మేడమ్.. ఒకసారి గెలిచి.. ఇలా అయితే?

అంతా వైఎస్ జగన్ ఇమేజ్ తో గెలిచిన వారే. జగన్ పాదయాత్ర పుణ్యంగా గెలుపు పిలుపును అందుకున్న వారే. కానీ ఎమ్మెల్యే అయిన తర్వాత వారు తమ [more]

Update: 2020-08-21 12:30 GMT

అంతా వైఎస్ జగన్ ఇమేజ్ తో గెలిచిన వారే. జగన్ పాదయాత్ర పుణ్యంగా గెలుపు పిలుపును అందుకున్న వారే. కానీ ఎమ్మెల్యే అయిన తర్వాత వారు తమ ఇమేజ్ తోనే గెలిచామన్న భ్రమల్లో ఉన్నారు. అంతేకాదు ఒకసారి గెలిచిన ఎమ్మెల్యే రెండోసారి కూడా గెలుపు తమదేనన్న ధీమాలో నియోజకవర్గాన్ని పూర్తిగా పట్టించుకోవడం మానేశారు. వైసీపీ ఎమ్మెల్యే ఉషాశ్రీ చరణ్ ది ఇదే పరిస్థితి. ఉషా శ్రీ చరణ్ 2019 ఎన్నికల్లో కల్యాణదుర్గం నియోజకవర్గం నుంచి గెలిచి సంచలనం సృష్టించారు. అప్పటి పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డిని ఓడించారు. తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఉషాశ్రీ చరణ్ ఇప్పుడు నియోజకవర్గాన్ని పట్టించుకోవడం లేదు.

క్యాడర్ లోనూ వ్యతిరేకత…

కల్యాణదుర్గం నియోజకవర్గంలో వైసీపీ క్యాడర్ కూడా ఎమ్మెల్యే ఉషా శ్రీ చరణ్ పై పూర్తి వ్యతిరేకతతో ఉన్నారు. ఎమ్మెల్యే ఉషాశ్రీ చరణ్ ఎక్కువగా పొరుగు రాష్ట్రమైన బెంగళూరులోనే నివాసముంటారు. అప్పుడప్పుడూ ప్రారంభోత్సవాలకు, శంకుస్థాపనలకు మాత్రమే కల్యాణ దుర్గం వస్తారు. వచ్చినప్పుడు కూడా పెద్దగా క్యాడర్ ను కలవరు. ఉషాశ్రీ చరణ్ ను కలవాలంటే ముగ్గురిని ముందు కలవాల్సి ఉంటుంది. తొలుత ఉషాశ్రీ చరణ్ నియమించుకున్న ఇద్దరు పీఏలను కలవాలి.

ముగ్గురిని ముందు కలిస్తేనే….

వారిద్దరు సంతృప్తి చెందితే పర్సనల్ పీఏను కలవాలి. ఆయన అంగీకరిస్తేనే ఎమ్మెల్యే ఉషాశ్రీ చరణ్ అపాయింట్ మెంట్ దొరుకుతుంది. పార్టీ కోసం కష్టపడిన క్యాడర్ కు ఆమె అపాయింట్ మెంట్ దొరికినా ఆమె ఇంగ్లీష్ లోనే సమాధానం చెబుతారు. ఉషాశ్రీ చరణ్ ఇంగ్లీషులో చెప్పే సమాధానం వీరికి అర్థం కాదు. మళ్లీ సమాధానం కోసం పీఏలను బతిమాలుకోవాల్సి ఉంటుంది. ఆమె ఇంగ్లీష్ పరిజ్ఞానం క్యాడర్, ప్రజలపై చూపుతుండటంతో ఆమె పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

ఇంగ్లీష్ లో మాట్లాడినంత మాత్రాన…..

నియోజకవర్గంలో ఇద్దరు ముగ్గురిని పెట్టి తాను మాత్రం నియోజకవర్గానికి దూరంగా ఉండటంతో ఉషాశ్రీ చరణ్ పై పార్టీ క్యాడర్ లోనూ అసంతృప్తి పెరిగింది. ఇప్పటికే కొందరు ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. దేశంలోనే తనకు ఉత్తమ ఎమ్మెల్యే అవార్డు లభించిందని చెప్పుకుంటున్నారని, ఇంగ్లీష్ లో మాట్లాడినంత మాత్రాన ఉత్తమ ఎమ్మెల్యే అవుతారా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మొత్తం మీద తొలిసారి గెలిచి వైసీపీని కల్యాణ దుర్గం నియోజకవర్గంలో మరింత బలోపేతం చేయాల్సిన ఉషాశ్రీ చరణ్ పార్టీని పూర్తిగా బలహీన పరుస్తున్నారన్న కామెంట్స్ వినపడుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే కల్యాణదుర్గం నియోజకవర్గంలో వైసీపీకి నూకలు చెల్లినట్లే.

Tags:    

Similar News