Vangaveeti : వంగవీటికి వింత సమస్య

వంగవీటి రాధా దశాబ్దకాలం నుంచి పదవులకు దూరంగా ఉంటున్నారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆయన మరింత డల్ అయ్యారు. అయితే ఇప్పుడు వంగవీటి రాధా కొత్త సమస్యను [more]

Update: 2021-10-16 05:00 GMT

వంగవీటి రాధా దశాబ్దకాలం నుంచి పదవులకు దూరంగా ఉంటున్నారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆయన మరింత డల్ అయ్యారు. అయితే ఇప్పుడు వంగవీటి రాధా కొత్త సమస్యను ఎదుర్కొంటున్నారు. ఎక్కడికెళ్లినా జనసేన జిందాబాద్ నినాదాలు ఆయన సభల్లో వినిపిస్తుండటం, జనసేన నేతలు ఎక్కువగా పక్కన కనపడుతుండటం చర్చనీయాంశంగా మారింది. వంగవీటి రాధా జనసేనలోనే ఉండటం బెటర్ అని నేరుగా కాపుయువకులు డిమాండ్ చేయడం విన్పిస్తుంది.

ప్రస్తుతం టీడీపీలోనే….

వంగవీటి రాధా ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు. అయితే ఆయన ఇటీవల కాలంలో యాక్టివ్ గా మారారు. వివిధ గ్రామాల్లో పర్యటిస్తున్నారు. ముఖ్యంగా వంగవీటి రంగా విగ్రహావిష్కరణలతో పాటు కాపు సామాజికవర్గం సమావేశాల్లో ఆయన పాల్గొంటున్నారు. కానీ వంగవీటి రాధా ఈ సమావేశాల్లో వింత సమస్యను ఎదుర్కొంటున్నారు. వంగవీటి జిందాబాద్, జనసేన జిందాబాద్ నినాదాలే ఎక్కువగా విన్పిస్తున్నాయి.

అన్ని పార్టీలూ మారి….

వంగవీటి రాధా ఇప్పటికే కాంగ్రెస్, వైసీీపీ, టీడీపీ ల తీర్థం పుచ్చుకున్నారు. ఏపీలో బలమైన సామాజికవర్గానికి బ్రాండ్ అయిన వంగవీటి కుటుంబం పదేళ్లకు పైగానే పదవులకు దూరంగా ఉంది. నాడు వంగవీటి రాధా ప్రజారాజ్యం పార్టీలో చేరిన నాటి నుంచి పదవి అందలేదు. ఓటమి ఎదురవుతుంది. చివరకు మొన్నటి ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో జనసేన, టీడీపీ కలిసి పోటీ చేస్తాయన్న ప్రచారం జరుగుతోంది.

టీడీపీలో ఉంటే….?

టీడీపీలో ఉండే కన్నా జనసేనలోకి వెళ్లి పదవులను పొందడం సులువని కొందరు వంగవీటి రాధాకు సూచిస్తున్నారు. టీడీపీలో ఉంటే సీనియర్ నేతలు ఉన్నారని, జనసేనలో అయితే తాము మాత్రమే ముఖ్య నేతలుగా మెలగ వచ్చని వంగవీటి రాధాకు సన్నిహితులు నూరిపోస్తున్నారు. దీంతో పాటు కిందిస్థాయిలో కూడా కాపు యువకులు జనసేనలో చేరాలని వత్తిడి తెస్తున్నారు. దీంతో వంగవీటి రాధా జనసేనలో చేరి పోటీకి దిగుతారని అంటున్నారు. మరి ఆయన నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.

Tags:    

Similar News