వెంకట రమణా.. గోవిందా.. గోవిందా

రాజకీయాల్లో ఉచ్చనీచాలుండవనేది జగమెరిగిన సత్యం. తన పర భేదాలు కూడా ఉండవు. న్యాయస్థానం వేదికగా గడచిన కొన్ని సంవత్సరాలుగా రాజకీయం నడుపుతున్నాయి ఆంధ్రప్రదేశ్ లో పార్టీలు. ప్రజాక్షేత్రంలో [more]

Update: 2021-03-29 05:00 GMT

రాజకీయాల్లో ఉచ్చనీచాలుండవనేది జగమెరిగిన సత్యం. తన పర భేదాలు కూడా ఉండవు. న్యాయస్థానం వేదికగా గడచిన కొన్ని సంవత్సరాలుగా రాజకీయం నడుపుతున్నాయి ఆంధ్రప్రదేశ్ లో పార్టీలు. ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాల్సిన అనేక అంశాలను అధికార, ప్రతిపక్షాలు కోర్టుల ముంగిట్లో పెడుతున్నాయి. న్యాయం కోరడం తప్పేమీ కాదు. కానీ నిజమైన ప్రజాప్రయోజనం లేకుండా ఆధిపత్య నిరూపణ కోసం కోర్టు మెట్టెక్కడమే విచారకరం. పైపెచ్చు సింగిల్ జడ్జి బెంచ్ ఇచ్చిన తీర్పు పై ధర్మాసనం , మళ్లీ ధర్మాసనం తీర్పుపై సుప్రీం కోర్టు ఇలా ప్రతి ఇష్యూని ఎడతెగని వివాదం చేస్తున్నాయి. తమకు వ్యతిరేకంగా తీర్పు వస్తే ప్రత్యక్షంగా, పరోక్షంగా న్యాయమూర్తులనూ బదనామ్ చేస్తున్నాయి. రాజ్యాంగ వ్యవస్థల పట్ల కనీస గౌరవం లేని రాజకీయం ఆంధ్రప్రదేశ్ లో నెలకొంది.

జగన్ కు సుప్రీంకోర్టు నుంచి….

తాజాగా అధికార పక్షానికి, ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి సుప్రీం కోర్టు నుంచి ఎదురుదెబ్బ తగిలింది. ఇంతటి అవకాశాన్ని ఎలా వినియోగించుకోవాలనే కోణంలో తెలుగుదేశం పార్టీ మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తోంది. అనవసర వివాదాన్ని వెలికి తీసి ముఖ్యమంత్రి హోదాలో జగన్ మోహన్ రెడ్డి దూకుడు కనబరిచారు. ఫలితం ఏదైనా ఫర్వాలేదు, సంగతి చూడాల్సిందేననుకున్నారు, ప్రతికూలంగా పరిణమించింది. సుప్రీం కోర్టు కాబోయే ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణపై ఎక్కుపెట్టిన ఆరోపణాస్త్రాలకు పస లేదని న్యాయస్థానం తేల్చేసింది. అవాస్తవాలతో కూడిన దురుద్దేశపూరిత ఆరోపణగా అంతర్గత విచారణలో తేలినట్లు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి ప్రకటించారు. దాంతో వివాదం ముగిసిపోయింది. ఎన్వీరమణ ప్రధాన న్యాయమూర్తి కావడానికి సాంకేతికంగా అవరోధాలు తొలగిపోయాయి. ఈ అంశాన్ని అంత సింపుల్ గా వదిలేయడమేనా? అన్న ప్రశ్న ప్రస్తుతం తెలుగుదేశాన్ని తొలిచేస్తోంది.

న్యాయస్థానమే ఉపేక్షిస్తే…

దురుద్దేశ పూరితంగా న్యాయస్థానాలు, న్యాయమూర్తుల పరువుకు భంగం కలిగిస్తే కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవడానికి చట్టాలు అనుమతిస్తున్నాయి. ప్రజాక్షేత్రంలో న్యాయస్థానాలు విశ్వాసం కోల్పోవడానికి, ప్రతిష్ఠ దెబ్బతినడానికి ప్రయత్నించినా చర్యలు తీసుకోవచ్చు. ముఖ్యమంత్రి జగన్ చేసిన ఆరోపణలు ఈ రెండింటి పరిధిలోకి వస్తాయి. అయితే గతంలోనే ముఖ్యమంత్రి జగన్ పై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలంటూ పిటిషన్ వేసేందుకు అనుమతి ఇవ్వమని అశ్వని కుమార్ అనే న్యాయవాది అటార్నీ జనరల్ ను అభ్యర్థించారు. ఆ లాయర్ బీజేపీకి సానుకూలంగా ఉండే వ్యక్తి. అప్పటికి సుప్రీం కోర్టు పరిశీలనలో ఉంది కాబట్టి పిటిషన్ అనవసరమనే కోణంలో అటార్నీ జనరల్ తోసి పుచ్చారు. ఇప్పుడు కేసు తేలిపోయింది. సుప్రీం కోర్టు పరిశీలన పూర్తయింది. అందువల్ల కోర్టు ధిక్కరణ పిటిషన్ వేయడానికి అవరోధాలు ఉండవని తెలుగుదేశం వర్గాలు భావిస్తున్నాయి. అయితే ప్రధాన న్యాయమూర్తి స్థానం సమున్నతమైనది. కేసులతో ఆ వ్యవస్థను శీలపరీక్షకు పెట్టడం సుప్రీం కోర్టు అనుమతించబోదంటున్నారు. నిజంగానే కేసు వేస్తే ప్రధాన న్యాయమూర్తిపై వచ్చిన ఆరోపణలపై వాద ప్రతివాదాలు నడుస్తాయి. మరోసారి పబ్లిక్ డొమెయిన్ లో అన్నీ చర్చనీయమవుతాయి. నిజానిజాల సంగతెలా ఉన్నప్పటికీ అంతటి పెద్ద వ్యవస్థపై ఆరోపణలు ప్రజాక్షేత్రంలో తీవ్రమైన దుమారానికి కారణమవుతాయి. అందువల్ల సుప్రీం కోర్టు ఈ విషయాన్ని ఇంతటితో ముగించాలని భావించి ఉండవచ్చనేది న్యాయ నిపుణుల అభిప్రాయం.

