తేయాకు ఈసారి తాట తీసేదెవరినో?

నాలుగు రాష్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ అసోం పై దృష్టి సారించాయి. తమిళనాడు, కేరళ, పశ్చిమబెంగాల్, పుదుచ్చేరిలకన్నా [more]

Update: 2021-04-13 16:30 GMT

నాలుగు రాష్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ అసోం పై దృష్టి సారించాయి. తమిళనాడు, కేరళ, పశ్చిమబెంగాల్, పుదుచ్చేరిలకన్నా ఈశాన్య భారతంలోని అసోం లోనే తమకు విజయావకాశాలు ఎక్కువని పార్టీలు భావిస్తుండటమే ఇందుకు కారణం. ఇందుకోసం హస్తం, కమలం పార్టీలు సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. అధికారాన్ని కాపాడుకునేందుకు కాషాయపార్టీ, కైవశం చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ పోరాడుతున్నాయి. అసోం గణపరిషత్ ఇతర చిన్న పార్టీలతో బీజేపీ జట్టుకట్టి బరిలోకి దిగగా, సీపీఐ, సీపీఎం, సీపీఐ (ఎంఎల్), బోడో పీపుల్స్ ఫ్రంట్, ఆలిండియా డెమొక్రటిక్ ఫ్రంట్ వంటి పార్టీలతో మహా ఘట్ బంధన్ గా ఏర్పడిన హస్తం పార్టీ పోరాడుతోంది. అధికార సాధనలో భాగంగా ఏ ఒక్క చిన్న అవకాశాన్ని వదులుకునేందుకు పార్టీలు సిద్ధంగా లేవు.

తేయాకు కార్మికులపైనే…?

ఇందులో భాగంగానే తేయాకు కార్మికులపై రెండు జాతీయ పార్టీలు గురిపెట్టాయి. ఈశాన్య భారతంలోని కీలకమైన అసోం రాష్ర్టం పేరు చెప్పగానే ఎవరికైనా ముందుకు గుర్తుకు వచ్చేది తేయాకు పరిశ్రమ. తేయాకు పంటకు రాష్ర్టం ప్రసిద్ధి. దేశవ్యాప్తంగా తేయాకు ఉత్పత్తుల్లో సగం ఇక్కడి నుంచే వస్తుంది. దాదాపు 68,465 చిన్న, 825 పెద్ద తేయాకు తోటలు ఇక్కడ ఉన్నట్లు అంచనా. రాష్ర్ట రాజకీయాల్లో తేయాకు లాబీ కీలకమైనది. రాష్ర్ట జనాభాలో 17 శాతం మంది తేయాకు కార్మికులే కావడం గమనార్హం. మొత్తం 126 నియోజకవర్గాల్లో దాదాపు 40 నుంచి 50 శాతం నియోజకవర్గాల్లో గెలుపోటములను ప్రభావితం చేయగల శక్తి వీరికి ఉంది. ముఖ్యంగా ఎగువ అసోంలోని పలు నియోజకవర్గాల్లో వీరి ప్రభావం ఎక్కువ. దీంతో తేయాకు కార్మికులను తమవైపు తిప్పుకునేందుకు రెండు పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి.

వారికి తాయిలాలు….

తాము అధికారంలోకి వస్తే వారికి అరచేతిలో స్వర్గం చూపిస్తామని పార్టీలు ఆశ పెడుతున్నాయి. ఈ విషయంలో ఏ పార్టీ వెనక్కి తగ్గడం లేదు. ప్రస్తుతం తేయాకు కార్మికులు అరకొర జీతాలతో దుర్భర జీవనం గడుపుతున్నారు. వైద్య ఆరోగ్య సదుపాయాలు, వారి పిల్లలకు విద్యా సౌకర్యాలు నామమాత్రమే. రోజంతా పనిచేసినాలభించేది నామమాత్ర కూలీనే. ఈ పరిస్థితిని మారుస్తామని రెండు పార్టీలు హామీలు గుప్పిస్తున్నాయి. దశాబ్దాల పాటు హస్తం పార్టీకి దన్నుగా నిలిచిన తేయాకు కార్మికులు 2016 అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయపార్టీకి మద్దతిచ్చారు. నాటి హామీలను కాషాయపార్టీ నిలబెట్టుకోలేదని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. తాము అధికారంలోకి వచ్చిన గంటల్లోనే తేాయకు కార్మికుల కనీస కూలీని రోజుకు రూ.365 చేస్తామని సాక్షాత్తు పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. తేయాకు కార్మికులను ఆకట్టుకునేందుకు ఇటీవల పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా వాద్రా గాంధీ తేయాకు కార్మికులతోకలసి తేయాకు కోశారు. పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సైతం స్వయంగా ఓ తేయాకు కార్మికురాలితో కలసి భోజనం చేశారు.

వారిని ఆకట్టుకునేందుకు…?

మొదటినుంచీ తేయాకు కార్మికులు తమకు అండగా నిలిచారని మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ అగ్రనేత పవన్ సింగ్ ఘటోవర్ గుర్తు చేశారు. ఈసారి బీజేపీ మాటలను కార్మికులు నమ్మరని తమవైపే ఉంటారని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ కూడా దీటుగా ప్రచారం చేస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ వివిధ సభల్లో ప్రసంగిస్తూ తన చాయ్ వాలా నేపథ్యాన్ని గుర్తు చేశారు. రోజువారీ రూ.137 కూలీని రూ.167 చేసిందీ, 2018లో రూ.దానిని రూ.217కు పెంచింది తమ సర్కారేనని ఊదరగొట్టారు. తేయాకు రంగాన్ని ఆదుకునేందుకు బడ్జెట్ లో వెయ్యి కోట్ల నుంచి మూడు వేల కోట్లు కేటాయించింది తమ సర్కారేనని మోదీ వివరించారు. ముఖ్యమంత్రి సర్బానంద సోనావాల్, పార్టీలో కీలక నేత, రాష్ర్ట మంత్రి హిమంత్ బిశ్వ శర్మ ఇదే విషయాన్ని పదే పదే ప్రస్తావించారు. అంతిమంగా తేయాకు కార్మికులు ఎవరికి మద్దతుగా నిలుస్తారో , ఎవరి మాటలను విశ్వసిస్తారో తెలయాలంటే మే 2వరకు వేచిచూడక తప్పదు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News