రాజధాని నెత్తిన పిడుగు

రాజధాని విషయంలో మరీ ఊహించని మలుపు అయితే ఏమీ కాదు కానీ, ఇంత త్వరగా ఎలాంటి వాతావరణ సూచీలు లేకుండా పడిన పిడుగుకు తాడేపల్లి నుంచి ఆ [more]

Update: 2019-12-18 08:00 GMT

రాజధాని విషయంలో మరీ ఊహించని మలుపు అయితే ఏమీ కాదు కానీ, ఇంత త్వరగా ఎలాంటి వాతావరణ సూచీలు లేకుండా పడిన పిడుగుకు తాడేపల్లి నుంచి ఆ చివర అమరావతి దాకా కదిలి పోయింది. చిన్నపుడు బెజవాడ ఇంద్రకీలాద్రిపై నుంచి చూస్తే ఏటికి అవతల అంతా చీకటిగా ఉండేది. పగలు చూస్తే పచ్చటి తివాచిలా ఉండేది. ఐదేళ్ల క్రితం వరకు కృష్ణా నదికి అవతల రాత్రి వేళ చిక్కటి చీకట్లు కనిపించేవి. ఈ రోజు ముఖ్యమంత్రి ప్రకటన చూసిన తర్వాత ఇకపై కూడా అక్కడ అంతే అవ్వొచ్చేమో. కాకుంటే పగటి పూట పచ్చటి పొలాలు మాత్రం కనిపించవు. బీళ్లువారిపోయి, పిచ్చి తుమ్మ పెరగడం ఎప్పుడో మొదలైంది. 2014 జూన్ నుంచి డిసెంబర్ వరకు రోజుకో ఊరు తిరగడం, ఇక్కడే రాజధాని అని వార్తలు రాయడం, ఆ ఊళ్లో లైవ్ పెట్టడం ఇదేపని. ఆ ఏడాది డిసెంబర్లో ఇలాంటి పిడుగే ఏటి ఒడ్డున పడింది. కృష్ణా-గుంటూరు మధ్య రాజధానిలో మెల్లగా స్పష్టత ఇచ్చాక పెనుమాక మొదలు రాయపూడి వరకు ఓ పూట మొత్తం ఊళ్లకు ఊళ్ళు బయటకు వచ్చి ప్రభుత్వ నిర్ణయాన్ని గట్టిగా వ్యతిరేకించాయి. అనూహ్యంగా నెలల వ్యవధిలోనే భూ సమీకరణ పద్ధతిలో 33వేల ఎకరాల భూమి ప్రభుత్వ పరం అయ్యింది. దాదాపు 8వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని రాజధాని ప్రాంతంగా గుర్తిస్తూ సిఆర్‌డిఏను ఏర్పాటు చేశారు. భూమి లేని వాళ్లకు పెన్షన్లు, భూమికి భూమి, ఏటా కౌలు చెల్లింపు ఇలా రకరకాల పద్ధతుల్లో రాజధానికి అవసరమైన కోర్‌ క్యాపిటల్‌ భూమి పొగయ్యింది. ఈ మధ్యలో చాలా మంది దళారులు కూడా లాభ పడ్డారు. గ్రామ కంఠం భూములు తమవిగా చూపి చాలామంది రెవిన్యూ సిబ్బంది, జర్నలిస్టులు లాభ పడ్డారు. దీనిని ఎప్పటికీ ఏ యంత్రాంగం నిరూపించలేదు.

ఎవరి రాజధాని అమరావతి…?

