బుక్ అయిపోతే అంతేనా …?

దేశంలో కరోనా రక్కసి విజృంభించకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలే తీసుకున్నా లాక్ డౌన్ లో నరకం చూస్తున్నారు వేలాదిమంది ప్రజలు. ముఖ్యంగా ఏపీ లో [more]

Update: 2020-03-30 11:00 GMT

దేశంలో కరోనా రక్కసి విజృంభించకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలే తీసుకున్నా లాక్ డౌన్ లో నరకం చూస్తున్నారు వేలాదిమంది ప్రజలు. ముఖ్యంగా ఏపీ లో వివిధ పనులపై వెళ్ళి అక్కడి నుంచి కుటుంబం తో సొంత గూటికి చేరుకోలేక అల్లాడిపోతున్నారు. చేతిలో తెచ్చుకున్న డబ్బులు అయిపోయాయి. అప్పు ఇచ్చే నాథులు లేరు. రోడ్డు మీదకు వెళితే లాఠీ దెబ్బలు తప్ప కడుపు కి పట్టెడన్నం పెట్టేవారు లేరు. ఊరు దాటి ఊరు వెళ్లడం ఇప్పుడు సర్కారీ ఆంక్షల నడుమ పెద్ద రిస్క్ తోకూడిన పనే. పైగా ఒకవేళ ఏ అర్ధరాత్రో వెళ్ళి దొరికితే నేరుగా క్వారంటైన్ సెంటర్ కి తరలించాలని హెల్త్ ప్రోటోకాల్. ఇలా అయితే తమ గతేమిటని ప్రశ్నిస్తున్నారు బాధితులు.

ఉత్తరాంధ్ర, కోస్తా ఆంధ్ర , రాయలసీమల్లో వేలమంది …

ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల నుంచి అలాగే రాయలసీమ నుంచి గోదావరి జిల్లాలకు విశాఖకు వెళ్లి వేలమంది బంధువుల ఇళ్ళల్లో స్నేహితుల ఇళ్ళల్లో ఉంటూ నరకం చూస్తున్నారు. ఎప్పుడు తమకు నిర్బంధం తప్పుతుందా అని బుక్ అయిన వారు వేదన తో నలిగిపోతున్నారు. వారం పదిరోజులంటే ఎదో గెంటుకొద్దామనుకుంటే కరోనా వైరస్ పై యుద్ధం ఏ నాటికి ముగుస్తుందో ప్రభుత్వాలే చెప్పలేని దుస్థితిలో తమ దయనీయ స్థితిని అర్ధం చేసుకుని సొంత రాష్ట్రంలో అత్యవసర కారణాలతో తిరిగే వారికి అనుమతి ఇవ్వాలని అభ్యర్థిస్తున్నారు. ఉన్న చోట పరాయివారిపై ఆధారపడి కొందరు లాడ్జీలు, అతిధి గృహాల్లో కొందరు కుటుంబాలు కుటుంబాలతో బండి లాగిస్తున్నారు. ఇది వీరిని మొహమాటంతో భరించేవారికి ఇబ్బందిగా ఉంది. తెచ్చుకున్న డబ్బులు అయిపోయి, ముక్కుమొహం తెలియని ఊళ్లో ఎన్నాళ్ళు ఉండాలన్నది వీరి వేదన.

వారిని వదిలి మాపై నిర్బంధం … ?

చైనా లో కరోనా రక్కసి ప్రబలి యూరప్ దేశాలకు అమెరికాకు విస్తరిస్తున్నా పటిష్ట చర్యలు చేపట్టని ప్రభుత్వం 15 లక్షలమందిని నిర్బంధించడం వదిలిపెట్టి 130 కోట్ల మంది ని స్వీయ నిర్బంధం లోనికి నెట్టడం దారుణమని అంటున్నారు. అది కూడా సమయం ఇవ్వకుండా ఆకస్మిక లాక్ డౌన్ తో ఎక్కడివారు అక్కడే ఉండిపోవాలిసి వచ్చిందని వాపోతున్నారు. అదే విదేశీ విమానాల రాక పోకలకు, స్వదేశీ విమానాల రాకపోకల విషయంలో మాత్రం పరిమిత సమయాన్ని ప్రకటించి డబ్బున్న వారి పట్ల ఒకలా సామాన్యుల పట్ల మరోలా నిర్ణయాలు తీసుకోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. బస్సులు, రైళ్ళు ఉన్నవి ఉన్నట్లుగా నిలిపివేసి, సొంత వాహనాల్లో సైతం సొంత ఊర్లకు వెళ్లనీయకపోవడం ఏమిటని తమ వ్యయప్రయాసలు ఎవరు భరిస్తారని నిలదీస్తున్నారు. తక్షణం ముఖ్యమంత్రి జగన్ స్పందించి ఎపి లోని వివిధ జిల్లాల్లో చిక్కుకున్న వారికి సొంత ఇంటికి వెళ్లేందుకు అనుమతించి వారిని హోమ్ క్వారంటైన్ గా నమోదు చేసినా అభ్యంతరం లేదని సూచిస్తున్నారు.

Tags:    

Similar News