సోలో బతుకే సో బెటరా…?

విశాఖలో ఆ ఎమ్మెల్యే హిస్టరీయే వేరు. ఆయన పూర్వాశ్రమంలో డిఫెన్స్ లో పనిచేశారు. తరువాత విశాఖలో విద్యాసంస్థలను నిర్వహించారు. సేవా కార్యక్రమాలను కూడా పెద్ద ఎత్తున చేపట్టి [more]

Update: 2021-05-17 14:30 GMT

విశాఖలో ఆ ఎమ్మెల్యే హిస్టరీయే వేరు. ఆయన పూర్వాశ్రమంలో డిఫెన్స్ లో పనిచేశారు. తరువాత విశాఖలో విద్యాసంస్థలను నిర్వహించారు. సేవా కార్యక్రమాలను కూడా పెద్ద ఎత్తున చేపట్టి జనంలో మంచి పేరు తెచ్చుకున్నారు. ఆఖరుకు రాజకీయ రంగ ప్రవేశం చేశారు. తెలుగుదేశం పార్టీ తరఫున 2009 ఎన్నికల్లో తొలిసారి పోటీ పడి పరాజ‌యం పాలు అయిన వాసుపల్లి గణేష్ కుమార్ 2014లో గెలిచి సత్తా చాటారు. 2019 ఎన్నికల్లో మరో మారు గెలిచి పట్టు నిలుపుకున్నారు.

తెలివైన నిర్ణయమా…?

ఏపీలో ఇపుడు వైసీపీ అధికారంలో ఉంది. టీడీపీలో ఉన్నా కూడా విపక్ష ఎమ్మెల్యేగా మిగిలిపోవడం తప్ప ఉద్ధరించేది ఏదీ లేదు. అందుకే వాసుపల్లి గణేష్ కుమార్ తెలివిగా అధికార వైసీపీలోకి వచ్చేశారు అంటారు. ఇపుడు అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఆయన ఉంటూ ప్రభుత్వ కార్యక్రమాలను తన నియోజకవర్గంలో తన చేతుల మీదుగా అమలు చేస్తున్నారు ఆ విధంగా చూస్తే మిగిలిన టీడీపీ ఎమ్మెల్యేల కంటే కూడా ఆయన ముందు చూపుతో వ్యవహరించారు అని చెప్పుకోవాలి. మిగిలిన టీడీపీ ఎమ్మెల్యేలు ఉత్సవ విగ్రహాలుగా ఉంటే అక్కడ వైసీపీ ఇంచార్జిలే కధ మొత్తం నడిపిస్తున్నారు.

సొంత గుర్తింపు….

ఇక వాసుపల్లి గణేష్ కుమార్ రాజకీయాలతో పాటు సేవా కార్యక్రమాలను కూడా చేప‌ట్టి జనాదరణ చూరగొంటున్నారు. అంతే కాదు తన నియోజకవర్గం ప్రజలతో నేరుగా సంబంధాలు పెట్టుకుంటున్నారు. మంచికైనా చెడుకైనా సరే ప్రజల ముంగిట వాలే ఏకైక ఎమ్మెల్యేగా ఆయన నిలిచారు. దాంతో జనాలకు వాసుపల్లి గణేష్ కుమార్ మావాడు అన్న భావన కలుగుతోంది. ఆయనకు కూడా కావాల్సింది ఇదే. రేపటి రోజున తాను సొంత గుర్తింపుతో జనంలోకి వెళ్తే రాజకీయ పార్టీలు తన వెంట లేకపోయినా నెగ్గగలను అన్న ధీమా కోసమే ఆయన జనాలతో నిరంతం ఉంటూ సైలెంట్ గా పనిచేసుకునిపోతున్నారు అంటున్నారు.

అపుడే నిర్ణయం …?

వాసుపల్లి గణేష్ కుమార్ ఇపుడు వైసీపీలో ఉన్నారు. మరో మూడేళ్ళలో జరిగే ఎన్నికల నాటిని ఆయన వైసీపీ నుంచే పోటీ చేస్తారా అంటే ఇపుడే చెప్పడం కష్టం అన్న మాట కూడా ఉంది. అపుడు రాష్ట్ర రాజకీయాలను బట్టి ఆయన డెసిషన్ ఉండే అవకాశాలే హెచ్చు అంటున్నారు. అపుడు కూడా ఇదే రకమైన జనాదరణతో వైసీపీ ఉంటే వాసుపల్లి గణేష్ కుమార్ కచ్చితంగా టికెట్ తెచ్చుకుంటారు. ఒక వేళ టీడీపీ మెరుగుపడితే మళ్ళీ మాతృ సంస్థ నుంచి పోటీ చేస్తారు. ఈ రెండు పార్టీలూ టికెట్ కాదన్నా కూడా తాను ఇండిపెండెంట్ గా పోటీ చేయడానికి అవసరం అయిన సరకూ సరంజామాను ఆయన ఇప్పటి నుంచే సమకూర్చుకుంటున్నారు అంటున్నారు. మొత్తానికి సోలోగా ఎదగడమే తన ఆలోచనగా వాసుపల్లి చెప్పకనే చెబుతున్నారు.

Tags:    

Similar News