29 గ్రామాల పరిధిలో 34వేల ఎకరాల విస్తీర్ణంలో ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం చేస్తామని 2015 జనవరి 1 నుంచి అప్పటి ప్రభుత్వం చెబుతూ వచ్చింది. 29 గ్రామాల పరిధిలో ఉండవల్లి, పెనుమాక అప్పటికే విజయవాడ నగరంలో అంతర్భాగాలు. కృష్ణా నది అవతలి వైపు ఉన్న ఊళ్లలో తాడేపల్లి, ఉండవల్లి, పెనుమాకలలో రెడ్ల ఆధిపత్యం ఎక్కువ. తర్వాత క్రమంలో కాపులు ఉంటారు. ఈ మూడు ఊళ్లలో కమ్మ సామాజికవర్గం తక్కువ. వెంకటపాలెం నుంచి మళ్ళీ కమ్మ పల్లెలు మొదలవుతాయి. తాడేపల్లి ప్రాంతాన్ని మినహాయించి రాజధాని నిర్మాణ ఎంపిక జరిగిందో అదే ఇప్పుడు కీలక నగరంగా మారింది. తాడేపల్లి, పాతురు, కుంచనపల్లి, రెవేంద్ర పాడు, ఉండవల్లి ఇప్పుడు అనూహ్యంగా రాజధాని కోసం భూములిచ్చిన 29 గ్రామాలకు మించి అభివృద్ధి చెందాయి. విజయవాడ-గుంటూరు మధ్య అటు ఇటుగా ఓ 60వేల ఫ్లాట్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. గత ఆరు నెలలుగా ఎప్పుడేం జరుగుతుందా? అని బిక్కచచ్చి పోయిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాన్ని పూర్తిగా నేలమట్టమైపోయింది. ఈ నిర్మాణాలు, అవసరమైన పెట్టుబడులు, వాటి లాభాలు అన్ని కొందరి ప్రయోజనాలకే అన్న భావన ప్రస్తుత ప్రభుత్వంలో బలంగా ఉంది. అందుకే కొత్త ప్రభుత్వం ఏర్పడన వెంటనే ఇసుక మీద తీవ్రమైన ఆంక్షలు విధించింది.

భూమి ఎవరిది…… రాజధాని ఎవరిది…?

రాజధాని, రాష్ట్ర ప్రభుత్వం అనేవి 3-4 నియోజకవర్గాల కోసమో, 29 గ్రామాల కోసం కాదు. రాష్ట్రం మొత్తానికి సంబంధించిన అంశాలనే సంగతి అప్పట్లో విస్మరించారు. అమరావతి ప్రాంతాన్ని ఎంపిక చేయడం మొదలుకుని, నిర్మాణం వరకు అంతా టీడీపీ అంతర్గత వ్యవహారం మాదిరి గుట్టుగా సాగింది. ఇప్పుడు మూడు., నాలుగు నియోజక వర్గాల కోసం రాష్ట్రం మొత్తాన్ని ఫణంగా పెట్టకూడదని ముఖ్యమంత్రి జగన్‌ చెబుతున్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగకపోతే అనర్ధాలు తప్పవని అందుకే రాష్ట్రానికి మూడు చోట్ల అభివృద్ధిని వికేంద్రీకరించాలని భావిస్తున్నట్లు అసెంబ్లీ లో ప్రకటించారు. నిజానికి రాజధానికి భూములు ఇచ్చిన 34వేల ఎకరాలలో మూడో వంతు లబ్ధిదారులకు చెందే భూమి. ఈ 29 గ్రామాల్లో భూములిచ్చిన రైతులు ఎవరు అంతిమంగా లబ్ది దారులు ఎవరనేది జగమెరిగిన సత్యం. రాజధాని ప్రాంతం, వేల కోట్ల రుపాయల ప్రభుత్వ పెట్టుబడులు ఎప్పటికీ ఓ సామాజిక వర్గం చెప్పుచేతల్లో ఉండిపోవడం అనేది జగన్మోహన్ రెడ్డికి ఏ మాత్రం రుచించని అంశం. రాజధానిలో అభివృద్ధి చేసిన భూమి పోగా 8 వేల ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ప్రభుత్వం వద్ద ఉంటుంది. దానిని విక్రయించినా రాజధాని నిర్మాణాలకు అవసరమైన డబ్బులు సులభంగా వచ్చేస్తాయి. ఎకరాకు నాలుగైదు కోట్ల లెక్క వేసి 40-50వేల కోట్లను వచ్చే పదేళ్ల లో సంపాదించడం పెద్ద కష్టం కాదని మాజీ సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణలు తరచూ
చెప్పేవారు. జనాభా పెరిగినట్లు భూమి ఎప్పుడు పెరగదు కాబట్టి భూమి విలువ క్రమంగా పెరుగుతూ, రాజధాని నిర్మాణానికి అవసరమైన డబ్బు అదే సంపాదించి పెడుతుందనే రియల్ ఎస్టేట్ తరహా లెక్కల్లో ఈ తతంగం సాగింది.

