా పక్కా వ్యూహంతో పనిచేసుకుంటూ వెళ్లడంతో ఆయన రేవంత్ రెడ్డిని సుమారు 8 వేల ఓట్ల మెజారిటీతో ఓడించగలిగారు. దీంతో నరేందర్ రెడ్డి ప్రత్యేక గుర్తింపు సాధించారు. ఇక, ఆయన సోదరుడు మహేందర్ రెడ్డి తాండూరులో ఓడిపోవడంతో ఆయన స్థానంలో నరేందర్ రెడ్డికి మంత్రి పదవి దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

కంచర్లకు పెద్దపీట వేస్తారా…

నల్గొండ జిల్లాలో బలమైన నాయకుడిగా పేరున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఈ ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. వరుసగా 20 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్న ఆయనను కంచర్ల భూపాల్ రెడ్డి ఓడించారు. గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి రెండో స్థానంలో నిలిచిన కంచర్ల ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆయన సంవత్సరం క్రితం టీఆర్ఎస్ లో చేరిన ఆయన బలమైన అభ్యర్థి అవుతాడని భావించి కేసీఆర్ టిక్కెట్ ఇచ్చారు. అనుకున్నట్లుగానే ఆయన నల్గొండలో కోమటిరెడ్డిని ఓడించారు. కోమటిరెడ్డి ఈ ఎన్నికల్లో గెలిచి ఉంటే పార్టీలో, రాష్ట్ర రాజకీయాల్లో ఆయన కీలకమయ్యే వారు. ఆయన సోదరుడు మునుగోడు నుంచి, అనుచరుడు నకిరేకల్ నుంచి గెలవడంతో వెంకట్ రెడ్డి కూడా గెలిచి ఉంటే మరింత దూకుడుగా వెళ్లేవారు. భూపాల్ రెడ్డి ఆయన దూకుడుకి అడ్డుకట్ట వేయగలిగారు. దీంతో కంచర్ల కూడా కేసీఆర్ దృష్టిలో పడ్డారు. ఆయనకు ప్రభుత్వంలో పెద్దపీట వేసే అవకాశం ఉంది. నల్గొండను కేసీఆర్ దత్తత తీసుకుంటానని హామీ ఇవ్వడంతో అభివృద్ధి పనుల విషయంలోనూ కంచర్ల అడిగింది జరుగుతుంది అంటున్నారు.

బండ్లకు ఛాన్స్ ఇస్తారా..?

గద్వాలలో వరుసగా మూడుసార్లు విజయం సాధించి నాలుగోసారి కూడా విజయం ఖాయమని ధీమాగా ఉన్న డీకే అరుణను ఆమె అల్లుడు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి దెబ్బతీశారు. వరుసగా మూడుసార్లు ఓడిపోయిన ఆయన ఈసారి టీఆర్ఎస్ తరపున పోటీచేసి ఎవరూ ఊహించని విధంగా 28 వేల భారీ మెజారిటీతో విజయం సాధించారు. వరుసగా మూడుసార్లు ఓడిపోయారన్న సానుభూతి, నిత్యం ప్రజల్లో ఉండటం, టీఆర్ఎస్ బలంతో ఆయన డీకే అరుణను సులువుగా ఓడించగలిగారు. డీకే అరుణ అవకాశం దూకుడుగా మాట్లాడే తత్వం కలిగిన నాయకురాలు. కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసేవారు. అయితే, ఆమె ఓటమి తర్వాత సైలెంట్ అయిపోయారు. ఇందుకు కారణమైన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పార్టీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. దీంతో ఆయనకు కూడా ప్రాధాన్యత పెరిగే అవకాశం ఉంది. మొత్తానికి ముగ్గురు జెయింట్ కిల్లర్స్ కి పార్టీలో, ప్రభుత్వంలో ప్రాధాన్యత దక్కనుందని అంటున్నారు.

Tags:    

Similar News