బాబుని తిడితే జగన్ పదవులు ఇస్తారా… ?

చంద్రబాబుకు ఒక అలవాటు ఉంది. తన ప్రత్యర్ధులను గట్టిగా ఎవరైతే తిడతారో వారిని దగ్గర చేర్చుకోవడం, పదవులు వారికే ఇవ్వడం బాబు మార్క్ పాలిటిక్స్. అయితే జగన్ [more]

Update: 2021-09-09 00:30 GMT

చంద్రబాబుకు ఒక అలవాటు ఉంది. తన ప్రత్యర్ధులను గట్టిగా ఎవరైతే తిడతారో వారిని దగ్గర చేర్చుకోవడం, పదవులు వారికే ఇవ్వడం బాబు మార్క్ పాలిటిక్స్. అయితే జగన్ దగ్గర అలాంటివి సాగుతాయా. జగన్ లొంగుతారా, ఇంతకీ జగన్ కి ఇలా అయిన దానికీ కానిదానికీ ప్రత్యర్ధులను తిట్టడం ఇష్టమా? అన్నది వైసీపీలో చర్చ. వైసీపీలో దశాబ్దాలుగా ఉంటున్న వారు కానీ జగన్ కి అతి సన్నిహితమని చెప్పుకుంటున్న వారు కానీ ఆయన మనసు ఏంటో పూర్తిగా ఎప్పటికీ తెలుసుకోలేరనే చెబుతారు. ఎందుకంటే జగన్ చాలా గుంభనంగా ఉంటారు. అయితే టీడీపీలో నుంచి వైసీపీలోకి చేరిన కొందరు తమ్ముళ్ళు మాత్రం అతి ఉత్సాహం చూపిస్తూ జగన్ వద్ద మార్కులు కొట్టేయాలని చూస్తున్నారు. అందులో వాసుపల్లి గణేష్ కుమార్ ఒకరు.

దుకాణం బంద్ అట…

తాజాగా విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అయితే చంద్రబాబుని దారుణంగా విమర్శించారు. బాబుకు విశ్వసనీయత లేదని, ఆయన పార్టీ ప్రభలు కూడా మసకబారుతున్నాయని సెటైర్లు వేశారు. జనాలు టీడీపీని ఎపుడో మరచిపోయారని కూడా ఆయన గట్టిగానే మాట్లాడారు. ఏపీలో మాటకు నిలబడే నేత జగన్ ఒక్కరేనని ఆయన పట్ల జనం పూర్తి విశ్వాసం ప్రకటిస్తున్నారని కూడా వాసుపల్లి చెప్పుకొచ్చారు. నిజానికి వాసుపల్లి ఇంతలా టీడీపీని తెగనాడడానికి కారణాలు ఉన్నాయి. ఆయన ఈ మధ్య వైసీపీ వారికి కోపం తెప్పించారు. మాజీ తమ్ముళ్లను వెనకేసుకుంటూ వైసీపీ లోని ఒక వర్గం ఆగ్రహానికి గురి అయ్యారు.

నమ్ముతారనేనా ..?

వాసుపల్లి గణేష్ కుమార్ టీడీపీ నుంచి వైసీపీలో చేరినా కూడా ఆయనలో పాత వాసనలు పోలేదని విశాఖ సౌత్ లోని ఆయన వ్యతిరేక వర్గం మీడియా ముఖంగానే విమర్శలు చేస్తూ వస్తోంది. ఆయన తన సొంత ప్రయోజనాలను కాపాడుకోవడం కోసమే వైసీపీ జెండా ఎత్తారు తప్ప ఆయన మళ్లీ టీడీపీ వైపు చూసే అవకాశాలు ఉన్నాయని కూడా వారు చెప్పుకొచ్చారు. మరో వైపు ఆయన ఆమధ్య తన అనుచరుల అక్రమ కట్టడాలను జీవీఎంసీ కూలగొట్టడంతో విమర్శలు చేశారు. అవి కూడా వైసీపీకి వ్యతిరేకంగానే అని వ్యతిరేక వర్గం ప్రచారం చేసింది. ఈ నేపధ్యంలో వాసుపల్లి గణేష్ కుమార్ శీలపరీక్షకు సిద్ధమయ్యారని చెబుతున్నారు.

చంద్రబాబునే అలా …?

ఏకంగా టీడీపీ అధినేత చంద్రబాబునే టార్గెట్ గా చేసుకుని వాసుపల్లి గణేష్ కుమార్ తాజాగా విమర్శలు చేయడం ఆశ్చర్యంగానే ఉంది. ఆయన వైసీపీలో చేరిన కొత్తల్లో ఇలాగే చంద్రబాబు మీద జోరుగా కామెంట్స్ చేసేవారు. ఆ తరువాత తగ్గిపోయారు. ఇపుడు మళ్ళీ బాబుని ఆయన విమర్శిస్తున్నారు అంటే అందులో రాజకీయమే ఎక్కువగా ఉందని అంటున్నారు. ఆయన వైసీపీ పెద్దలకు బాగా దగ్గర కావాలనే ఇలా చేస్తున్నారని కూడా అంటున్నారు. అయితే జగన్ ఇలా చేసిన నేతలను ఆదరించిన దాఖలాలు అయితే లేవు అనే అంటున్నారు. ఆయన పార్టీ కోసం పనిచేసేవారిని, ప్రధానంగా నమ్మకంగా ఉండేవారిని, నిజయతీగా మాట్లాడేవారినే చేరదీస్తారు అని అంటున్నారు. బాబు స్కూల్ నుంచి వచ్చిన వారికి జగన్ని మెప్పించడం సాధ్యం కాదని కూడా అంటున్నారు.

Tags:    

Similar News