తరతరాల లబ్ది….

ఆంధ్రుల రాజధాని అమరావతి నామమాత్రం చేసి ఉత్తరాంధ్ర., రాయలసీమలకు వికేంద్రీ కరించడం ద్వారా చంద్రబాబును ఇరకాటంలోకి నెట్టేశారు జగన్. ఇప్పుడు విశాఖ, కర్నూలు వద్దంటే ఆ ప్రాంతాలలో టీడీపీ ఇరుకున పడుతుంది. అమరావతికే ఎందుకు మొగ్గు పుతున్నారనే ప్రశ్నలకు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. రాజధాని కోసం భూముల్ని బలవంతంగానో, బెదిరించో, బతిమాలో, మభ్య పెట్టో రకరకాల పద్ధతుల్లో సేకరించారు. “మెట్టకో లెక్క, మాగాణికో లెక్క, జారీబుకు ఓ లెక్క, లంకకు ఓ లెక్క ” అంటూ అప్పటి ప్రభుత్వం చెబుతూ వచ్చేది. భూమి మీద యాజమాన్య హక్కులు పక్కన పెడితే భూమి, సాగు మీద ఆధార పడి బతికే వాళ్ళ గురించి ఏ దశలోనూ పట్టించుకోలేదు. ఏ పత్రిక రాయలేదు. 2014 డిసెంబర్ లో మందడం గ్రామ శివార్లలో ఓ కొలిమి, వ్యవసాయ పనిముట్లు తయారు చేసే వెల్డర్ ఉండేవాడు. 2016లో అక్కడే ఓ బార్ అండ్ రెస్టారెంట్ వెలిసింది. ఆ ఊళ్లలో చాలా మంది ఆడవాళ్ళు తోటమాలీలుగా, స్వీపర్లుగా మారిపోయారు. మీడియాకు వీళ్ళ గురించి ఆలోచించే తీరిక, ఓపిక ఉండవు.

కులం వర్సెస్ కులం….

జగన్మోహన్ రెడ్డి అమరావతి ప్రాంతాన్ని వ్యతిరేకించడానికి బోలెడు కారణాలు ఉంటాయి. అవి కూడా కులం ఆధారంగా ఉంటాయి. 34వేల ఎకరాల భూమి యజమానులైన రైతులలో కులాల వారీ గా జాబితా ఎప్పుడు బయటకు రాదు. రైతుల వాటాగా ఇచ్చిన ఫ్లాట్లలో చాలా వరకు 2018 నాటికే చేతులు మారిపోయాయి. 2018లో బాలకృష్ణ కుమార్తె నేలపాడు గ్రామంలో చదరపు గజం 45 వేల చొప్పున భూమిని కొనుగోలు చేశారు. ఈ విక్రయం జరిగే సమయానికి ఆ ప్రాంతంలో కనీస మౌలిక సదుపాయాలు కూడా లేవు. కానీ భవిష్యత్తు మీద ముందు చూపుతో రాజధాని ప్రాంతంలో కీలకమైన ప్రదేశాల్లో భూముల్ని దక్కించుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, అధికారుల్ని కూడా ఈ తంతులో భాగస్వాముల్ని చేయడం ద్వారా భవిష్యత్తులో కూడా ఎవరు ప్రశ్నించలేని విధంగా ఓ పథకం ప్రకారం వ్యవహరించారు. నామ మాత్రపు ధరకు సొంతింటి స్థలాలను కేటాయించాలని చంద్రబాబు నిర్ణయించారు. ఇందులో అఖిల భారత సర్వీస్ అధికారుల సొసైటీలో అధికారులు మాత్రం భూముల్ని రిజిస్టర్‌ చేయించుకున్నారు. జర్నలిస్ట్ సొసైటీకి కూడా భూ కేటాయింపు చేశారు. జర్నలిస్టులు ప్రభుత్వం ఇచ్చిన భూమితో రియల్‌ ఎస్టేట్ కంపెనీలతో కలిసి లాభపడాలనుకుని బోల్తా పడ్డారు. గజిటెడ్ అధికారులు, ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు ధర ప్రకటించినా భూకేటాయింపు జరగలేదు.