తెదేపా మల్లగుల్లాలు..

తెలుగుదేశం పార్టీ ఇప్పుడొక డైలమాను ఎదుర్కొంటోంది. కేసు వేసేందుకు తగినంత ప్రాతిపదిక ఉంది. కానీ ప్రధాన న్యాయమూర్తి పై మళ్లీ చర్చ మొదలవుతుంది. ఇదేమంత గౌరవ ప్రదమైనది కాదు, శ్రేయస్కరం కూడా కాదు. గతంలో జగన్ మోహన్ రెడ్డి సైతం కేసు తనకు అనుకూలంగా వస్తుందనే ఉద్దేశంతో లేఖ రాయలేదు. ప్రమాణ పత్రం దాఖలు చేయలేదు. విషయం పబ్లిక్ డొమెయిన్ లో ఉంటే చాలనేదే ముఖ్యమంత్రి ఉద్దేశం. అందుకే రహస్యంగా లేఖ రాసి ఊరుకోలేదు. దానిని ప్రభుత్వ సలహాదారైన అజయ్ కల్లం ద్వారా బహిర్గతం చేశారు. తాము ఆశించిన ప్రయోజనం దాంతో నెరవేరి పోయింది. జగన్ మోహన్ రెడ్డిపై రాజకీయంగా ప్రతీకారం తీర్చుకునే ఛాన్సు టీడీపీకి లభించినట్లయింది. కానీ ఈ విషయాన్ని మరోసారి రచ్చ చేయడం ఎత్తుగడ మాత్రమే. అందుకు న్యాయస్థానాలనే ఆశ్రయించాలి. దీనివల్ల తమకు లభించే రాజకీయ ప్రయోజనాలు ఎలా ఉంటాయో తెలియదు. ఒక్కోసారి బూమ్ రాంగ్ కూడా కావచ్చని టీడీపీలో మేధావి వర్గం తటపటాయిస్తున్నట్లు చెబుతున్నారు. పైపెచ్చు ప్రధాన న్యాయమూర్తిని చికాకు పరిచే చర్య అవసరమా? అన్న సంశయమూ నెలకొంది. ఒకవేళ తమ పరువకు భంగమని భావిస్తే న్యాయస్థానమే తనంతతాను చర్యలు తీసుకుంటుందనే వాదన కూడా ఉంది.

అన్నిటికీ సిద్దమే..

జగన్ మోహన్ రెడ్డి లేఖను ప్రభుత్వ సలహాదరాు బయటపెట్టినప్పుడే పర్యవసానాలకు వైసీపీ నాయకత్వం సిద్దమైంది. తాజాగా వెలువడిన సుప్రీం కోర్టు వివరణ ఆ పార్టీని ఆశ్చర్యపరచలేదు. పైపెచ్చు ఈ అంశాన్ని తెలుగుదేశం పార్టీ టేకప్ చేస్తే తమకే రాజకీయ ప్రయోజనాలు కలిసి వస్తాయనే భావన ఉంది. ఇందులో సామాజిక పరమైన కోణమూ ఇమిడి ఉంది. అంతేకాకుండా ఏప్రిల్ 24 న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రమణ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆ తర్వాత ఈ కేసును టేకప్ చేయడంలో కొంత ఇబ్బంది ఉండవచ్చు. ఆ లోపు కనుక టీడీపీ స్పందించలేకపోతే సర్వోన్నత న్యాయస్థానమూ దీనిని పట్టించుకోకపోవచ్చునంటున్నారు. అయినప్పటికీ న్యాయస్థానానికి తనను తాను రక్షించుకునే వ్యవస్త ఉంది. తెలుగుదేశం ఈ విషయంలో తలదూరిస్తే బొప్పి కట్టించుకున్నట్లవుతుందని కొందరు పేర్కొంటున్నారు. ఏదేమైనా ప్రతి చిన్న అంశాన్ని రాజకీయ దుమారం చేస్తున్న టీడీపీ, వైసీపీలు ఈ విషయంలో మౌనం వహించడం మేలైన పరిణామమే. ప్రాప్తకాలజ్ణతగా చెప్పాలేమో…?

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News