విశాఖకు కూడా ఏలూరు తరహా ముప్పు ?

ఇప్పటికి ఎన్నో సార్లు పర్యావరణవేత్తలు మొత్తుకున్నదే ఇది. కాలుష్యం పడగ నీడలో ఆధునిక మానవుల బతుకులు సాగుతున్నాయని అవి చిమ్మే కాలకూటమే అన్నంగా నీరుగా మనిషి శరీరం [more]

Update: 2020-12-18 12:30 GMT

ఇప్పటికి ఎన్నో సార్లు పర్యావరణవేత్తలు మొత్తుకున్నదే ఇది. కాలుష్యం పడగ నీడలో ఆధునిక మానవుల బతుకులు సాగుతున్నాయని అవి చిమ్మే కాలకూటమే అన్నంగా నీరుగా మనిషి శరీరం మొత్తం లోపలికి వెళ్ళిపోతున్నాయని కూడా హెచ్చరిస్తున్నారు. ఇపుడు ఏలూరులో ప్రమాదకరమైన అలారం మోగింది. అక్కడ అంతు చిక్కని వింత వ్యాధి అని చెబుతున్నా కూడా నీటి కాలుష్యం మూలంగానే జనాలు ప్రాణాంతకమైన పరిస్థితులకు వెళ్తున్నారు అని పర్యావరణ అధ్యయనకారులు నిర్ధారిస్తున్నారు. తాగే నీటిలో ప్రమాదకరమైన రసాయనాలు ఉన్నాయని కూడా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దాంతో ఇపుడు అందరి దృష్టి ఏపీలో మెగానగరంగా ఉన్న విశాఖ మీద పడుతోంది.

డేంజర్ జోన్ లో….

విశాఖ ఇప్పటికే ఈ విషయంలో డేంజర్ జోన్ లో ఉందని అంటున్నారు. దేశంలోని మునిసిపాలిటీ నీరు ద్వారా మహా నగరాలలోని జనాలు అనారోగ్యం పాలు అవుతున్నారు. ఇలా 26 నగరాలు డేంజర్ లో ఉంటే అందులో విశాఖ ఒకటి అని ఇప్పటికే ఒక నివేదిక ఉంది. క్వాలిటీ కంట్రోల్‌ కౌన్సిల్‌ వెల్లడించిన తాజా సమాచారం ప్రకారం 33శాతం నీటి నమూనాలు ఈ 26 నగరాలలో సేకరించగా ఆ నీటిలో హై లెవెల్‌లో లీడ్‌ శాతం ఉందని తేల్చింది అని అంటున్నారు. ఈ విధంగా మానవ శరీరంలో ప్రమాదక‌రమైన శాతంలో లీడ్ తాగే నీటితో పాటు చేరుతోందని నివేదికలు చెబుతున్నాయి. ఏలూరు లో జనం తాగిన నీటిలో కూడా లీడ్ శాతాన్ని గుర్తించారు.

గుక్క తాగితే ముప్పే….

ఇక విశాఖలో ఈ నీటినే జనం తాగుతున్నారు. అందువల్ల విశాఖలో ఉన్న లక్షలాది మంది జనాభాకు కూడా ఏలూరు లాంటి నీటి ముప్పు తప్పదని అంటున్నారు. పోర్టుల నుంచి వచ్చే కాలుష్యంతో పాటు, విశాఖ నగరపాలన సంస్థ నుంచి వదిలే చెత్త, వ్యర్ధ పదార్ధాలు తాగునీటి జలాశయాల్లోకి వెళ్లడంపైన ఇప్పటికే పర్యావరణ వేత్తలు హెచ్చరించారు. అయినా అవి ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ఇక నగరం చుట్టూ ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు పారిశ్రామిక వ్యర్థ జలాలను సముద్రంతో పాటు, తాగు నీటి జల వనరుల్లోకి వదలడం షరా మామూలుగా జరిగిపోతోంది. ఈ నిర్లక్షం వల్ల, ఎటువంటి పర్యవేక్షణ లేకపోవడంవల్ల విశాఖకు అతి పెద్ద నీటి ముప్పు పొంచే ఉందన్నది నిపుణులు ఇపుడు హెచ్చరిస్తున్నారు.

శుద్ధి చేసేది లేదుగా….?

విశాఖ వంటి చోట్ల విచ్చలవిడిగా వదులుతున్న వ్యర్ధ పధార్ధాల మూలంగా తాగే నీరు కలుషితం అవుతోంది అని మాజీ ఐఎఎస్‌ అధికారి ఇఎఎస్‌ శర్మ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీని మీద ఎన్ని ఉద్యమాలు చేసినా పాలకులు పట్టించుకోవడం లేదని కూడా ఆయన‌ అంటున్నారు. ఏలూరు అనుభవాల‌తో విశాఖ మీద దృష్టి సారించాలని శర్మ ముఖ్యమంత్రి జగన్ కి తాజాగా లేఖ రాయడంతో నగరవాసులు సైతం భయందోళలనలకు గురి అవుతున్నారు. ఇక విశాఖలోని తాగు జలాశయాలలో వ్యర్ధాలు పేరుకుపోయి చెడిపోయిన నీరే తిరిగి తాగు నీరుగా మునిసిపాలిటీల నుంచి సరఫరా అవుతోంది. ఈ నీటిని శుద్ధి చేసి అందించే ప్రక్రియ కూడా ఏదీ లేదని కూడా అంటున్నారు. దీంతో విశాఖ వంటి నగరాలలో తాగు నీటిలో రసాయనాలు కలసిపోతున్నాయని అంటున్నారు.

Tags:    

Similar News