ఇప్పుడేం జరుగుతుంది….?

కార్యనిర్వాహక రాజధానిగా విశాఖపట్నాన్ని ఎంచుకోవడంలో ముఖ‌్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరించారు. రాజధానిని ఏ దొనకొండకో తీసుకెళితే అనవసరమైన విమర్శల్ని ఎదు ర్కోవాల్సి వచ్చేది. హైకోర్టును కర్నూలు తరలించడం ద్వారా రాయలసీమకు మేలు చేసిన వ్యక్తిగా జగన్‌ నిలిచిపోతారు. ఇక విశాఖ వంటి కాస్మోపాలిటిన్ నగరాన్ని పరిపాలనా కేంద్రం చేస్తే అన్నిరకాల అనుకూలతలు ఉంటాయి. అక్కడి వాతావారణం. పరిశ్రమలు, పోర్టులకు తోడు పరిపాలనా రాజధాని కూడా జతవుతుంది. ఇది ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో జగన్‌ పట్టును పెంచు తుంది. ఇక కృష్ణా, గుంటూరులో ఎదురయ్యే కమ్మ సామాజిక వర్గం ఆధిపత్యానికి పూర్తిగా చెక్‌ పెట్టినట్లవుతుంది. తాత్కలికంగా కొంత అలజడి రేగినా పెద్దగా జనం నుంచి వ్యతిరేకత మాత్రం రాకపోవచ్చు. అమరావతి నిర్మాణం తమ సొంత వ్యవహారంగా తెలుగుదేశం పార్టీ, దాని అనుకూల వర్గాలు భావించాయి. 13 జిల్లాలకు మధ్యలో ఉండే ప్రాంతంలో రాజధాని నిర్మాణం జరుగుతుందని చెప్పినా, మిగిలిన ప్రాంతాలకు దానితో భావోద్వేగపూరిత సంబంధాలేవి ఏర్పడలేదు. భూము లిచ్చిన రైతులు సింగపూర్‌ లెవల్లో తమ జీవితాలు మారిపోతాయనే ఊహల్లో నాలుగేళ్లుగా విహరిస్తున్నారు. తాజాగా లెజిస్లేటివ్ క్యాపిటల్‌- అసెంబ్లీలు మాత్రమే అమరావతి ప్రాంతానికి పరిమితమయ్యే పరిస్థితుల్లో వేల ఎకరాల సాగు భూమి, అందునా ఏడాది పొడవున పంటలు పండే సారవంతమైన నేలను సద్వినియోగం చేసే కార్యాచరణ కూడా ప్రభుత్వం ప్రకటించాల్సి ఉంటుంది. మొత్తం మీద ఆంధ్రాకు మూడు రాజధానుల వ్యవహారంలో జరుగుతున్నది కులం వర్సెస్ కులం. క్లుప్తంగా చెప్పాలంటే కమ్మ సామాజిక వర్గం ఆర్ధక మూలాలను దెబ్బతీసే రెడ్డి మంత్రాంగం. మిగిలిన వారిది ఎప్పట్లాగే ప్రేక్షక పాత్ర.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News