విజయసాయిరెడ్డి ఆ పనిచేస్తారా?

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆ పార్టీలో జగన్ కి కుడి భుజం. ఆయన కూడా సాయిరెడ్డి మాటలకు విలువ ఇస్తారని అంటారు. ఇక విశాఖ రాజకీయాలను గుప్పిట [more]

Update: 2021-01-18 06:30 GMT

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆ పార్టీలో జగన్ కి కుడి భుజం. ఆయన కూడా సాయిరెడ్డి మాటలకు విలువ ఇస్తారని అంటారు. ఇక విశాఖ రాజకీయాలను గుప్పిట పట్టిన విజయసాయిరెడ్డి టీడీపీని ఎక్కడికక్కడ ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. ఈ నేపధ్యంలో విజయసాయిరెడ్డిని నాన్ లోకల్ అంటూ ప్రచారం చేసిన టీడీపీ నేతలు వైసీపీలో చిచ్చు పెట్టే ప్రయత్నాలు కూడా చేశారు. అయితే ఇపుడు ఏకంగా ఎన్నికల కుస్తీ పోటీలకు రమ్మని అహ్వానిస్తున్నారు. విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యుడు. ఆయన పదవీ కాలం రెండేళ్లకు పైగా ఉంది.

ఎంపీగానట….?

విశాఖ ఎంపీగా పోటీ చేయ్ విజయసాయిరెడ్డి అంటూ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు తాజాగా సవాల్ చేస్తున్నారు. విశాఖ ప్రజల మీద స్వారీ చేయడం కాదు, జనంలో ఆదరణ ఉంటే పోటీకి దిగాలని రెచ్చగొడుతున్నారు. ఎక్కడ నుంచో వచ్చిన విజయ‌సాయిరెడ్డి విశాఖ రాజకీయాల్లో కేంద్ర బిందువు కావడమేంటని ప్రశ్నించారు. ఆయన ప్రజలు ఎన్నుకున్న నేత అసలు కాడని స్పష్టం చేస్తున్నారు. కాదు కూడదూ తానే అసలైన జన నేతను అని విజయ‌సాయిరెడ్డి భావిస్తే ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలని అయ్యన్న పాత్రుడు చాలెంజి చేశారు.

అదే అర్హతగా..?

విశాఖ ఎంపీగానైనా లేక విశాఖ తూర్పు నుంచి పోటీ చేసి గెలిచి అపుడు విజయ‌సాయిరెడ్డి తమతో మాట్లాడాలని తెలుగు తమ్ముళ్ళు అంటున్నారు. విజయ‌సాయిరెడ్డి పెద్దల సభలో ఒక సభ్యుడు. ఆయనకు డైరెక్ట్ గా ప్రజలతో సంబంధాలు లేవని అయ్యన్నపాత్రుడు ఎద్దేవా చేస్తున్నారు. ఆయనను జగన్ ఇక్కడకు పంపిస్తే జిల్లా రాజకీయాల్లో వేలు పెట్టడం కాదని హాట్ కామెంట్స్ చేస్తున్నారు. విశాఖ ప్రజలు విజయసాయిరెడ్డిని నమ్మి గెలిపిస్తే తాము విమర్శలు చేయమని కూడా అంటున్నారు. విశాఖలో రాజకీయాలు చేయాలంటే అదే అర్హత అన్నట్లుగా తమ్ముళ్ళు విజయ‌సాయిరెడ్డితో సవాల్ చేస్తున్నారు.

ఆ ఆలోచన ఉందా …?

నిజానికి స్వపక్షంలో చర్చలు లీక్ అయినపుడే విపక్షంలో ఉన్న వారు దాన్ని పట్టుకుని గట్టిగా మాట్లాడుతూంటారు. విజయసాయిరెడ్డి విషయం తీసుకుంటే ఆయన పేరు గత ఎన్నికల వేళనే విశాఖ ఎంపీ సీటుకు పరిశీలించారని అంటారు. అయితే మొత్తం ఏపీలో పార్టీ గెలుపు వ్యూహాలను రచిస్తూ ముందుకు సాగుతున్న విజయ‌సాయిరెడ్డి పోటీ చేయడానికి ఇబ్బంది అవుతుందని భావించారని అంటారు. ఇక 2024 ఎన్నికల్లో మాత్రం విశాఖ సీటుని బయట వారికి ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వరాదని ఇప్పటికే వైసీపీ డిసైడ్ చేసింది అని చెబుతారు. ఆ లెక్కన చూస్తే జగన్ నమ్మిన బంటు విజయసాయిరెడ్డి పోటీకి దిగుతారా అన్న చర్చ కూడా ఉంది. మొత్తానికి అయ్యన్న పాత్రుడు సవాల్ కాదు కానీ సిట్టింగ్ వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు మరో చాన్స్ లేకుండా చేస్తున్నారు అన్న బాధ ఆయన సన్నిహితుల్లో ఉందిట.

Tags:    

Similar News